Take a fresh look at your lifestyle.

విరామమెరుగని వెంకయ్యనాయుడికి ఇక విశ్రాంత జీవితం

ఉపరాష్ట్రపతిగా  పదవీ విరమణ

తెలుగు వారి  సంతకం. తేనె తెలుగు అక్షరానికి నిండుదనం. తెలుగు సాంప్రదాయినికి నిలువెత్తు రూపం.. పంచెకట్టు, ఆపై తెలుపు చొక్కా.. పెదాలపై ఎప్పుడూ తొణికిసలాడే చిరునవ్వు… అలుపెరుగని గళం.. విరామమెరుగని నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.అందరినీ ఆప్యాయంగా పలకరించే తత్వం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని, చదువుకున్న విశ్వ విద్యాలయానికే చ్కెర్మన్‌గా ఎన్నికైనప్పటి నుంచీ ప్రారంభమ్కెన ప్రస్థానం బీజేపీ జాతీయ అధ్యక్ష స్థాయికి, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఎన్నో పదవులు చేపట్టి జాతీయ నేతగా ఎదిగి, తుదకు ఉపరాష్ట్రపతిగా శిఖరాగ్రాన నిలిచి  తెలుగు ఖ్యాతిని నేల నలుదిశలా వ్యాపింపజేశారు. ఓ రైతుబిడ్డ దేశ ఉపరాష్ట్రపతి కావడం గర్వకారణం. ఇప్పటి వరకు మన మధ్య వున్న వ్యక్తి ఒక సారిగా అత్యున్నత శిఖరం ఎక్కడం తెలుగు వాళ్ళకి గర్వకారణం. నెల్లూరు జిల్లా నాయకునికి ఈ గౌరవం దక్కడం శుభపరిణామం.

సాధారణ కుటుంబంలో పుట్టి సామాన్య కార్యకర్తగా పయనం ప్రారంభించిన ఆయన.. విశాఖ విద్యార్థి నేతగా ఉద్యమ పథంలో ఉవ్వెత్తున ఎగిశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనకడుగు వేయక.. దీక్షాదక్షతతో ముందుకు సాగి దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు., ఏనాడూ పార్టీలు మారని వెంకయ్యనాయుడు గా పేరుపొందారు.  విద్యార్ధిగా ఆరోజుల్లోనే వాజపేయి, అడ్వాణి ల వాల్‌ ‌పోస్టర్లు అతికించారు. నెల్లూరు జిల్లా చవటపాలెం గ్రామంలో 1948, జూలై 1 నవ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించి నెల్లూరు వి.ఆర్‌.‌కళాశాల నుంచి డిగ్రీ ఉత్తీర్ణు లయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు.

జై ఆంధ్రా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.  గంటలపాటు ప్రసంగించగల వాగ్ధాటి వ్యక్తిత్వం ఆయన సొంతం. సభికులను  కదలనీయకుండా ఉపన్యసించే చతురత ఆయనది. దక్షిణ భారతదేశంలో బీజేపీకి అత్యంత కీలక నేతగా ఎదిగి… తమిళ, కర్నాటక రాష్ట్రాల్లోని రాజకీయ సంక్షోభాలను నేర్పుగా పరిష్కరించగలిగిన నేతగా నిలిచారు. దేశంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా.. వెంకయ్య ఆలోచనలే కీలక పాత్ర పోషించాయి. దేశ రాజకీయాల్లో మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న తెలుగు తేజం ముప్పవరపు వెంకయ్య నాయుడు. నినాదాలు ఇవ్వడంలో వెంకయ్య ఆయనకు ఆయనే సాటి. అది మోడీ సర్కారు అధికార నినాదమైంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు వారధిగా నిలిచి సత్తాప్రదర్శించారు. ..

స్వాతంత్య్రం తర్వాత జన్మించిన వాళ్లలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి గా స్థానం నిలుపుకున్నారు.. అరుదైన సందర్భం. రాజ్యసభలో సుదీర్ఘకాలం సభ్యుడిగా కొనసాగి అదే సభకు ఛైర్మన్‌ అయ్యారు. బహుభాషా కోవిదుడు. చతురతతో మాటల మాంత్రికుడిగా పేరొందారు.  మాతృభాష అంటే ఎంతో మమకారం. అదే ఒరవడితో సభా కార్యక్రమాలు హుందాగా నిర్వహించారు. భారత దేశానికి 13వ ఉపరాష్ట్రపతి. తెలుగు నేలనుంచి మూడవ ఉపరాష్ట్రపతి. బిజెపికి చెందిన ఉప రాష్ట్రపతులలో వెంకయ్య  రెండవ వారు. మొదటి వ్యక్తి రాజస్థాన్‌ ‌కు చెందిన బైరాన్‌ ‌సింగ్‌ ‌షెకావత్‌. ఆయన వాజ్‌ ‌పేయి ప్రధానిగా ఉన్నపుడు 2002-2007 మధ్య ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ప్రధాన  అభ్యర్థిగా మోడీ, రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌ ఎం‌పిక కమిటీల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు.
..  బహుశా ఇంతటి వాగ్ధాటి కల వ్యక్తి మనకు ఉపరాష్ట్రపతిగా  లేరేమో. ఉపరాష్ట్రపతిగా ఆయన ఆగస్ట్ 10‌తో పదవీ విరమణ చేసి మాజీ అవుతున్నారు.  చతురతతో సభను సజావుగా నిర్వహించడమే కాక ప్రభుత్వ బిల్లులు చాలా వరకూ అమోదం పొందేలా చూశారు. పత్రికా ప్రపంచానికి ఆయన ఆత్మీయుడు, సంగీతం, సాహిత్యం, కళలు  సంప్రదాయం ఆయన ఆరో ప్రాణం.

