Take a fresh look at your lifestyle.

కొరోనా రెండో దశ తీవ్రంగా ఉంది

  • కొద్ది వ్యవధిలోనే 2 లక్షల కేసులు ఆందోళనకరం
  • ప్రజల నిర్లక్ష్యంతోనే వైరస్‌ ఉధృతి పెరిగింది
  • ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాసరావు

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ఉధృతంగా ఉందనీ, కొద్ది వ్యవధిలోనే 2 లక్షల కేసులు నమోదయ్యాయని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో మార్చి 3న తొలి కేసు నమోదయినప్పటి నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నాయనీ, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. శనివారం కోఠిలోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో కొరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందనీ, ప్రజలు, ప్రభుత్వ సహకారంతో మొదటి వేవ్‌ను అడ్డుకోగలిగామనీ, కానీ రెండో వేవ్‌ ‌తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు.ఈ మధ్య ఉత్సవాలు చేసుకునేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాలోకి ప్రవేశించారనీ, వీరికి రాష్ట్రానికి చెందిన మరి కొంత మంది కలవడంతో వారికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు. వీరికి ఎక్కడి నుంచి కోరోనా సోకిందనే విషయంపై పరీక్షలు నిర్వహించగా కేవలం 12 రోజుల్లోనే సమీప గ్రామాల్లోని 433 మందికి వైరస్‌ ‌సోకినట్లు వెల్లడైందన్నారు.

కేవలం 20 మందితో మొదలై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యే వరకు పరిస్థితి వెళ్లిందన్నారు. కొరోనా తొలి దశ నుంచి ప్రజలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదనీ, కోవిడ్‌ ‌వెళ్లిందనే భ్రమలోనే ఇంకా ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు,.కొరోనా మొదటి వేవ్‌ ‌తరువాత ప్రజల్లో నిర్లక్ష్యంగా బాగా పెరిగిందనీ, అదే సమయంలో వైరస్‌ ‌కూడా మరింత బలం పుంజుకుందని తెలిపారు. .ప్రస్తుతం రాష్ట్రంలో 44 ప్రత్యేక కోవిడ్‌ ‌దవాఖానాలు ఉన్నాయనీ, 116 దవాఖానాలలో కోవిడ్‌ ‌చికిత్సలు అందిస్తున్నామని వివరించారు. గాలి ద్వారా వైరస్‌ ‌వ్యాపించే దశకు కొరోనా చేరిందని గతంలోనే ప్రజలకు స్పష్టంగా చెప్పామనీ, గతంలో ఇంట్లో ఒకరిని ఐసోలేట్‌ ‌చేస్తే సరిపోయేదనీ, ప్రస్తుతం బాధితుడిని గుర్తించే లోగానే కుటుంబమంతా వైరస్‌ ‌బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా కొరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నదనీ, కేవలం 15 రోజుల్లోనే పాజిటివ్‌ ‌రేటు రెట్టింపు దశకు చేరుకున్నదనీ ఈ సందర్భంగా డా.శ్రీనివాసరావు వెల్లడించారు.

Leave a Reply