Take a fresh look at your lifestyle.

రికార్డు స్థాయిలో కొరోనా కేసులు ఒక్కరోజే 1986

  • ఐదు జిల్లాలలోనే 759
  • వైరస్‌ ‌తీవ్రత జిల్లాలలో మంత్రి ఈటల వరుస పర్యటనలు
  • రాజధాని నుంచి జిల్లాలకు వేగంగా వ్యాప్తి

రాష్ట్రంలో కొరోనా విలయతాండవం చేస్తున్నది. కొద్ది రోజులుగా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించినా శుక్రవారం నాటికి ఒక్కసారిగా పెరిగింది. కొరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి ఒక్క రోజులోనే శుక్రవారం రికార్డు స్థాయిలో  1986 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్‌ ‌బారిన పడ్డ వారి సంఖ్య మొత్తంగా 62, 703కు చేరింది. ఈ కేసులలో ఎప్పటి లాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ 586 ‌కేసులతో మొదటి స్థానంలో నిలవగా, ఆ తరువాత స్థానాలలో రాజధాని జిల్లాలైన మేడ్చల్‌, ‌రంగారెడ్డి నిలిచాయి. హైదరాబాద్‌ను మినహాయిస్తే రాష్ట్రంలోని ఐదు జిల్లాలలోనే మొత్తం 759 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం గమనార్హం. మేడ్చల్‌ ‌జిల్లాలో 207, రంగారెడ్డి 205, వరంగల్‌ అర్బన్‌లో 123, కరీంనగర్‌ 116, ‌సంగారెడ్డి 108 జిల్లాలలో ప్రతీ రోజు వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా 19 జిల్లాలలో ప్రతీ జిల్లాలోనూ పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 20కి పైగా ఉంది. అలాగే, శుక్రవారం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ ‌కేసులు నమోదైన మాదిరిగానే అదే రోజు అత్యధిక స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.

శుక్రవారం ఒక్కరోజే కొరోనా కారణంగా 14 మంది మృతి చెందారు. కాగా, రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన కొరోనా కేసులకు టెస్టుల సంఖ్యను భారీగా పెంచడమే కారణమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణవ్యాప్తంగా 21,390 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, రాష్ట్రంలో జిల్లాలలో భారీగా పెరుగుతున్న కేసులకు రాజధాని హైదరాబాద్‌తో లింకు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లా నుంచి ప్రతీ రోజూ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం లక్షలాది మంది హైదరాబాద్‌కు వస్తుంటారు. వీరంతా నగరంలోని బేగంబజార్‌, ‌చార్మినార్‌, ‌మదీనా, మలక్‌పేట, సికింద్రాబాద్‌, ఆబిద్స్, ‌వివిధ రద్దీ ప్రాంతాలలో తమ కార్యకలాపాలు ముగించుకుని తిరిగి తమ జిల్లాలకు వెళ్లిన క్రమంలో వీరి ద్వారా జిల్లాలలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని పేర్కొంటున్నారు.తాజాగా, వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా పరిధిలోకి వచ్చే వర్డన్నపేట పోలీస్‌స్టేషన్‌లో 14 మంది పోలీసులు కొరోనా బారిన పడ్డారు. వర్ధన్నపేటలో పట్టుబడ్డ గంజాయి కేసులో నిందితులను పట్టుకునేందుకు కొద్ది రోజుల క్రితం అక్కడి పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారు. నిందితుల కోసం నగరంలోని పలు ప్రాంతాలలో తిరిగిన క్రమంలో వీరికి కూడా వైరస్‌ ‌సోకినట్లు వారికి పాజిటివ్‌గా వచ్చిన సందర్భంగా తేలింది. అలాగే, కరీంనగర్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారికి కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది.

ఆ వ్యాపారి ట్రావెల్‌ ‌హిస్టరీని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించగా, అతడు కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌ ‌ప్రాంతంలో వస్త్రాలు కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో అతని దుకాణానికి వచ్చిన వారిని పరీక్షలు నిర్వహించగా, వారికి సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా, వందకు పైగా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్న జిల్లాలలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్వయంగా పర్యటించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారం రోజుల క్రితం వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 152కు చేరగా, అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ అధికారులతో పరిస్థితిని పరిశీలించిన మంత్రి ఈటల రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్యను 50లోగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అలాగే, ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో ఈటల అక్కడ సైతం పర్యటించారు. రానున్న రోజులలో వందకు పైగా కేసులు నమోదవుతున్న జిల్లాలలో మంత్రి స్వయంగా పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించాలని భావిస్తున్నారు.  ఈ జిల్లాలలో కొరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలకు తోడు ప్రజలు సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా చూడాలని సూచిస్తున్నారు. కేసుల తీవ్రత తగ్గే విధంగా అక్కడి అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

Leave a Reply

error: Content is protected !!