Take a fresh look at your lifestyle.

సిస్టర్ల త్యాగం మహత్తరమైన సేవ

రోగులకు స్వాంతన చేకూర్చే సంకల్పం
తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను కాపాడే తల్లులు
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా  కెసిఆర్‌ ‌శుభాకాంక్షలు
వారి సేవలను ప్రస్తుతించిన మంత్రులు, నేతలు

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, తల్లిలాగా ప్రేమతో, సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని సీఎం కొనియాడారు. కొరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి  రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని సీఎం అన్నారు.అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న నర్సులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా ఉన్నందుకు నర్సులందరికీ ఎంతో రుణపడి ఉన్నాము అని కవిత స్పష్టం చేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సుల సేవలు వెలకట్టలేనిదన్నారు. కొరోనా వల్ల విజృంభింస్తోన్న ఈ తరుణంలో రోగులకు వారు అందిస్తోన్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. విపత్కర పరిస్తితుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా నర్సులు పని చేస్తోన్న తీరు, కొరోనా రోగులకు సేవనందించే విషయంలో చూపిస్తోన్న అంకితభావం ప్రశంసనీయమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కొవిడ్‌ ‌వంటి విపత్కర సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి.. నిత్యం రోగులకు సేవలు చేస్తున్న నర్సుల సేవలు అనుపమానమైనవని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌కొనియాడారు. నర్సులు చేసే సేవలకు అందరం ఎంతో రుణపడి ఉన్నామనన్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారి సేవలను గుర్తించడమే మనం వారికి ఇచ్చే గౌరవం అన్నారు. వారికున్న సేవాభావం, కరుణ, శ్రద్ధలే ఈ సమాజాన్ని అనారోగ్యం నుంచి కాపాడుతూ శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు.  సేవకు, మానవత్వానికి వారు ప్రతీక. నిస్వార్థ సేవ చేస్తూ ప్రతి రోగిని సొంతవారిలా చూసుకొని కోలుకునేలా చేసే నర్సులందరికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలని ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

తల్లికి మరో రూపమే నర్సుగా మంత్రి అభివర్ణించారు. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో..నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యమన్నారు. నర్సు వృత్తికి మార్గదర్శనమైన ప్లోరెన్స్ ‌నైటింగేల్‌ 1854 ‌లో క్రిమియా యుద్ధంలో టర్కీ లో గాయపడిన సైనికులకు చేసిన సేవకు గుర్తుగా ఆమె జన్మదినమైన మే  12 ను పురస్కరించుకుని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం గా జరుపుతున్నారన్నారని మంత్రి తెలిపారు. కొరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి నర్సులు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply