Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో పాలన స్తంభించింది

  • సర్కార్‌ను నమ్ముకుంటే అంతే సంగతులు
  • జనానికి అర్థం అయ్యేలా చేస్తున్నారన్న రాములమ్మ

రాష్ట్రంలో కొరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతుందనీ బిజెపి సీనియర్‌ ‌నాయకురాలు విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ రుసరుసలాడారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఫేస్‌బుక్‌ ‌ద్వారా ఓ పోస్టు చేస్తూ… టెస్టుల నిర్వహణ, కోవిడ్‌ ‌నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందనీ ఆరోపించారు. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించిందనీ, అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదన్నారు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్‌ ‌షాపులు, పబ్‌లు, క్లబ్‌లు గుంపులు గుంపులుగా తిరుగుతున్న జనాన్ని కట్టడి చేయడం, బెడ్స్ ‌కొరత గురించి న్యాయమూర్తులడిగిన ప్రశ్నలకు నీళ్ళు నమిలారన్నారు. సరైన సమాచారం లేని ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసిందనీ, సరిగ్గా కిందటేడాది ఏం తప్పులు జరిగాయో… అవే ఇప్పుడూ పునరావృతం అవుతున్నందువల్లే రాష్ట్రంలో కొరోనా సెకెండ్‌ ‌వేవ్‌ ‌తీవ్ర రూపం దాల్చిందనే విషయాన్ని సర్కారు గ్రహించడం లేదు, గుణపాఠం నేర్చుకోవడం లేదన్నారు. కొరోనా బారిన పడిన సిఎం కేసీఆర్‌  అం‌తకుముందు మాస్క్ ‌లేకుండా సమీక్షలు నిర్వహించి, సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోషల్‌ ‌మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయన్నారు.

పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వారి అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారారన్నారు. రాష్ట్రంలో మాస్కులు ధరించనివారికి వేలకు వేలు ఫైన్లు వేస్తున్నారనీ, ఆ ఫైన్‌ ఏదో మాస్కు ధరించని కేసీఆర్‌, ఆ ‌పార్టీ నేతలకు కూడా వేసి ఉంటే పాపం ఆయన జాగ్రత్త పడేవారు కదా అనిపిస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. ఇక రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు కానీ, పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదనీ..ఈ నేతలు, ఈ సర్కారును నమ్ముకుంటే ఇంతే సంగతులని జనానికి బాగా అర్థమయ్యేలా చేస్తున్నారనీ ఆ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు.

Leave a Reply