Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టాల రద్దు వెనుక అసలు విషయం

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇతర రాజకీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల చేతుల్లో ఉన్న ముఖ్యమైన వజ్రాయుధం (నూతన వ్యవసాయ సాగు చట్టాలపై వ్యతిరేకత)ను నిర్వీర్యం చేయడానికే బిజెపి నూతన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తూ రైతుల అభిప్రాయాలను గౌరవిస్తున్నట్టు ప్రకటిస్తూ ప్రతిపక్షాల చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పవచ్చు. అంతేగాని ఎందరో రైతులు వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తమ ప్రాణాలను కోల్పోయినందుకో, దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏకమై భారత్ బంద్ లు , రాస్తారోకోలు చేసి దేశాన్ని స్తంభింపజేసినందుకో, ధర్నాచౌక్ లో మహాధర్నా చేసినందుకో, లేదా ఈ నూతన వ్యవసాయ సాగు చట్టాలు రైతాంగానికి కీడు చేస్తాయి అని కేంద్రం భావించినందుకో ఈ చట్టాలను కేంద్రం రద్దు చేయలేదని, ఈ చట్టాల పై కేంద్రం వెనక్కి తగ్గలేదని స్పష్టంగా అర్థమవుతుంది.

ఎట్టకేలకు వివాదాస్పదమైన నూతన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ఉదయం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఈ రద్దు ఘనత తమ నేతదే అంటూ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీని, తెరాస కేసీఆర్ ను, కమ్యూనిస్టులు వారి పార్టీకి ఆపాధిస్తూ బాజాభజంత్రీల వాయింపులతో చాటింపు మొదలు పెట్టారు. నిజానికి నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ నాయకుల వ్యతిరేక ఉద్యమాలకు, నిరసనలకు తలొగ్గేదైతే ఆ ఉద్యమాలు వేడి మీదున్నప్పుడే రద్దు విషయాన్ని ప్రకటించేది. అలాగే, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు దేశ రాజధాని దిల్లీలో యుద్ధాన్ని తలపించేలా చేసిన ఉద్యమ తీవ్రత మర్చిపోలేనిది, అలా రైతులు చేసిన ఉద్యమాలకు కేంద్రం తలొగ్గి ఉంటే ఇప్పటిదాకా వ్యవసాయ చట్టాలు రద్దు కాకుండా ఉండేవా? అనే ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తుంటాయి.

ఇక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రకటన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఎక్కడ కూడా నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, అవి రైతులకు నష్టాన్ని చేకూరుస్తాయని భావించినట్టు ప్రకటించలేదు. అలా ప్రకటించకపోగా.. భారతదేశంలో ఎంతో మంది సామాన్య రైతులు ఉన్నారని, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చామని, కానీ రైతాంగంలో ఉన్న ఒక వర్గానికి ఈ చట్టంపై పలు అపోహలు ఉన్నాయని, వారి అపోహలు తీర్చడానికి ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపట్టడం జరిగిందని, అయినప్పటికీ ఆ వర్గం సంతృప్తి చెందలేదని, వారి డిమాండ్ల మేరకే నూతన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే అర్థమేంటి.. ఈ చట్టాల పై ప్రభుత్వం ఇప్పటికీ సానుకూలంగానే ఉందనేగా ప్రధాని ప్రకటన సారాంశం..!! కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బ తీస్తూ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ మార్కెట్ ను అప్పజెప్పడం, కనీస గిట్టుబాటు ధర లభించకపోయినా ప్రభుత్వం పై న్యాయ పోరాటం చేయడానికి రైతులకు ఎలాంటి హక్కు ఉండకుండా పోతుందని, తదితర అభ్యంతరాలను, ప్రతిపక్షాలు, రైతులు, విశ్లేషకుల బాహాటంగానే వెలిబుచ్చారు. అయితే ఆయా అభ్యంతరాల రీత్యా ఈ చట్టంపై ప్రభుత్వం పునరాలోచించుకొని రద్దు చేసిందని ప్రధాని మోడీ ఎక్కడ ప్రకటించలేదని మనం గుర్తించాలి. పైగా ఈ చట్టం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమేనంటూ ప్రకటిస్తూనే ఒక వర్గం వారు లేవనెత్తిన అపోహలను సంతృప్తికరంగా తీర్చలేకపోయామని ఈ పరిస్థితులలో చట్టాలను రద్దు చేస్తున్నట్టు మాత్రమే ప్రధాని మోడీ ప్రకటించడం గమనార్హం.

