Take a fresh look at your lifestyle.

స్వతంత్ర సంగ్రామంలో తెలంగాణ ప్రముఖుల పాత్ర స్ఫూర్తి దాయకం

  • తెలుగుపత్రికల కృషి, గ్రంథాలయ ఉద్యమం ప్రశంసనీయం
  • ఆజాదికా అమృత్ మహోత్సవ్ వెబినార్ లో శ్రీమతి డాక్టర్ అరుణ పావటి

హైదరాబాద్, ఆగస్టు 26, పీఐబీ : స్వాతంత్య్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకొని నూతన భారతావనికి మనం కృషి చేయాలని శ్రీమతి డాక్టర్ అరుణ పావటి అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హిస్టరీ, యూనివర్సిటి కాలేజ్ ఫర్ ఉమెన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి), రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్వోబి) సంయుక్తంగా ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన “భారత స్వాతంత్య్రోద్యమంలో తెలంగాణా పాత్ర” అనే అంశంపై నిర్వహించిన వెబినార్ లో శ్రీమతి డాక్టర్ అరుణ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ భారతదేశాన్నిపరాయి పాలన నుంచి విముక్తి చేయడానికి ఎందరో మహానుభావులు వారి జీవితాలను అర్పించారని, వారి త్యాగాల పునాదుల మీదనే ఈ రోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం అనే ఫలాలను అనుభవిస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె ” 1757 నుండి 1947 మధ్యకాలం లో భారత స్వాతంత్ర్యోద్యమం సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధులు చేసిన అవిరళ కృషిని ఆమె వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించి వివిధ ఘట్టాలను వివరిస్తూ, అలనాటి ఉద్యమంలో తెలుగుపత్రికలు చేసిన కృషిని, గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించిన విషయాలను తెలియజేశారు.

దేశ స్వాతంత్య్ర సాధన కోసం జరిగిన 190 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో తెలంగణా ప్రాంతం నుంచి తురేబాజ్ ఖాన్, స్వామి రామానందతీర్థ, మాడపాటి హుమంతరావు, వందే మాతరం రామచంద్ర రావు, బూర్గుల రామకృష్ణా రావు, కె.వి. రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి లాంటి మహనీయులు వివిధ పోరాటాలకు నాయకత్వం వహించారని వివరించారు. హైదరాబాద్ లో 1892లో ఆర్య సమాజ స్థాపనతో తెలంగాణ ప్రాంతం లో స్వాతంత్య్ర ఉద్యమాలకు బీజం పడిందని తెలిపారు. ఆర్య సమాజం ప్రధానంగా సామాజికంగా, సాంస్కృతికంగానూ ప్రజలను చైతన్య వంతులను చేయటానికి కృషి చేస్తూ, ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించడంలో రాజకీయ చైతన్యం కల్పించటంలో కీలకపాత్ర నిర్వహించిందని తెలిపారు. నిజాం ప్రభుత్వం ఆర్య సమాజ్ ను నిషేధించినా లెక్కచేయకుండా కేశవరావు కొరాట్కర్ లాంటి నాయకులు పలు విద్యాసంస్థలు, గ్రంథాలయాలు స్థాపించి విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.

నిషేధించిన కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారని కొందరు ఆర్య సమాజ్ నాయకులను నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, దీనికి నిరసనగా 1938 అక్టోబర్ 24 న దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహించారని, ఈ రోజు హైదరాబాద్ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో నిలిచి పోయిందన్నారు. అంతే కాకుండా తెలుగు ప్రజలు సంఘటితమై స్థాపించిన ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ గురించి పలువిశేషాలు, ప్రముఖ సంఘ సేవకురాలు స్త్రీ జనోద్ధరణ కోసం దుర్గాబాయి దేశ్ ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ ప్రాముఖ్యతను ఆమె వివరించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిరాల రామచంద్రరావు నిజాం సంస్థానాన్ని భారతదేశం విలీనం చేయడానికి చేసిన కృషికి గాను ఈయనని వందేమాతరం పేరుతో గౌరవిస్తూ వస్తున్నామని ఆమె తెలిపారు. ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా సందర్శనీయ వారోత్సవాలను( ‘ఐకానిక్ వీక్’) పురస్కరించుకొని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాంతీయ స్వాతంత్య్ర సమరయోధుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి ఈ వెబినార్ ను ఏర్పాటు చేసినట్లు శ్రీమతి శృతి పాటిల్, డైరెక్టర్ (ఆర్.ఓ.బి, పి.ఐ.బి) తన ప్రారంభోపన్యాసం లో తెలిపారు. పిఐబి, ఆర్.వో.బి అధికారులు, ఎన్.వై.కే, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ , కళాశాల విద్యార్థులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.

Leave a Reply