- వారికి ఘనంగా నివాళి అర్పించిన సిఎం కెసిఆర్
- అమరుల త్యాగాలు మరువలేనివన్న హోంమంత్రి, డిజిపి
- రాష్ట్ర వ్యాప్తంగా అమరులకు ఘనంగా నివాళులు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళులర్పించారు. పోలీసుల సేవలను, త్యాగాలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే పోలీసుల అత్యున్నత త్యాగాలను ఈ దేశం, ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల ఆశయాల కోసం పోలీసు దళాలు పునరంకితం కావాలన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పోలీస్ అమవీరుల దినోత్సవ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులుబాసిన అమర పోలీస్, జవాన్లకు శ్రద్దాంజలి ఘటించారు.
సమాజ భద్రత, ఉజ్వల భవిష్యత్ కోసం ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని, చేస్తున్నారన్నారు. త్యాగధనులకు సమాజం రుణపడి ఉందన్నారు. రాష్ట్రంలో పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. కరోనా సమయంలో వారి సేవలు మరువలేనివన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..పోలీస్ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించే దిశగా చేపట్టిన పలు కార్యక్రమాలతో సత్ఫలితాలు లభిస్తున్నాయన్నారు. తెలంగాణ పోలీస్ శాఖకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. అంతకు ముందు హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నగరంలోని గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల పేరేడ్ ర్యాలీలో సీపీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు.