Take a fresh look at your lifestyle.

అవినీతి ఆరోపణల ఆస్త్రం – విపక్షాల పోరాటం

వొచ్చే ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునే దశగా రాష్ట్రంలోని విపక్షాలు ఇప్పటినుండే పావులు కదుపుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన ఈ ఏడు సంవత్సరాలకాలంలో ప్రజలు ఆశించిన మేరకు ఫలాలను అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియామకాలన్న టాగ్‌లైన్‌తో పోరాటం సాగించిన ఇక్కడి ప్రజలు వాటిని నేటికీ పొందలేకపోతున్నారంటూ చాలా కాలంగా విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఆ పార్టీలు తీవ్రప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇంతకాలం అభివృద్ధిపై ప్రశ్నిస్తూ వొచ్చిన ఈ పార్టీలు ఇప్పుడు అవినీతిపై ప్రభుత్వాన్ని నిలదీసే పనిలో పడ్డాయి. వొచ్చే ఎన్నికలనాటికి ఈ వాయిస్‌ను మరింతగా పెంచే దృక్పథంతో ఆ పార్టీలు ముందుకు పోతున్నాయి. ఇటీవల ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ ‌తర్వాత ఈ వాయిస్‌ ‌విపక్షాలనుండి బాగా వినిపిస్తున్నది. అయితే ఈటల రాజీనామా తర్వాత ఖాలీ అవుతున్న హుజురాబాద్‌ ‌శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు తమ గొంతు పెంచే ప్రయత్నం చేస్తున్నాయన్న ఆరోపణకూడా లేకపోలేదు. ఏమైనా 2023లో తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో రాష్ట్ర రాజధానిపై కాషాయ జంఢా ఎగురవేయాలని ఉత్సాహపడుతున్న భారతీయ జనతాపార్టీ ఈ విషయంలో దూకుడుగానే ముందుకు పోతున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇటీవల చేస్తున్న ప్రకటనలు పరిశీలిస్తే ఇదే అంశాన్ని ఎత్తిచూపుతున్నట్లున్నాయి. అధికారపార్టీలోని అవినీతి నాయకుల చిట్టాతోపాటు, ముఖ్యంగా ముఖ్యమంత్రి అవినీతిని బయటపెట్టే పనిలో ఉన్నామంటూ ఆయన ఇటీవల కాలంలో ఇదే అంశంపై పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలియంది కాదు.

ఈ విషయంలో తాము చేస్తున్న ఆరోపణలేవీ ఉత్తవేమీ కాదని, ఒక్కొక్క అవినీతి అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నామని చెబుతున్నాడు. గత వారం పదిరోజులుగా తమ పార్టీ ఇదే పనిలో ఉందంటూ హెచ్చరిస్తున్నాడు. ఇప్పటివరకు తమ వద్ద కెసిఆర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన మరో పద్దెనిమిది మంది ముఖ్యనేతల సమాచారాన్ని కూడా సేకరించడమైందని, నిపుణులతో న్యాయపరమైన అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. కెసిఆర్‌కు సహార, ఈఎస్‌ఐ ‌కేసులకు సంబంధించిన వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయంటున్నాడు. త్వరలో కెసిఆర్‌ను జైల్‌కు పంపడం ఖాయమనికూడా ఆయన పలు సందర్భాల్లో చెబుతూ వొస్తున్నాడు. న్యాయపరమైన అంశాలతో, కోర్టుల ద్వారా కెసిఆర్‌కు ఉచ్చు బిగించే పనిలోనే బిజెపి ఉన్నట్లు దీనితో స్పష్టమవుతున్నది. ఆ పార్టీకే చెందిన కోర్‌కమిటి సభ్యుడు వివేక్‌ ‌వెంకటస్వామి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందు కెసిఆర్‌ ఆస్తులెన్ని, ఇప్పుడు ఆయన ఆస్తులెన్ని అంటూ నిలదీస్తున్నారు. దీనిపై సిబిఐ విచారణకు గాని, సిట్టింగ్‌ ‌జడ్జ్ ‌విచారణకుగాని సిద్దమేనా అంటూ ఆయన కెసిఆర్‌కు సవాల్‌ ‌విసురుతున్నారు. ఇక ముందు సాగేదంతా కెసిఆర్‌కు ప్రజలమధ్య జరిగే పోరాటమేనంటాడాయన. తమ పోరాటమంతా కెసిఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా సాగుతుందని హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌కూడా మొదటినుండీ అవినీతి అస్త్రంగానే పోరాటం చేస్తోంది. ప్రాజెక్టులు, నిర్మాణాలంటూ ప్రభుత్వం వ్యయం చేస్తున్నదానిలో కెసిఆర్‌ ‌కుటుంబం ఏమేరకు లబ్దిపొందుతున్నదన్న విషయాన్ని ఏకరువు పెడుతున్నది. ఇటీవల ఆ పార్టీ నేత ఒకరు కల్వకుంట్ల కవిత ఆస్తులపైన వేలెత్తి చూపడం గమనార్హం. తన వద్ద పూర్తి సమాచారముందంటున్నాడు. అలాగే ఈటల రాజేందర్‌ అవినీతి విషయం వెలికి వొచ్చిన తీరులో కెసిఆర్‌ ‌కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలపై ఉన్న ఆరోపణలన్నిటిపైన విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్‌ ‌నేతలు డిమాండ్‌ ‌చేస్తున్నారు. కెసిఆర్‌ను ఎలా దింపాలో తనకు తెలుసని, ఆ మందేదో తన వద్ద ఉందని తాజాగా ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, శాసనసభ్యుడు జగ్గారెడ్డి చేసిన ప్రకటనకూడా రాష్ట్రంలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. త్వరలో పార్టీ పేరును ప్రకటించబోతున్న వైఎస్‌ఆర్‌ ‌షర్మిల కూడా మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ అవినీతి విధానాలను ప్రశ్నిస్తున్నది. తాజాగా అమె రాష్ట్రంలో ఏర్పడిన వ్యాక్సిన్‌ ‌కొరతపై మాట్లాడుతూ మీకు చేతకాకనా, కమీషన్లకు అశపడా, ఇంకా ఎన్నాళ్ళు దొర మూతకండ్ల పరిపాలన అంటూ నిలదీస్తుండడం చూస్తుంటే అమె కూడా ఇక ముందు ఘాటుగానే స్పందించబోతున్నట్లు కనిపిస్తున్నది. మొత్తానికి అధికారపార్టీలో అవినీతి రాజ్యమేలుతుందన్న విషయంలో విపక్షాలన్ని కోడై కూస్తున్నాయి. సాక్షాలతో త్వరలో ప్రజలముందుకు వొస్తామంటుండగా విపక్షపార్టీలవెప్పుడు తుంపర్ల బలమేగాని, ఇంతవరకు ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేక పోయాయంటూ గొణుక్కుంటున్నారు ప్రజలు.

Leave a Reply