దేశంలో వివిధ ప్రాంతాల్లో కొరోనా కేసులు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు పది లక్షలకుపైగా ప్రజలు కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ కార్మికుల అంకితభావంతో రికవరీలో ఈ మైలు రాయి సాధించామన్నారు. వైరస్ నుంచి 10,20,000 మంది రోగులు కోలుకున్నారని, ఇది గొప్ప విషయమన్నారు. రికవరీ రేటు ఏప్రిల్‌లో 7.85 శాతంగా ఉందని, ప్రస్తుతం 64.4 శాతంగా ఉందని చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ఢిల్లీలో 88శాతం, లడక్‌లో 80, హర్యానా 78, అస్సాం 76, తెలంగాణ 74, తమిళనాడు, గుజరాత్లో 73శాతం, రాజస్థాన్ 70, మధ్యప్రదేశ్ 69, గోవా 68శాతం నమోదైందని చెప్పారు. సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్మెంట్ మరణాల రేటు తగ్గేందుకు దారి తీసిందన్నారు. జూన్‌లో ఇది 3.33 శాతం, ప్రస్తుతం 2.21 శాతం ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యల్పమని చెప్పారు. ఆర్టీ-పీసీఆర్, వేగవంతమైన యాంటిజెన్ పరీక్షలతో సహా దేశంలో 18,190,000 పరీక్షలు జరిగాయని చెప్పారు. రోజుకు సగటు పరీక్షల్లో వారానికి వారం పెరుగుదల ఉందని తెలిపారు. దేశంలో రోజుకు పది లక్షల జనాభాకు 324 పరీక్షలు నిర్వహిస్తుందని భూషణ్ పేర్కొన్నారు.
దేశంలో రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయన్నారు. అధిక జనాభా కలిగిన దేశంలో సాధరణ పక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్ ద్వారానే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ వైరస్‌ను ఎదుర్కోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయ పడింది. దేశంలో కొరోనా వైరస్ తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ డియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొరోనా కేసుల రికవరీ రేటు 64.4శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఏప్రిల్ నెలలో 7.85 శాతంగా ఉన్న ఈ రేటు ప్రస్తుతం 64 శాతానికి చేరుకోవడం ఊరట కలిగించే విషయమని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు 10లక్షల మంది కోలుకున్నారని స్పష్టం చేసింది. వైద్యులు, నర్సులతోపాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగానే బాధితులు ఈ స్థాయిలో కోలుకుంటున్నట్లు అభిప్రాయపడింది. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కొరోనా నుంచి కోలుకునే వారి శాతం జాతీయసగటు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.
దేశంలో వైరస్ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా నిర్ధారణ పరీక్షలు భారీగా పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు కోటీ 81 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. నిత్యం జరిపే కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచుతున్నామని తెలిపింది. ప్రస్తుతం ప్రతిరోజూ ప్రతి పదిలక్షల జనాభాకు 324 టెస్టులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల రూపకల్పనలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. వీటిలో అమెరికా, యూకే, చైనా దేశాల వ్యాక్సిన్లు మూడోదశలో ఉన్నాయి. ఇక భారత్‌లో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు ఫేజ్-1, ఫేజ్-2 దశల్లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదటి వ్యాక్సిన్‌ను 8 ప్రదేశాల్లో దాదాపు 1150 మందిపై ప్రయోగిస్తుండగా, రెండో వ్యాక్సిన్‌ను ఐదు ప్రదేశాల్లో వెయ్యి మందిపై ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం దాన్ని ఎవరికి, ఎలా ఇవ్వాలనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తోందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రపంచ సగటు 4శాతం ఉండగా భారత్‌లో 2.21శాతంగా ఉన్నట్లు తెలిపింది.