Take a fresh look at your lifestyle.

దుబ్బాక ప్రచారంలో పార్టీల పదనిసలు

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి  జరిగే ఉప ఎన్నికను   తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్‌, ‌బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  తెరాస గాలి వీయడానికి ముందు ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌కి కంచుకోటలా ఉండేది.  చెరుకు ముత్యం రెడ్డి  వ్యక్తిగత ప్రతిష్ఠ ఆ పార్టీకి పెట్టని కోటగా ఉండేది. తెరాస తరఫున  ప్రాతినిధ్యం వహించి అకాలమరణం పాలైన  సోలిపేట రామలింగారెడ్డి   జర్నలిస్టుగా, నిబద్ధత గల రాజకీయవేత్తగా పేరు సంపాదించుకున్నారు. ఈ ఉప ఎన్నికకు  ఆయన భార్య సుజాత ను  తెరాస  నిలబెట్టడం ఉహించిందే.   లింగన్నగా ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే రామలింగారెడ్డి మంచి పేరుకు తోడు, సానుభూతి వోట్లు లభిస్తాయన్న ఉద్దేశ్యంతోనే  ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆమె అభ్యర్దిత్వాన్నే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  కె చంద్రశేఖరరావు ఖరారు చేశారు.  సొంత నియోజకవర్గం పక్కనే ఉండటం వల్ల  తెరాస సీనియర్‌ ‌నాయకుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావుకు  ఆమెను గెలిపించే బాధ్యతను అప్పగించారు.  సహజంగా అన్ని పార్టీలూ అనుసరిస్తున్న విధానమే ఇది.    మంచి పేరున్న శాసనసభ్యుడు, లేదా శాసనసభ్యురాలు అర్థంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా  ఎన్నుకునే సంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో  అప్పటి ముఖ్యమంత్రి  డా.వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు.  తెలుగుదేశం    అధ్యక్షుడు  నారా చంద్రబాబునాయుడు  ఈ సంప్రదాయానికి గండికొట్టారు.   ఇప్పుడు  ఏ  రాజకీయ పార్టీ  భావోద్వేగాలకూ, పాత నాయకుల గౌరవ  ప్రతిష్ఠలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

దుబ్బాక ఉప ఎన్నికలో  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందనరావు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న   చెరకు  శ్రీనివాస రెడ్డిల తరఫున ఆ రెండు పార్టీల సీనియర్‌ ‌నాయకులు   కాలికి బలపం కట్టుకున్న రీతిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.    ఈ ప్రచారం సందర్భంగా   నాయకుల నోటంట వెలువడుతున్న పదజాలం, చోటు చేసుకుంటున్న సంఘటనలు   తెలంగాణకు మచ్చ తెచ్చే రీతిలో ఉన్నాయి.  ముఖ్యంగా, రఘునందన రావు దగ్గర బంధువు ఇంట్లో   18 లక్షల నగదును పోలీసులు  స్వాధీనం చేసుకున్న సంఘటనలో బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడి జరిపిన తీరు.  ఎన్నికల్లో  డబ్బు పంపిణీ, బూత్‌ ‌ల ఆక్రమణలు,  ప్రత్యర్ధి పార్టీ నాయకులపై దాడులు ఇవన్నీ కాంగ్రెస్‌ ‌సంస్కృతిలో భాగమని   కమలనాథులు    పై స్థాయి నాయకుల నుంచి దిగువ స్థాయి కార్యకర్తల వరకూ ప్రచారం చేస్తుంటారు.

కానీ, ఇప్పుడు  సిద్ధిపేటలో  రఘునందనరావు ఇంట్లో దొరికిన డబ్బు  విషయంలో ఆ పార్టీ ప్రతిష్ఠ మసకబారింది.    తెరాస తరఫున మరో నాయకుడు ఎవరైనా ఉండి ఉంటే   ఇదంతా కల్పిత గాథ అని  కమలనాథులు ప్రచారం చేసినా జనం నమ్మేందుకు అవకాశం ఉండేది. కానీ, హరీష్‌ ‌రావు తెరాస నాయకుల్లో సీనయర్‌ ‌మాత్రమే కాకుండా,   ప్రత్యర్ధులను గౌరవించే సంప్రదాయం కలవారు. ఆయన  ప్రయోగించే పదజాలాలు తూకంగా ఉంటాయి.  బీజేపీ నాయకులు   అసత్యాల పునాదులపై  ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచేందుకు  ప్రయత్నిస్తున్నాయంటూ   ఆయన చేసిన ఆరోపణలో ఎంతో మృదుత్వం ఉంది.   అలాగే, వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్ళి చేయమన్నారన్న సామెత చందంగా అడుగడుగునా అసత్యాలు చెప్పి  ఈ ఎన్నికల్లో గెలవాలని కమలనాథులు   ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ కూడా సభ్యత గానే ఉంది.  కానీ,  బీజేపీ నాయకులు   తమ పరిధిలను మరిచి పోయి  అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వం అమలు జేస్తున్న పథకాల్లో వెచ్చించే డబ్బంతా కేంద్రం ఇస్తున్నదేనంటూ  కమలనాథులు చేస్తున్న ప్రచారాన్ని   హరీష్‌ ‌రావు  తిప్పికొట్టిన తీరు  సహేతుకంగానే ఉంది. ముఖ్యంగా, బీడీ కార్మికుల మహిళలకు ఇచ్చే పెన్షన్‌ 2,016 ‌రూపాయిల్లో  కేంద్రం  1600 రూపాయిలు ఇస్తోందంటూ  చేసిన  ప్రకటనలో నిజం లేదని తిప్పికొట్టడమే కాకుండా, బీడీలపై కేంద్రం విధించిన  జిఎస్‌ ‌టి వల్ల ఆ పరిశ్రమ దెబ్బతిందన్న వాస్తవాన్ని ప్రజలకు వివరించారు.  బీడీ కార్మికులకు  నెలకు  15 రోజులు కూడా పని దొరకడం లేదన్న మాటల్లో నిజం ఎంతో ఉంది.

బీడీ కార్మికుల వెతల గురించి ఉమ్మడి రాష్ట్రంలో  ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని  తెరాస  అన్ని సభల్లోనూ ప్రస్తావించేది.తాము అధికారంలోకి వొస్తే   బీడీ కార్మికులకు పెన్షన్‌ ‌చెల్లిస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుని కొనసాగిస్తోంది.  కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే సాయంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ  అధికారాన్ని చేపట్టిన తర్వాత కోత విధిస్తోందన్న ఆరోపణలు  బీజేపీయేతర  పార్టీలన్నీ చేస్తూనే ఉన్నాయి. అయితే, కేసులను అడ్డం పెట్టుకుని కొన్ని రాష్ట్రాల్లో    అధికారంలో ఉన్న పార్టీలు మాట్లాడకుండా    బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.  మోడీ ప్రధాని అయిన తర్వాత కేంద్ర  పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను  32 నుంచి 42 శాతానికి పెంచినట్టు గొప్పలు చెప్పుకుంటున్నా, ఆ మేరకు  కేంద్ర ప్రతిపాదిత పథకాల కోసం ఇచ్చే నిధుల్లో కోత విధించిన సంగతి తెలిసిందే.  యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను  మోడీ ప్రభుత్వం బాగా తగ్గించింది.అందువల్ల  ప్రతి పథకానికీ కేంద్రం నిధులిస్తోందంటూ  స్థానిక బీజేపీ నాయకులు గొప్పలు చెప్పడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.  అంతవరకు  ఎందుకు జిఎస్టి ని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాలకు ఇస్తామన్న పరిహారంలో కోత పెట్టింది.ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమీ లేదు.   బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపుతూ  11 అంశాల ప్రకటనను  పాయంట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌గా హరీష్‌ ‌రావు విడుదల చేశారు.  అవన్నీ సహేతుకంగానే ఉన్నాయి.   తెరాస అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్‌ ‌కూడా విమర్శిస్తోంది కానీ, ఈ మాదిరి అసత్యాలను ప్రచారం చేయడం లేదు. అందుకే,   అసత్యాలకు గిన్నీస్‌  అవార్డు ఉంటే  అది బీజేపీకే దక్కుతుందంటూ హరీష్‌ ‌రావు చేసిన వ్యాఖ్యలో చలోక్తి ఉన్నా అక్షర సత్యం.

Leave a Reply