Take a fresh look at your lifestyle.

ఆగమ్యగోచరంగా అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి

“వారు ఈదేశ పౌరులు కాదా? మీకు వోటు వెయ్యలేదా? 21రోజులపాటు ఏ పనీ లేకుండా, ఆదాయం లేకుండా వారెలా జీవిస్తారు? వంద మహానగరాల నిర్మాణం అని ప్రకటించుకోబట్టేగా, గ్రామాలల్లో పనులులేక, వ్యవసాయం కలిసిరాక ఇంతమంది జనం కడుపు చేతబట్టుకుని పిల్లాపాపలతో కనీస అవసరాలను కూడా ఆశించకుండా నగరాల నిర్మాణంలో పాలు పంచుకోవడానికి వచ్చింది. కనీసం వారిని తమ స్వంత ప్రాంతాలకు చేరుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా అమానవీయంగా ప్రవర్తించింది ఎవరు? కొరోనా వైరస్‌ ‌కారణంగా విదేశాలలో చిక్కుకుపోయిన వారికోసం ప్రత్యేక విమానాలను పంపి మరీ తీసుకువచ్చిన ఈ ప్రభుత్వాలు, ఆ వైరస్‌ ‌వ్యాప్తిలో ఏ ప్రమేయంలేని ఈ అసంఘటితరంగ శ్రామికులని మాత్రం నిర్దాక్షిణ్యంగా వదిలివేసి, వారిని క్రూరమైన నిర్బంధానికి గురిచేసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయి.”

k sajayaజనవరి నుంచే ప్రపంచ వ్యాపితంగా ప్రజల ఆరోగ్యం మీద ఈ కొరోనా వైరస్‌ ‌ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినా గానీ ఆ హెచ్చరికలను కనీసంగా కూడా చెవిన వేసుకోకపోగా ఆర్భాటంగా అగ్రరాజ్య అధ్యక్షుడికి ఆహ్వానం పలికే దానిలో మన కేంద్ర ప్రభుత్వం మునిగిపోయింది. జాతీయ ప్రతిపక్షపార్టీ కనీసం ఫిబ్రవరిలో పదేపదే చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. ఇతరదేశాలలో కొరోనా సృష్టిస్తున్న ప్రకంపనాలను వినిపించుకోలేదు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అంచనా వేయలేదు. వైద్యపరంగా తీసుకోవాల్సిన వ్యవస్థాగత చర్యలను బలోపేతం చేయలేదు. ప్రత్యేక బడ్జెట్‌ను ప్రకటించలేదు. కనీసం కేరళ వంటి రాష్ట్రాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను పట్టించుకోలేదు. వైరస్‌ ‌సృష్టించే ప్రమాద ప్రకంపనల గురించి మనదేశ ప్రజలకు సులభ పద్ధతిలో అవగాహన కలిగించే ప్రచార కార్యక్రమాల రూపకల్పన జరగలేదు. తీరా ప్రమాద ఘంటికలు మోగటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఎంత హడావుడిగా చేసినప్పటికీ ప్రజలకు అర్థమయ్యేలా సమాచారం వెళ్ళలేదు. పరిస్థితి పూర్తిగా తమ చేతుల్లోంచి వెళ్ళిపోయే పరిస్థితిలో జనతా కర్ఫ్యూ అంటూ, వైద్య బృందాలకు మద్దతుగా పళ్ళాలు మోగించడం అంటూ ప్రజలకు విషయం తీవ్రతను అర్థం కాకుండా పలుచన చేసారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వైద్య బృందాలకు కావలసింది అపరిమితమైన మానవ, ఆర్థిక, పరిశోధన, సాంకేతిక వనరులు. పనిచేయగలిగిన పరిస్థితులు. అంతే గానీ, వీటి గురించి ఏమీ మాట్లాడకుండా, మీరు దేముళ్ళు, మహర్షులు అంటూ చప్పట్లు కొడితే సరిపోతుందా? ఆలస్యంగా మేలుకోవటం వల్ల జరిగిన నష్టం ఒకటి ఆరోగ్యపరంగా అయితే, రెండోది లాక్‌ ‌డౌన్‌ ‌పేరుతో పూర్తిగా కుప్పకూలిపోబోతున్న దేశ ఆర్థికవ్యవస్థ. చెల్లాచెదురైన సామాన్యుల జీవితాలు.

కంటికి కనిపించని ప్రమాదం కొరోనా కోవిద్‌-19 ‌వైరస్‌ అయితే, దాని గమనాన్ని తెంపే పనిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘సర్వం నిలుపుదల’(లాక్‌ ‌డౌన్‌) ‌కోట్లాదిమంది మంది జీవితాలని ఆగమాగం చేసింది. అత్యంత కీలమైన నిర్ణయాన్ని ప్రభుత్వాలు ప్రకటించేముందు వాటి పర్యసానాలను అన్నికోణాల్లో ఆలోచిస్తాయని కనీసం ఆశిస్తాము. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల కోట్లాదిమంది అసంఘటిత కార్మికుల జీవితాల మీద కోలుకోలేని దెబ్బ పడింది. రాష్ట్రంలో పెరుగుతున్న కొరోనా సంఘటనలు అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం మార్చ్ 31‌వరకూ రవాణాతో సహా పూర్తి బంద్‌ని ప్రకటించినప్పుడే పరిస్థితి ఎలా మారబోతోందో అని ప్రజలు ఆందోళనపడ్డారు. కొనుగోలు శక్తివున్న ప్రతివారూ దుకాణాల మీద ఎగబడి మరీ నిత్యావసర వస్తువులు అవసరానికి మించి కొనుగోలు చేసుకున్నారు. హైదరాబాద్‌కు దగ్గర ప్రాంతాలకి వెళ్ళగలిగినవారు రాత్రికి రాత్రే ప్రయాణమయి అందుబాటులోవున్న వాహనాలలో తరలివెళ్లిపోయారు. ఎప్పుడైతే కేంద్రప్రభుత్వం మార్చ్ 24‌న దేశమంతా అన్ని రవాణా సౌకర్యాలను ఆకస్మికంగా ఆపేసి లాక్‌ ‌డౌన్‌ని ప్రకటించిందో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

