Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టంపై రాజుకున్న చిచ్చు

వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులలో పంజాబ్‌ ‌ముందుంది. అందుకే, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అక్కడ పార్టీలతో నిమిత్తం లేకుండా అంతా స్పందించారు. బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌ ‌కేంద్ర మంత్రివర్గం నుంచి తమ పార్టీ ప్రతినిధి సిమ్రత్‌ ‌కౌర్‌ను ఉపసంహరించింది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. వ్యవసాయ బిల్లులపై కేంద్రం ఎందుకంత పట్టుదలగా ఉందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పంజాబ్‌ ‌రైతులు సోమవారంనాడు ఢిల్లీలో పెద్ద ఎత్తున చేరుకుని ఒక ట్రాక్టర్‌ను దగ్ధం చేశారు. ఉదయం ఏడున్నరకే వారు ఢిల్లీ చేరుకున్నారంటే ఈ బిల్లుల పట్ల వారు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టం అవుతోంది. ఈ బిల్లులపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే వీటిని రాష్ట్రపతి ఆమోదించడం రైతు సంఘాల నాయకులు పుండు మీద కారం చల్లినట్టుగా భావిస్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల విషయంలో మోడీ ఇంత పట్టుదలతో ఉండడం అర్థం కాక, అన్ని పార్టీల వారూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఈ బిల్లుల ఆమోదాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే ఆగమేఘాల మీద వీటిని రాజ్యసభ ఆమోదించింది. లోక్‌ ‌సభలో బీజేపికి పూర్తి మెజారిటీ ఉన్నందున అకాలీదళ్‌ ‌మంత్రి వైదొలగినా, శివసేన ముందే పక్కకు తప్పుకున్నా లెక్క చేయలేదు. రాజ్యసభలో మెజారిటీకి కాస్తంత తక్కువగా ఉన్నా వైసీపీ, తెరాస, జనతాదళ్‌(‌బిజూ) వంటి చిన్న పార్టీల సహకారంతో మేనేజ్‌ ‌చేయాలని అనుకుంది. కానీ, తెరాస, బిజూ జనతాదళ్‌ ‌కూడా వ్యతిరేకించడంతో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి మూజువాణీ పద్దతిని అనుసరించింది. నిజానికి ఒక్క పార్టీ వ్యతిరేకించినా మూజువాణీ పద్దతి పనికి రాదన్నది పార్లమెంటరీ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం. కానీ, మోడీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బిల్లుల విషయంలో పార్లమెంటు ఆమోదంపై అయిందనిపించినట్టుగా వ్యవహరించింది.

ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా రైతు సంఘాల నాయకులు మరింత ఉధృతంగా ఆందోళన సాగిస్తున్నారు. ఈ విషయంలో పంజాబ్‌ ‌ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఆందోళనలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌స్వాతంత్య్ర యోధుడు, అమరవీరుడు భగత్‌ ‌సింగ్‌ ‌స్వగ్రామంలో సోమవారం ఆందోళనకు నేతృత్వం వహించారు. కాగా, ప్రస్తుత పరిస్థితులను పాక్‌ అనుకూల ఉగ్రవాద వర్గాలు ఆసరాగా తీసుకుని విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదం ఉందని అమరీందర్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పరిస్థితి క్షీణించకముందే కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు. బీహార్‌ ‌ముఖ్యమంత్రి, జనతాదళ్‌(‌యు) నాయకుడు నితీశ్‌ ‌కుమార్‌పై పార్టీ ఎంపీల వొత్తిడి పెరుగుతోంది. అయితే, ప్రస్తుత సమావేశాల్లో ఆ పార్టీ నాయకుడు హరివంశ్‌ ‌రాయ్‌కు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ‌పదవిని మోడీ ఇవ్వడంతో బహిరంగంగా ఆ పార్టీ వ్యతిరేకించకపోయినా, లోలోపల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. శివసేన ముందే వేరు పడటం వల్ల బిజేపీపై నిప్పులు కక్కుతోంది. కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ట్విట్టర్‌ ‌ద్వారా ప్రధానిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. వ్యవసాయ బిల్లులు రైతుల మెడకు మృత్యు పాశాలనీ, ఇంత మంది వ్యతిరేకిస్తున్నా, మోడీ ఎందుకు పునః పరిశీలన జరపడం లేదో అర్థం కావడం లేదనీ, కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల రైతులు ఎక్కువగా నష్టపోయారనీ, ఈ తరుణంలో రైతుల స్వేచ్ఛ హరించే బిల్లులను తీసుకుని రావడం క్షమార్హం కాదని రాహుల్‌ ‌స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృష్టితో మోడీ వ్యవహరించాలని కోరారు. అయితే, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటం వల్ల అవి చట్ట రూపం దాల్చాయి. అందువల్ల వెనక్కి తిరిగి చూసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదనే విషయం స్పష్టం అవుతోంది. ఢిల్లీలో జరిగిన ఆందోళన దేశ వ్యాప్తంగా పాకవచ్చని, అన్ని రాష్ట్రాల్లో రైతులు తీవ్ర వ్యధకు లోనవుతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌చార్జిగా కొత్తగా నియమితులైన మణికం ఠాకూర్‌ , ‌పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ ‌రెడ్డి, ఇతర నాయకులు గవర్నర్‌ ‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరగా, రాజ్‌ ‌భవన్‌ ‌వద్ద వారిని ఆపి వేసి అరెస్టు చేసి గోషామహల్‌ ‌పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేంద్రానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆందోళనలకు కాంగ్రెస్‌ ‌తమ పార్టీ శాఖలకు పిలుపు ఇచ్చింది.

వ్యవసాయ బిల్లులపై కేంద్రం వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ శివసేన తమ అధికార పత్రిక సామ్నాలో ఘాటుగా సంపాదకీయం రాసింది. బీజేపీ నాయకత్వం గతంలో పట్టువిడుపుల వైఖరిని ప్రదర్శించేదనీ, ఇప్పుడు మిత్రపక్షాలను అసలు లెక్క చేయడం లేదని పేర్కొంది. పరోక్షంగా మోడీపై తీవ్ర విమర్శలు చేసింది. వాజ్‌పేయి హయాంలో మిత్రపక్షాలకు గౌరవం లభించేదని పేర్కొంది. శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌థాకరే కూడా ఈ బిల్లులపై తీవ్ర విమర్శలు చేశారు. ఒడిషాలో బిజూ జనతాదళ్‌, ‌తెలంగాణలో తెరాస ఎలాంటి ఆందోళనలు చేపడతాయో వేచి చూడాలి.

Leave a Reply