విద్యార్థి దశలో ఆరెస్సెస్‌లో కొన్నాళ్లు పనిచేశాక ఏబీవీపీలో ప్రవేశించారు. 1972-73 జై ఆంధ్ర ఉద్యమంలో ఆయన వాగ్ధాటి అందరినీ ఆకట్టు కుంది. ఎమర్జెన్సీ సమయంలో కొన్నాళ్లు అజ్ఞాత జీవితం గడిపిన ఆయన తర్వాత అరెస్టయి విశాఖ జైల్లో ఉన్నారు. లా కాలేజీలో చదువుకుంటున్నప్పుడు లోక్‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌  ‌స్పూర్తితో ఆవిర్భవించిన ఛాత్ర సంఘర్ష సమితి ఆంధ్రప్రదేశ్‌ ‌శాఖ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తర్వాత జనతా పార్టీ యువజన విభాగం యువజనత రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. వెంకయ్య నాయుడు చదువుకునే రోజుల్లోనే ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్‌ ‌యూనియన్‌ ‌లీడర్‌ ‌గా ఉండేవారు. లా లో పట్టభద్రుడైన వెంకయ్య నాయుడు, జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌చేసిన ఉద్యమం లో ఆకర్షితుడై 1974 లో లోక్‌ ‌నాయక్‌ ‌జై ప్రకాష్‌ ‌ఛత్ర సంఘర్ష సమితిని స్దాపించారు.
ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్టయి జైలు జీవితం గడిపారు.  ఎమర్జెన్సీ నిర్బంధం నుంచి విడుదలయ్యాక వెంకయ్య తొలిసారి 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను పులి వెంకటరెడ్డి(కాంగ్రెస్‌) 80 ‌వేల ఓట్ల తేడాతో ఓడించారు. తర్వాత 1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం ఉదయగిరి నుంచి జనతా టికెట్‌పై గెలిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 20వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జనసంఘ్‌ ‌మూలాలున్న భాజపా నాయకుడైనా, అన్ని పార్టీల వారితో సత్సంబంధాలుసాగించారు, 1984లో ఆంధ్రప్రదేశ్‌ ‌రాజకీయ సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్య పరి రక్షణ క్రతువులో ఆయనపాత్ర అమోఘం.

1985 అసెంబ్లీ ఎన్నికల్లో పక్క నియోజకవర్గం ఆత్మకూరులో పోటీచేసి ఓడారు. తర్వాత లోక్‌సభకు 1989లో బాపట్ల నుంచి,  1996 ఎన్నికల్లో హైదరాబాద్‌ ‌నుంచి లోక్‌సభకు పోటీచేసి రెండుసార్లూ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీచేయలేదు. ఎన్టీఆర్‌,, ఇం‌దిరాగాంధీల ప్రభంజనాలను తట్టుకుని నిలబడి తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బతికించిన నాయకుడిగా వెంకయ్య చరిత్రకెక్కారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రతినిధి పదవులు సమర్థంగా నిర్వహించడంతోపాటు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు వెంకయ్యకు కలసి వచ్చాయి.

1999-2002 మధ్య వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిగా, 2002-2004 మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, తర్వాత ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కర్ణాటకలో బలం పెరగడంతో బీజేపీ వెంకయ్యను అక్కడి నుంచి రాజ్యసభకు పంపింది. వరుసగా 1998, 2004, 2010లో కర్ణాటక నుంచే మూడుసార్లు ఆయన ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో మోదీ తొలి కేబినెట్‌లో స్థానం సంపాదించారు.. 2016 రాజ్యసభ ఎన్నికల్లో రాజస్తాన్‌ ‌నుంచి ఎన్నిక కాగలిగారు. వాజ్‌పేయి కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేయడం జాతీయ రాజకీయాల్లో వెంకయ్య నిలదొక్కుకోవడానికి ఉపకరించింది. బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ వర్గీయుడిగా ముద్ర ఉన్నా, 2013 నాటి బీజేపీ అంతర్గతపోరులో పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించి మోదీకి మద్దతివ్వడం ఆయనకు కలిసొచ్చింది. ప్రభుత్వంలో ‘ట్రబుల్‌ ‌షూటర్‌’‌గా పేరొందిన ఆయనకు 2014 మళ్లీ కేంద్ర కేబినెట్‌లో కీలక శాఖలు దక్కాయి.

వెంకయ్యనాయుడు వాగ్ధాటి ఉన్న నాయకుడు. మాటకారి. ఆయన యతి ప్రాసలు తెలుగు నుంచి ఇంగ్లీష్‌ ‌కు కూడా పాకాయి. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. నమ్మిన భావజాలంపై మొక్కవోని అంకిత భావం.. తెలుగు, ఇంగ్లిష్‌, ‌హిందీ, సంస్కృతంలో ప్రాసలతో మాట్లాడుతూ ప్రత్యర్థులను నిరత్తరులను చేసే గుక్కతిప్పుకోని చమత్కార వాగ్ధాటి..! గెలుపోటముల మధ్య తడబడకుండా నిలకడతో, దృఢచిత్తంతో రాజకీయాల్లో రాణించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, ఉపరాష్ట్రపతి వరకు సాగిన ఆయన అధ్యయనం, రచన, చర్చ, అన్నింట్లో దిట్ట. జాతీయ స్థాయిలో అనేకాంశాలను స్పృశిస్తూ ఆయన అనేక వార్తా పత్రికలలో  రాసిన వ్యాసాలు అసంఖ్యాకం. పార్టీలో బాధ్యతాయుత పదవిలో ఉన్నా, కేంద్రంలో మంత్రిగా ఉన్నా, ఉపరాష్ట్రపతిగా పదవి చేపట్టినా పాత్రికేయ ప్రపంచంతో ఆయనకు ఎప్పుడూ సత్సంబంధాలే. అయన ఒక కాలమిస్ట్. ఒక సారి కలిస్తే చాలు, ఏళ్ళ తరవాత కలసినా పేరుపెట్టి మరీ పలకరించి కుశల ప్రశ్నలు వేస్తారు.

 

స్వర్ణ భారత్‌ ‌ట్రస్ట్ ‌ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో  సామా జిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమెరికా, యూకే, మలేసియా, సింగపూర్‌, ‌ఫ్రాన్స్, ‌బెల్జియం, నెదర్లాండ్స్, ఆ‌స్ట్రేలియా, మారిషస్‌, ‌మాల్దీవులు, దుబాయ్‌, ‌హాంకాంగ్‌, ‌థాయ్‌లాండ్‌, ‌స్పెయిన్‌, ఈజిప్ట్, ‌జర్మనీ.. తదితర దేశాలు పర్యటించారు. ఆయన ఉపరాష్ట్రపతి మాత్రమే కాదు జీవనయానంలో ‘‘ఉషాపతి’’. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితమున్నా ఆయన కుటుంబీకులెవ్వరూ ఏనాడూ  కనపడలేదు. అందుకే ఆయన రాజకీయాలలో వివాదరహితుడు. క్షణం కూడా విరామం లేకుండా పని చేయడం ఆయన బలం. వివిధ భాషలపై ఆయనకు పట్టుంది. విస్తృత సమాచారం ఆయన అమ్ముల పొదిలో ఉంది. మోడీకి కుడి భుజంగా మెలుగుతూ వచ్చారు. తనకంటూ ఓ టీమ్‌ ‌ను.. మరో అనుచర సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనుకుంటే సాధించేదాకా వదిలి పెట్టని మనస్తత్వం ఉన్నందువల్లనే ఆయన దీర్ఘ కాలం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగారు. ఏ అంశమైనా సరే దానిని అమూలాగ్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక పట్టాన ఓటమిని ఆయన ఒప్పుకోరు. గెలుపు సాధించే దాకా నిద్రపోరు. ఇదీ ఆయన మనస్తత్వం. ఏ విషయంలోనూ రాజీ పడని వ్యక్తి, ఆయనది విశిష్ఠ వ్యక్తిత్వం.

దేశంలో అతి పెద్ద రెండవ రాజ్యాంగ పదవిని నిర్వహించిన నాయుడుకు అంతకంటే వేరే పదవులు దక్కే అవకాశాలు లేవు. సంప్రదాయం బట్టి చూసినా ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల లోకి వచ్చే ఊహకూడా లేదు. మాజీ ఉపరాష్ట్రపతిగా ఢిల్లీలో కేంద్రం ఆయనకు కేటాయించిన అధికార నివాసంలో ఇతర మాజీల మార్గంలోనే జీవితం గడుపు తారని భావించవలసిందే.

– నందిరాజు రాధాకృష్ణ, విశ్రాంత పాత్రికేయుడు

98481 28215

Leave a Reply