ఒక్కరోజు గడిచేటప్పటికీ దేశంలోని అన్ని జాతీయ రహదారులమీద తట్టబుట్ట, పిల్లాపాపలతో వందలాది మైళ్ళు నడుచుకుంటూ తమ స్వంత ఊర్లకు ప్రయాణమయ్యారు. కరోనాని అరికట్టటానికి ఇంట్లో వుండమంటే రోడ్ల మీదకు వచ్చారని, కొరోనాని వ్యాప్తిచేసే దుర్మార్గులు, బాధ్యత లేనివారంటూ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పోలీసులు అత్యంత దుర్మార్గంగా వారి మీద లాటీలతో విరుచుకుపడటం కూడా చూశాం. అత్యంత దుర్మార్గంగా మోకాళ్ళ మీద నడిపించడం చూశాం. కొరోనా వ్యాప్తి చెందకుండా వుండాలంటే బయటకు వచ్చినందుకు వాళ్ళని అలానే కొట్టాల్సిందే అని సుఖంగా ఇళ్ళల్లో కూర్చుని అయాచితంగా వచ్చిన సెలవులని ఆనందిస్తూ అదే దేశానికి చేసే ఉపకారం, బాధ్యత అనుకుంటూ కూర్చున్న ఉన్నత, మధ్యతరగతి వర్గం, ఈ కోట్లాదిమంది మంది జనం ఏ పరిస్థితుల్లో స్వంత ఊర్లకు కాలినడకన ప్రయాణమైనారనే ఆలోచన కూడా చేయకుండా పోలీసు హింసను నిస్సిగ్గుగా సమర్థించడం చూస్తే మనం ఎలాంటి దేశంలో వున్నామనే దుఃఖం రాదా? ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అనాలోచితంగా శాంతిభద్రతల సమస్యగా చూసి, నిర్బంధంతో కట్టడి చేయాలనుకున్నారు. జనతా కర్ఫ్యూ అంటూ ఒకపూట బంద్‌ను మూడురోజుల ముందు ప్రకటించినప్పుడు, అదే సమయంలో అవసరమైతే ఈ బంద్‌ ‌మరికొన్ని రోజులు కొనసాగుతుంది అని ఎందుకు ప్రజలను సన్నద్ధం చేయలేదు? ఎందుకంటే, వైద్య పరంగా రాబోయే తీవ్రతను హేతుబద్ధంగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేయలేదు కాబట్టి! కొరోనా వైరస్‌ ‌సమూహ వ్యాప్తి దశలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మనుషులు తమ ప్రయాణాల్ని రద్దు చేసుకుని ఇంట్లోనే ఉండటమనేది సాంకేతికంగా సరైనదే! కానీ ఈ దేశంలో అందరికీ ఇళ్లు లేవే! దేశం నలుమూలల్నించీ వచ్చి ఈ అందమైన ఇళ్ళ నిర్మాణంలో పాల్గొనే వాళ్ళంతా ఎక్కడ జీవిస్తారో వీళ్ళకు తెలుసా? ఆకాశాన్నంటే భవంతుల పక్కనే ప్లాస్టిక్‌ ‌పట్టాలతో గూడు కట్టుకుని నీళ్ళు, మరుగుదొడ్డి వంటి కనీసపాటి సౌకర్యాలు లేకుండానే, ఒకపూట కూడా కడుపునిండా తినకుండా అనేకమంది జీవిస్తున్నారనే ఎరుక ఈ అసందర్భ ప్రేలాపనలు వాగే, రాసే ఎవరికైనా ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడైతే ప్రభుత్వం బంద్‌ ‌ప్రకటించిందో, సమయం కూడా ఇవ్వకుండా మార్కెట్ల మీద ఎగబడి మూడు నాలుగు నెలలకు సరిపడా సామానులు కొనుక్కుని దాచుకున్నది ఈ వర్గాలే! తమ జీవితాలతో ముడిపడివున్న దిగువ తరగతిని, వారి సేవలు లేకపోతే రోజైనా గడవలేని ఈ ‘బాధ్యత కలిగిన వ్యక్తులు’ ఆ సామాన్యులను పట్టించుకోలేదనే అంశం తేటతెల్లమైపోయింది. ఎక్కడి హైదరాబాదు, ఎక్కడ విశాఖపట్నం జిల్లా? వీటి మధ్య దూరం ఐదువందల కిలోమీటర్ల పైన. ఉత్తరప్రదేశ్‌…‌పదమూడు వందల కిలోమీటర్లు. ఊహించగలమా ఈ ప్రాంతాలకు నడిచి వెళ్ళే ప్రయత్నం ఎవరైనా చేస్తారని? ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి. ఒక్కసారిగా తమ ప్రమేయం ఏమీ లేకుండా ఆగిపోయిన సమస్త ఉత్పతి వారిని రోడ్డు పాలు చేసింది. పనిలేకుండా తమదికాని ప్రాంతంలో వుండటం అనేది అత్యంత అసాధ్యమైన పరిస్థితి. కష్టమని తెలుసు, అయినాగానీ ప్రాణాలకు తెగించి తమ స్వంత ఊర్లకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఊరు చేరటం తప్ప మరో మార్గం కనిపించలేదు వారికి! మనం సుఖంగా వుండటం కోసం, సౌకర్యంగా పనిచేసుకోవటం కోసం కట్టిన భవంతుల పరిసరాల నుంచీ, మనం సాఫీగా ప్రయాణించడం కోసం వేసిన రోడ్ల మీద వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు. అవును వాళ్లేసిన రోడ్ల మీదే మాడుస్తున్న ఎండవేడిలో దస్సిపోతూ వాళ్ళు నడుస్తున్నారు.

 

తాము కట్టిన భవంతుల్లో తమ కింత చోటుఉంటుందని వాళ్లెప్పుడూ ఆశించి ఉండకపోవచ్చు కానీ, ఇంత హటాత్తుగా నగరం పరాయిదైపోతుందని ఊహించి వుండరు. చేస్తున్న పని ఆగిపోవటం, ఎన్నిరోజులు అలా ఏ పనీ లేకుండా ఉండాలో తెలియక పోవటం, ఊర్లలో కుటుంబ సభ్యులు ఎలా వున్నారోనన్న ఆందోళన వేల మైళ్ళ దూరాన్ని లేక్కచేయనీయలేదు. అది తెగింపుతో వచ్చిన నిర్ణయం కాదు, నిస్సహాయతతో తీసుకున్న భారం. వెళ్తున్న అందరూ చెప్పినదొకటే, వైరస్‌ ‌వచ్చి చచ్చిపోయినా కనీసం తమవాళ్ళ మధ్యలో చనిపోతామనే! బహుశా, బ్రిటిష్‌ ఇం‌డియా నుంచీ భారత, పాకిస్తాన్‌గా జరిగిన దేశ విభజన సమయంలో ఇరుదేశాల మధ్య అత్యంత బాధాకరమైన సమూహపు నిరంతర కాలినడకల వలసల తర్వాత అంత తీవ్రంగా దేశమంతా జరిగిన, ఇంకా జరుగుతున్న విషాదకరమైన తిరుగు వలసలు ఇవే! ఈ ప్రయాణంలో ఇప్పటికే కొంతమంది పసిపిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. సామాజిక, ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలు దుఃఖ పూరితంగా వున్నాయి. ఇంత అనాలోచితమైన నిర్ణయాన్ని ప్రశ్నించకుండా ఎందుకు వుండాలి? దేశప్రధానిగా ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ నిర్ణయంతో కొన్ని కోట్ల జీవితాలు ముడిపడి వున్నప్పుడు వాటి గురించి ఎందుకు ఆలోచించలేదు? విపత్తుల నివారణ అంటే వచ్చిన తర్వాత ఆలోచించేది కాదు, ముందే ఊహించగలగాలి! అందుకు తగిన ప్రణాళిక సిద్ధంగా వుండాలి.

