Take a fresh look at your lifestyle.

మోగిన బడి గంట

  • తెలంగాణలో 10 నెలల తరువాత తెరుచుకున్న బళ్లు
  • రాష్ట్రవ్యాప్తంగా 14,252 పాఠశాలలు, 2462 కళాశాలలు
  • విద్యార్థులతో సందడిగా మారిన తరగతి గదులు

‌రాష్ట్రంలో మళ్లీ బడి గంట మోగింది.. 10 నెలల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ విద్యార్థులతో తరగతి గదులు సందడిగా మారాయి.  గత ఏడాది కొరోనా మహమ్మారి కారణంగా మార్చి 16 నుంచి అర్థాంతరంగా పాఠశాలలు, కళాశాలలను మూసివేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత కళాశాలల వరకు విద్యార్థులంతా ఆన్‌లైన్‌ ‌క్లాసులకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో కొరోనా ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో పాటు వ్యాక్సిన్‌ ‌కూడా అందుబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి 9 నుంచి ఆ పై తరగతులను పున:ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో పలుమార్లు చర్చలు జరిపారు. తిరిగి పాఠశాలలు తెరిచిన పక్షంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ? పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కోవిడ్‌ ‌బారిన పడకుండా తరగతులు ఎలా నిర్వహించాలి అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీంతో కేంద్రం మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ సూచలనకు అనుగుణంగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14,252 పాఠశాలలు తెరుచుకున్నాయి. తల్లిదండ్రుల అనుమతి పత్రాలు సమర్పించిన విద్యార్థులను మాత్రమే పాఠశాలలకు అనుమతించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను ఇప్పటికే పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయడానికి తగినంత సిబ్బంది లేని చోట పంచాయతీరాజ్‌ ‌సిబ్బందిని వినియోగించారు.  

పాఠశాలల ప్రవేశ ద్వారం వద్దనే శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రతీ వొక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన విధించారు. తరగతికి కేవలం 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించారు. వారి మధ్య భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ ‌చేశారు. విద్యార్థులు ఎవరి తాగునీటిని వారే తీసుకు రావాలనీ, వొకరి పెన్సిల్‌, ‌పెన్ను, పుస్తకాలు మరొకరికి ఇచ్చిపుచ్చుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా చేతులకు గ్లవ్స్ ‌వేసుకుని పాఠశాలలకు హాజరయ్యారు.

కాగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలను తీసుకున్న తరువాతనే విద్యార్థులను పాఠశాలకు అనుమతించారు. కొరోనాకు భయపడి పాఠశాలలకు పంపని విద్యార్థులకు యధావిధిగా ఆన్‌లైన్‌ ‌తరగతులు నిర్వహించారు. జిల్లాలలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు, హైదరాబాద్‌లో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే, జూనియర్‌, ‌డిగ్రీ కళాశాలల్లో పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తరగతులను నిర్వహించారు.

60 శాతం విద్యార్థులు హాజరయ్యారు : మంత్రి సబిత
రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలు పున:ప్రారంభమైన నేపథ్యంలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరో 2,3 రోజుల్లో 100 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతారని భావిస్తున్నట్లు తెలిపారు.

పాఠశాలలకు హాజరు కాని విద్యార్థులకు సైతం ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ ‌తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. 3 నెలల పాటు 70 శాతం సిలబస్‌ను ఉపాధ్యాయులు బోధిస్తారనీ, కింది స్థాయి తరగతులు ప్రారంభించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా మంత్రి సబిత వెల్లడించారు.

Leave a Reply