మరో విషయం ఆలోచిస్తే నిన్న మొన్నటివరకు ఈ నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాదన మరో విధంగా ఉంది. అదేంటంటే నూతన వ్యవసాయ సాగు చట్టాలను మెజారిటీ రైతులు ఆహ్వానిస్తున్నారని, రైతాంగం లోని ఒక వర్గానికి చెందిన కొద్దిపాటి రైతులు మాత్రమే ఈ చట్టాల పై అనవసరమైన అపోహలను వ్యక్తపరుస్తున్నారని, అలాంటి వారికి తోడుగా ప్రతిపక్ష పార్టీలు ఈ రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సైతం ఈ నూతన వ్యవసాయ సాగు చట్టాలపై స్పందించి రైతులందరూ రోడ్లపై గడుపుతున్నారని ఈ చట్టాల పై పునరాలోచన చేయగలరా.. ఈ చట్టాలను సస్పెన్షన్లో ఉంచగలరా.. అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కేంద్రం వ్యవసాయ సాగు చట్టాలను సస్పెన్షన్ లో పెట్టే ఆలోచనే లేదని, కావాలంటే చర్చలు జరుపుతాం అంటూ ప్రకటించింది. దీంతో సుప్రీంకోర్టు స్వయంగా వ్యవసాయ సాగు చట్టాలను సస్పెన్షన్లో పెట్టిన విషయం విదితమే. మరి నిన్న మొన్నటి వరకు సుప్రీంకోర్టు జోక్యానికి సైతం తలొగ్గని కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ప్రతిపక్షాల, రైతుల ఉధృతమైన ఉద్యమాలు అంతగా లేని సమయంలో నూతన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించినట్టు? ఆ ప్రకటన కూడా ఆ సాగు చట్టాలు రైతుకు అనుకూలం కాదని భావించినట్టు ఎక్కడ ప్రకటించకుండానే రద్దు చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించినట్టు?? అని ప్రశ్నించు ఉన్నట్లయితే మనకు కొన్ని సమాధానాలు లభిస్తాయి.

నూతన వ్యవసాయ సాగు చట్టాలపై దక్షిణ భారతదేశం తో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు దిల్లీలో ఉద్యమాలు చేస్తున్న రైతులను చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికొస్తే 2022 సంవత్సరం ప్రారంభంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల లోని బీజేపీ యేతర శక్తులు నూతన వ్యవసాయ సాగు చట్టాలపై కొనసాగుతున్న వ్యతిరేకత, రైతుల మనోభావాలను బిజెపిని ఎదుర్కోవడానికి తమ చేతిలోని వజ్రాయుధంగా మలచుకునే వ్యూహంతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నట్టు బిజెపి గ్రహించింది. రాష్ట్రాలలో, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఏ రాజకీయ పార్టీకయినా ప్రస్తుత తరుణంలో తమ పట్టును కోల్పోకుండా చూసుకోడానికి, కొత్త శక్తిని పుంజుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తున్నాయి. ఈ కోణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇతర రాజకీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల చేతుల్లో ఉన్న ముఖ్యమైన వజ్రాయుధం (నూతన వ్యవసాయ సాగు చట్టాలపై వ్యతిరేకత)ను నిర్వీర్యం చేయడానికే బిజెపి నూతన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తూ రైతుల అభిప్రాయాలను గౌరవిస్తున్నట్టు ప్రకటిస్తూ ప్రతిపక్షాల చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పవచ్చు.

అంతేగాని ఎందరో రైతులు వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తమ ప్రాణాలను కోల్పోయినందుకో, దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏకమై భారత్ బంద్ లు , రాస్తారోకోలు చేసి దేశాన్ని స్తంభింపజేసినందుకో, ధర్నాచౌక్ లో మహాధర్నా చేసినందుకో, లేదా ఈ నూతన వ్యవసాయ సాగు చట్టాలు రైతాంగానికి కీడు చేస్తాయి అని కేంద్రం భావించినందుకో ఈ చట్టాలను కేంద్రం రద్దు చేయలేదని, ఈ చట్టాల పై కేంద్రం వెనక్కి తగ్గలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా నూతన వ్యవసాయ సాగు చట్టాలపై ప్రస్తుత కేంద్ర నిర్ణయం దేశంలోని రైతులు సంఘటితమై ఐక్య పోరాటాలు చేసిన ఫలితంగా మాత్రమే చూడాలి. వారి వోట్లు రాజకీయ పార్టీలకు అవసరం కాబట్టి ఏ ప్రభుత్వం అయినా వాటి విధానాలు ప్రజాభీష్టం మేరకు మార్చుకోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు సమైక్యమైతే ఎంతటి ప్రభుత్వ విధానాలనైనా తిప్పి కొట్టవచ్చునని మహాత్మాగాంధీ తెలిపిన నినాదం నూతన వ్యవసాయ సాగు చట్టాల రద్దు నిర్ణయం ద్వారా మరోమారు నిజమైందని చెప్పవచ్చు.

శ్రీనివాస్ గుండోజు,
జర్నలిస్ట్, రచయిత,
ఫోన్: 99851 88429

Leave a Reply