Take a fresh look at your lifestyle.

కదిలిన ప్రగతి రథ చక్రం

  • 58 రోజుల తరువాత  రోడ్డెక్కిన బస్సులు
  • ఉదయం నుంచే బస్టాండ్లలో ప్రయాణికుల సందడి
  • బస్సు డిపోల్లో సానిటైజర్లు, మాస్కులు

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా 58 రోజుల తరువాత ఆర్టీసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లన్నీ ప్రయాణికులతో సందడిగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల బస్సులు ప్రయాణికులకు సేవలు అందించాయి. కొరోనా వైరస్‌ ‌ప్రభావం అధికంగా ఉన్న రాజధాని హైదరాబాద్‌ ‌మినహాయించి మిగతా అన్ని జిల్లాలలో బస్సులు నడుపుకోవచ్చంటూ సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించిన దృష్ట్యా ఆ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బస్సు డిపోలో శానిటైజర్లు, మాస్కులు సిబ్బందికి అందుబాటులో ఉంచారు. వైరస్‌ ‌నివారణకు శానిటైజేషన్‌ ‌ప్రక్రియను నిర్వహిస్తూనే ఆర్టీసీ సిబ్బంది సైతం విధులు నిర్వర్తించారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం నిబంధన విధించడంతో మాస్కులు ఉన్నవారినే బస్టాండ్లలోకి అనుమతించారు. బస్సులలోకి ప్రవేశించే ముందుగానే కండక్టర్లు ప్రతీ ప్రయాణికునికి శానిటైజ్‌ ‌చేశారు. అయితే, బస్సులలో భౌతిక దూరం నిబంధన పాటించాలన్న నిబంధన ఎక్కడా కనిపించలేదు. రెండు సీట్లున్న వరుసలో ఒకరిని, మూడు సీట్లున్న వరుసలో ఇద్దరిని అనుమతించాలని ముందుగా అధికారులు నిర్ణయించినప్పటికీ చాలా వరకు అన్ని సీట్లలో ప్రయాణికులను అనుమతించారు. బస్సులలో సీట్లు సైతం గతంలో ఉన్న మాదిరిగానే ఉన్నాయి. బస్సులలో నిలబడి ప్రయాణించేందుకు ప్రయాణికులను అధికారులు అనుమతించలేదు.

ఇదిలా ఉండగా, కరీంనగర్‌, ‌సిద్దిపేట వైపు నుంచి రాజధానికి వచ్చే బస్సు సర్వీసులను జేబీఎస్‌ ‌వరకే అనుమతించారు. జేబీఎస్‌ ‌నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులకు అక్కడ ఒక్క బస్సు కూడా కనిపించకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో ఆర్టీసీ అధికారులు అప్పటికప్పుడు ఆయా రూట్లకు బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే, వరంగల్‌ ‌నుంచి వచ్చే బస్సులను ఉప్పల్‌ ‌చౌరస్తా వరకే పరిమితం చేశారు. మహబూబ్‌నగర్‌, ‌కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ ‌నుంచి వచ్చిన బస్సులను పహాడీషరీప్‌ ‌వరకు, కోదాడ, సూర్యాపేట నుంచి వచ్చిన బస్సులను అధికారులు ఎల్బీనగర్‌ ‌వరకే అనుమతించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఏడు వరకే బస్సు సర్వీసులను నడిపే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు ట్రిప్పులు నడిపేందుకు బస్సులను అందుబాటులో ఉంచారు. కాగా, హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసుల నిర్వహణకు అనుమతి లేకపోవడంతో నగరంలోని డిపోలకు చెందిన బస్సులను దగ్గరిలోని ప్రాంతాలకు నడిపించారు. రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థకు ప్రధాన కూడలి అయిన ఎంజీబీఎస్‌ ‌కంటైన్మెంట్‌ ‌జోన్‌లో ఉండటంతో జిల్లాల నుంచి వచ్చే ఏ బస్సులను అక్కడికి అనుమతించలేదు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన వరంగల్‌, ‌కరీంనగర్‌, ‌ఖమ్మం, నిజామాబాద్‌, ‌సిద్దిపేట తదితర ప్రాంతాల్లోని బస్టాండ్లలో ప్రయాణికులు టికెట్‌ ‌కౌంటర్ల వద్ద భౌతిక దూరం పాటించేలా అధికారులు పర్యవేక్షణ నిర్వహించారు. కాగా, రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో బస్టాండ్లు ప్రయాణికులు లేక బోసిపోయాయి. ఆర్టీసీ బస్సులు ప్రారంభమైన మొదటి రోజే ప్రయాణికుల సందడి అధికంగా ఉంటుంది కాబట్టి వైరస్‌ ‌తమకు వ్యాప్తించే ప్రమాదం ఉందన్న భయంతో తొలి రోజే కొందరు ప్రయాణం చేయడానికి వెనుకంజవేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy