Take a fresh look at your lifestyle.

జిఎస్టీ వసూళ్లలో అదే రికార్డు కొనసాగింపు

సెప్టెంబర్‌ ‌లోనూ రూ.1.47 లక్షల కోట్ల వసూళ్లు

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 1 : ‌వరుసగా ఏడో నెల కూడా జీఎస్టీ వసూళ్లలో దూకుడు కొనసాగింది. సెప్టెంబరు నెలలోనూ దేశంలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 1.40 లక్షల కోట్లకు మించి జీఎస్టీ వసూళ్లు జరగడం ఇది వరుసగా ఏడోసారి. రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లలో కేంద్ర జీఎస్టీ వాటా రూ.25,271 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ వాటా రూ.31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ ‌గూడ్స్ అం‌డ్‌ ‌సర్వీసెస్‌ ‌ట్యాక్స్ (ఐజీఎస్టీ) వాటా రూ.80,464 కోట్లు. మరో రూ.10,137 కోట్ల సెస్‌ ‌కూడా కలెక్ట్ అయింది. సెస్‌ ‌కలెక్షన్లలో రూ.856 కోట్లు వస్తువుల దిగుమతులపై పన్ను విధింపు ద్వారా లభించాయి. వస్తు, సేవల లావాదేవీలు ఒకటికి మించి రాష్టాల్ర మధ్య జరిగితే అది ఐజీఎస్టీ పరిధిలోకి వస్తుంది.

వాటిని నిర్దిష్ట నిష్పత్తిలో కేంద్ర, రాష్టాల్ర జీఎస్టీ ఖాతాల్లోకి మళ్లించాల్సి ఉంటుంది. ఐజీఎస్టీ ద్వారా వచ్చిన రూ.80,464 కోట్లలో రూ.31,880 కోట్లను కేంద్ర జీఎస్టీ ఖాతాలోకి, రూ.27,403 కోట్లను రాష్ట్ర జీఎస్టీ ఖాతాలోకి సర్దుబాటు చేశారు. ఈ సర్దుబాట్లన్నీ జరిగిన తర్వాత సెప్టెంబరు నెలలో కేంద్ర జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.57,151 కోట్లకు, రాష్ట్ర జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.59,216 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో జీఎస్టీ వసూళ్లు 26 శాతం పెరిగాయి.

ఇదే వ్యవధిలో వస్తువుల దిగుమతులపై వచ్చే జీఎస్టీ ఆదాయం 39 శాతం, సేవల దిగుమతులపై వచ్చే జీఎస్టీ ఆదాయం 22 శాతం మేర పెరిగింది. సెప్టెంబరు నెలలో 20వ తేదీన రికార్డు స్థాయిలో అత్యధికంగా రూ.49,453 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఆ రోజున ఏకంగా 8.77 లక్షల ఛాలాన్లను జీఎస్టీ కలెక్షన్ల కోసం జారీ చేశారు. ఇంతకుముందు ఈ ఏడాది జులై 20న 9.58 లక్షల ఛాలాన్లను జారీ చేసి దాదాపు రూ.57, 846 కోట్ల జీఎస్టీని కలెక్ట్ ‌చేశారు.

Leave a Reply