- సంఖ్యాబలం నేపథ్యంలో నలుగురు ఎన్నికైనట్లు వెల్లడి
- ఓటమి పాలయిన టిడిపి అభ్యర్థి వర్ల రామయ్య
- చెల్లకుండా పోయిన నాలుగు టిడిపి ఓట్లు
అమరావతి,జూన్ 19 : ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎంపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండగా.. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ’రాంకీ’ అయోధ్యరామిరెడ్డి, రిలయర్స్ గ్రూపునకు చెందిన పరిమళ్ నత్వానీ పోటీ చేశారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు. పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభయింది. సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.బలం లేకున్నా బరిలో నిలిచిన టిడిపి అభ్యర్తి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు.
ఇదిలావుంటే రాజ్యసభ ఎన్నికల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 4 చెల్లని ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత వద్ద ’1’ అని నంబర్ వేయకుండా టిక్ మార్క్ పెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం ఈ చెల్లని ఓట్లు వేసినట్లు గుర్తించారు. మరో నేత కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేనని తెలుస్తోంది. వీరంతా టీడీపీకి ఓటు వేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం వేయకపోవడంతో అవి చెల్లకుండా పోయాయి. టీడీపీకి దూరంగా ఉన్న వీరంతా.. కావాలనే ఇలా చేసినట్లు ఏపీ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే 175 ఎమ్మెల్యేల్లో 173 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తన ఓటు వేశారు. ఇక టీడీపీకి ఉన్న 23 మందిలో 21 ఓట్లు పడ్డాయి. ఏసీబీ కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు,హోమ్ క్వారంటైన్లో ఉన్న అనగాని సత్యప్రసాద్ ఓటు వేయలేదు. సంఖ్యా బలం మేరకు నాలుగుకు నాలుగు సీట్లు వైసీపీయే గెలుచుకుంది.