Take a fresh look at your lifestyle.

తొందరపాటు నిర్ణయాలు తెస్తున్న చిక్కులు

కాశ్మీర్‌ ‌విభజనతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కావడమే కాకుండా, అక్కడ వాణిజ్య, పారిశ్రామిక కార్యక్రమాలు ప్రారంభించేందుకు దేశ ప్రజలకు అనుమతి లభించగలదనీ, కాశ్మీర్‌లో భూములు కొనుక్కోవచ్చంటూ కేంద్రం ప్రకటన చేసిన మరునాడే స్థానిక ప్రధాన రాజకీయ పార్టీ అయిన పీడీపీ నాయకుడు సురీందర్‌ ‌చౌదరి నోటికొచ్చినట్టు మాట్లాడారు. కాశ్మర్‌లో భూములు కొని ఇతర ప్రాంతాల వారు స్థిరపడితే లైంగిక దాడులు పెరుగుతాయంటూ ఆయన హెచ్చరించారు. ఆయన చిన్నా చితకా నాయకుడు కాదు. బీజేపీతో కలిసి కొంత కాలం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిన పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి అత్యంత సన్నిహితుడు. భూ చట్టాలలో మార్పులు వొచ్చిన తరువాత దేశంలోని ఇతర ప్రాంతాల భారతీయులు ఇక్కడ స్థిరపడటానికి వొస్తే జమ్ముకశ్మీర్‌లో లైంగికదాడులు పెరుగుతాయని ఆయన చెప్పారు. జమ్ముకు గొప్ప డోగ్రా సంస్కృతి, వారసత్వం ఉన్నదని, తాము దేశం కోసం అనేక త్యాగాలు చేశామన్నారు. ప్రజలు బయటి నుంచి ఇక్కడికి వొస్తే ఇక్కడి యువతకు రావాల్సిన ఉద్యోగాలను కొల్లగొడతారని చౌదరి అన్నారు. ఇవ్వాళ జమ్ము ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉన్నదని, జమ్ములో చదువుకోవడానికి మహిళలు వివిధ గ్రామాల నుంచి వొస్తున్నారని చెప్పారు. నిన్న ఫరీదాబాద్‌లో..అంతకు ముందు హత్రాస్‌లో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందేనని తెలిపారు. భూ యాజమాన్యంతో సహా అనేక చట్టాలను సవరించడానికి మంగళవారం కేంద్రం తీసుకున్న చర్య కేంద్ర భూభాగంలోని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్నది. గతేడాది ఆగస్టులో ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ ‌లను రద్దు చేయడానికి ముందు జమ్ముకశ్మీర్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీలుండేది కాదు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాను తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోందంటూ బీహార్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఘనంగా చెప్పుకొచ్చారు. నిజానికి ఆ నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో వర్ణిస్తే అది చర్విత చరణం అవుతుంది. ఇప్పుడు కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభావమే ఇది. అంతేకాక, ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ ‌కాన్ఫరెన్స్), ‌మెహబూబా ముఫ్తీ(పీడీపీ) వంటి ప్రముఖులను గృహనిర్బంధంలో ఉంచారు. దీంతో ఈ పార్టీలు కేంద్రం పట్ల వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. సురీందర్‌ ‌చౌదరి ఇంత దారుణమైన ప్రకటన చేయడం వెనుక ఆ పార్టీ కేంద్రంపై వెలిబుచ్చుతున్న ఆగ్రహావేశాలు కారణం కావచ్చు. కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం తొలి ప్రధాని నెహ్రూ చేసిన ఘోరమైన తప్పిదమన్నది బీజేపీ, దాని మాతృక అయిన భారతీయ జనసంఘ్‌ అభిప్రాయం. ఆ అంశంపైనే బీజేపీ రాజకీయ పునాదిని నిర్మించుకుంది. అయితే, దీనిని రాజకీయ కోణం నుంచి కాకుండా, వాస్తవిక దృష్టితో పరిశీలిస్తే సార్వభౌమాధికారం కలిగిన ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు పతాకాలు ఉండటం సహించరాని విషయమే. గడిచిన ఆరేడు దశాబ్దాలు పైగా కాశ్మీరీ నాయకులు కేంద్రంపై తీవ్రమైన వొత్తిడి తెచ్చి తమ పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. దీనిని రద్దు చేసిన ఘనత తమ పార్టీదేనని బీజేపీ చెప్పుకుంటోంది.

అందులో కొంత నిజం ఉన్నా, రాష్ట్రానికి చెందిన నాయకులందరినీ గృహనిర్బంధంలో ఉంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ నిర్ణయం బెడిసి కొడుతుందన్న విషయం ఇప్పుడు వాస్తవంలోకి వొచ్చింది. కాశ్మీరీ నాయకులు కొద్ది రోజుల క్రితమే పార్టీ విభేదాలను పక్కన పెట్టి 370వ అధికరణం కోసం పోరాడాలని నిర్ణయించారు. ఇందుకోసం చైనా మద్దతు తీసుకుంటామంటూ ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యేసరికి మాట మార్చారు. తమ పోరాటం దేశానికి వ్యతిరేకం కాదనీ, బీజేపీపైనేనని ఫరూక్‌ అబ్దుల్లా వివరణ ఇచ్చారు. అది మొక్కుబడి ప్రకటన అని ఇప్పుడు సురీందర్‌ ‌చౌదరి ప్రకటన రుజువు చేస్తోంది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అయి, కాశ్మీర్‌ ‌భారత్‌లో అంతర్భాగంగా మారినప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు అక్కడ భూములు కొనుక్కుంటే తప్పేమిటి. ఇతర ప్రాంతాల వారు అక్కడికి వెళ్ళి స్థిరపడితే తప్పేమిటి వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం తీసుకుని వొచ్చిన ఉత్తర్వు తమను గాయపర్చినట్టుగా కాశ్మీరీలు భావిస్తున్నారు. ఏడాది పాటు గృహనిర్బంధంలో గడిపిన నాయకుల పట్ల రాష్ట్రంలో సానుభూతి ఉండటం సహజం. ఇప్పుడు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు వారు ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్రం చాకచక్యంగా, నేర్పుగా వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాలే తప్ప మరింత రెచ్చకొట్టే రీతిలో చర్యలు తీసుకోవడం సమంజసంకాదు.

కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో తప్పేమీ లేకపోయిన, ఇప్పటికిప్పుడు కాశ్మీర్‌ ‌వెళ్ళి వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అలాగే, భూములు కొనుగోలు జరిపేందుకు కూడా ఎన్నో అవాంతరాలు ఉంటాయి. కాలక్రమంలో జరిగే పనులకు ఇప్పటి నుంచి అనుమతులు ఇచ్చేశామని చెప్పుకోవడం రాజకీయంగా లబ్ధి కలగవొచ్చు కానీ, వాస్తవంగా అక్కడ అమలు జరగదు. ఈ విషయం కేంద్రానికి తెలియంది కాదు. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి 370 అధికరణం పునరుద్ధరణపై హామీ ఇచ్చిన దానికి సమాధానంగా ప్రధాని మోడీ దానిని పునరుద్ధరించడానికి పార్లమెంటు ఆమోదం వంటి తతంగాలు పూర్తి కావాలని చెప్పాలే గానీ, కాశ్మీర్‌లో వ్యాపారాలు చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించామని చెప్పడం రాజకీయ లబ్ధి కోసమే. ఇవన్నీ కాశ్మీరీ పార్టీలు గమనిస్తున్నాయి. అందుకే, కాశ్మీర్‌లో ఉద్యోగ సమస్య, వృత్తి, వ్యాపార సమస్యలు తలెత్తే ఎటువంటి అనుమతులనూ అంగీకరించమంటూ పీడీపీ నాయకుడు హెచ్చరించారు. ఆయన తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ, ఇతర ప్రాంతాల వారు కాశ్మీర్‌ ‌వొస్తే లైంగిక దాడులు జరుగుతాయని హెచ్చరించడం సబబుగా, సంస్కారయుతంగా లేదు. అలా అన్నందుకు ఆయనపై చర్య తీసుకోవాలి. పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీని కేంద్రం హెచ్చరించాలి. ఇలాంటి ప్రేలాపలనలను భారతీయులెవరూ సహించరని స్పష్టం చేయాలి. కేంద్రం చేస్తున్న ప్రయోగాలు, తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావాల వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Leave a Reply