- ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో వారి కృషి
- ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కెటిఆర్
పేద దేశాల్లో కైస్త్రవ మిషనరీలు అందిస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నగరంలోని బంజారాహిల్స్‌లో బిషప్‌లు, కైస్త్రవ ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కైస్త్రవ మిషనరీలు కొన్ని దశాబ్దాలుగా విద్య, వైద్య రంగాల్లో ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎక్కడ విపత్తులు సంభవించినా సేవలు అందించ డానికి కైస్త్రవ సమాజం ముందు ఉంటుందన్నారు. విపత్తుల వేళ కూడా విశేష సేవా, సహాయం అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హిందూ ధర్మాన్ని బలంగా నమ్ముతారు. అదే సమయంలో ఇతరుల నమ్మకాలను కూడా గౌరవిస్తారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. స్వరాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ గురుకులాల్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కైస్త్రవ సమాజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
అభివృద్ధి అనేది సమగ్రంగా, సమ్మిళితంగా ఉండాలనేది తమ అభిమతమని కేటీఆర్ స్పష్టం చేశారు. చైనా కంటే మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పన లేకుండా ఎంత అభివృద్ధి జరిగినా అది వృథా అవుతుందన్నారు. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ జీఎస్డీపీ ఆరేళ్లలోనే రెట్టింపు అయిందన్నారు. తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని కేటీఆర్ తెలిపారు. కైస్త్రవుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపాడుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వారి కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చదువుకొని ఉద్యోగాలు లేని వారికి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం ఆదుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కైస్త్రవులు కోరుకున్నారన్నారు. ఈ ఆరేళ్లలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. అన్ని వర్గాలకు ప్రభుత్వం చేయుతనందిస్తోంది. కైస్త్రవుల స్మశాన వాటిక కోసం స్థలం కూడా కేటాయించి అన్ని సదుపాయాలు ఉండేలా చూస్తాం. కోవిడ్ కారణంగా మరణించిన క్రిస్టియన్ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వ పథకాలను కూడా కైస్త్రవ సోదరులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ఉద్దేశ్యంతో సమూల మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పాల్గొన్నారు.