 

ప్రజల పరిస్థితి అల్లకల్లోలమైపోయిన తర్వాత తీసుకునే చర్యలు ఎంతవరకూ పనిచేస్తాయి? అటువంటి నివారణ చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదన్నదే ప్రశ్న? ఏం ఈ పేద ప్రజలవి జీవితాలు కాదా? వారు ఈదేశ పౌరులు కాదా? మీకు వోటు వెయ్యలేదా? 21రోజులపాటు ఏ పనీ లేకుండా, ఆదాయం లేకుండా వారెలా జీవిస్తారు? వంద మహానగరాల నిర్మాణం అని ప్రకటించుకోబట్టేగా, గ్రామాలల్లో పనులులేక, వ్యవసాయం కలిసిరాక ఇంతమంది జనం కడుపు చేతబట్టుకుని పిల్లాపాపలతో కనీస అవసరాలను కూడా ఆశించకుండా నగరాల నిర్మాణంలో పాలు పంచుకోవడానికి వచ్చింది. కనీసం వారిని తమ స్వంత ప్రాంతాలకు చేరుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా అమానవీయంగా ప్రవర్తించింది ఎవరు? కొరోనా వైరస్‌ ‌కారణంగా విదేశాలలో చిక్కుకుపోయిన వారికోసం ప్రత్యేక విమానాలను పంపి మరీ తీసుకువచ్చిన ఈ ప్రభుత్వాలు, ఆ వైరస్‌ ‌వ్యాప్తిలో ఏ ప్రమేయంలేని ఈ అసంఘటితరంగ శ్రామికులని మాత్రం నిర్దాక్షిణ్యంగా వదిలివేసి, వారిని క్రూరమైన నిర్బంధానికి గురిచేసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయి. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. వాళ్ళు తమ ఉపాధి కోల్పోయారు. జీవితాలను కోల్పోయారు. వందలమైళ్ళ దూరం వారి అంతంత మాత్రపు ఆరోగ్యాలను మరింత దిగజారుస్తుంది. ఇంట్లో వుండి శరీరాలు పెంచుకోగలిగిన ప్రత్యేక సౌకర్యం వారికి లేదు. ఈ లాక్‌ ‌డౌన్‌ ‌వైరస్‌ని కట్టడి చేస్తదో లేదో కానీ ఈ శ్రామికుల జీవించే కాలాన్ని మాత్రం తగ్గించి వేస్తుంది. వైరస్‌ ‌చావుల కన్నా భవిష్యత్‌లో ఆకలి చావుల్ని పెద్ద ఎత్తున చూస్తామేమో అని భయం వేస్తోంది. ‘మేము అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాము’ అనిచేప్పేవేవీ కూడా ఈ వాస్తవాలను దాచిపెట్టలేవు. ఇప్పుడు వారి కోసం తీసుకుంటున్న చర్యలన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం గానే అర్థం చేసుకోవాలి. అయినా గానీ ఇప్పుడు ఆ ఆకులు కూడా ముఖ్యమే! వైరస్‌ని తుదముట్టించడం, ఇప్పుడు ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితిని ఎదుర్కోవటం రెండూ కూడా కేవలం ప్రభుత్వం చేతిలో మాత్రమే లేదు. ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం ఇప్పుడు.

Leave a Reply