Take a fresh look at your lifestyle.

పరిస్థితి చేజారుతుందా ..!..

కోవిడ్‌ ‌రెండవ దశ చాలా తీవ్రంగా ఉంది..దేశవ్యాప్తంగా చాలా వేగంగా కొరోనా వ్యాపిస్తుంది. 2021 ప్రారంభంలో వైరస్‌పై ఘన విజయం సాధించామని మనమేమో విజయోత్సవాలను జరుపుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైన కొరోనా ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్వస్థలాలనుంచి కొలువు ఉన్న చోట్లకు చేరుకున్న వలస కార్మికులు మళ్ళీ స్వస్థలాలకు క్యూ కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమూ, అన్నింటికీ మించి ఆరోగ్య రక్షణ వ్యవస్థ తిరిగి పెను సవాలును ఎదుర్కోవడాన్ని చూస్తున్నాం. రోగనిరోధక శక్తి తగ్గి పోవడం, కొత్త వేరియంట్స్ ‌కారణంగా కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది.

వైద్యపరమైన కారణాల కన్నా, కొరోనా చికిత్సకు సంబంధించిన రాజకీయాల వల్ల రెండోదశ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ముందస్తు హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం, ప్రజల్లో అతి ధైర్యాన్ని నూరిపోయడం వంటి కారణాల వల్ల జాగ్రత్తలను పాటించడంలో నిర్లిప్తత చోటు చేసుకుంది. మన దేశం ‘విశ్వగురు’ రూప ధారి నేతృత్వంలో కొరోనా వైరస్‌ ‌విషయంలో చాలా ధీమాగా ఉంది. కొరోనాన తరిమి వేశామనీ, మనకున్న విశ్వశక్తి వల్ల కొరోనా మొదటి దశలోనే ఆ రక్కసిని మన దేశం నుంచి తరిమి కొట్టామని ధైర్యాన్ని నూరిపోశారు. అయితే, రెండవ దశలో పరిస్థితి మారింది. మొదటి దశ కన్నా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు చిన్నవారికీ, యువకులకు కూడా కొరోనా సోకుతుంది. మన వైద్య ఆరోగ్య వ్యవస్థను కుప్పకూలే దశకు తరుముతుంది. చత్తీస్‌ ‌ఘడ్‌ ‌రాజధాని రాయపూర్‌ ‌ప్రభుత్వ హాస్పిటల్‌ ‌వెలుపల కొరోనా మృతుల శవాలు గుట్టలుగా పేరుకుని పోతున్నాయి. కొరోనా వల్ల అంతమంది ఒకేసారి మరణిస్తారని ఎవరూ ఊహించలేదు. అలాగే, గుజరాత్‌లోని సూరత్‌లో కొరోనా మృతుల శవాలను ఆరుబయలు మైదానంలో దహనం చేస్తున్నారు.

పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ సామాజిక, మతపరమైన సమూహాలకు ముఖ్యంగా కుంభమేలా వంటి కార్యక్రమాలకు పరిమితులను ఎత్తివేశారు. కుంభమేలాలో మొదటి రెండు రోజుల్లో పాల్గొన్నవారిలో వెయ్యిమందికి కొరోనా సోకినట్టు సమాచారం. గత సంవత్సరం కొరోనా వైరస్‌ ‌విస్తరిస్తున్న ప్రారంభ దశలో మర్కజీ సమావేశాల కారణంగా దిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయిన కొంత మంది వల్ల వైరస్‌ ‌విస్తరించించిందని ఆ సంస్థ పైన పలు ఆరోపణలు చేశారు. ఆ సంస్థ కార్యకలాపాలను స్తంభింప జేశారు. మర్కజీ సమావేశాలు అంతర్గత సమావేశాల్లో మందిరాల్లో జరగడం వల్ల వైరస్‌ ‌వ్యాపించిందనీ ..కుంభమేలా బహిరంగ ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి వైరస్‌ ‌వ్యాపించే అవకాశం లేదనీ పై నుంచి గంగా దేవి ఆశీర్వాదం భక్తులకు ఉంటుందని ఉత్తరాఖండ్‌ ‌ముఖ్యమంత్రి సమర్థించుకోవడం సమర్థనీయం కాదు. అంతే కాదు..జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి సాక్షాత్తు ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి, ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కావడం గమనార్హం. వీరు ప్రసంగించిన సభలకు వేలాది మంది జనం హాజరయ్యారు.

దీనికి తోడు దేశంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ ‌కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విమర్శలు వొస్తున్నాయి. మన దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పూర్తి కాకుండా విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి చేయడం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వొస్తున్నాయి. వ్యాక్సిన్‌ ఎగుమతికి సంబంధించి ప్రభుత్వం అనుసరించిన విధానం పూర్తిగా విఫలమైంది. వాస్తవం ఇలా ఉండగా వ్యాక్సిన్‌ ‌కొరత రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తున్న ప్రచారంగా ప్రభుత్వం తిప్పికొట్టాలని ప్రయత్నించింది. కానీ, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ ‌కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వమూ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణల యుద్ధం కొనసాగింది. చివరికి వ్యాక్సిన్‌ ఎగుమతలను ఆపివేశారు.

2021 ఫిబ్రవరిలోనే విదేశీ వేరియంట్స్ ‌ప్రవేశం గురించి హెచ్చరికలు వొచ్చాయి. అయితే, వైద్యఆరోగ్య అధికారులు వాటిని కొట్టివేశారు. మ్యుటెంట్‌ ‌వైరస్‌ ‌గురించి వొచ్చిన వార్తలను కొట్టివేశారు. ఆందోళన చెందవద్దంటూ ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. దానికి తోడు ప్రజల్లో కూడా నిర్లిప్తత పెరిగింది. కొరోనాను తరిమి వేశామన్న తృప్తిని ప్రజల్లో ప్రభుత్వం కలిగించింది. వ్యాక్సిన్‌ ‌తీసుకున్నామన్న ధైర్యాన్ని అందరిలో కలిగించగలిగారు. కానీ, వ్యాక్సిన్‌ ‌కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నా కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి తగ్గలేదు. మన దేశంలో రెండు వ్యాక్సిన్లు ఉన్నాయి. మూడో వ్యాక్సిన్‌కి అనుమతి ఇచ్చారు. నాయకులు, మహానాయకులు ఈ పరిస్థితిని గాలికి వొదిలేసి ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. వ్యాక్సిన్‌ ‌రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ లోగా ముటెంట్‌ ‌వేరియంట్స్ ‌తమ పని తాము చేసుకుని పోతున్నాయి. హాస్పిటల్స్‌లో బెడ్స్ ‌లేవంటున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఆరుబయలు వరండాల్లో చికిత్సలు అందిస్తున్నారు. ఈ సారి కొరోనా మరో విధంగా కాటు వేస్తున్నది.

Leave a Reply