Take a fresh look at your lifestyle.

మనిషిలో నిద్రాణమైన నిజమైన మనిషిని బతికించాలి

“సజ్జన సాంగత్యంలోనే సకల సుగుణాలు అలవడతాయి. ధరిత్రి పై జనించిన వారంతా జన్మతః ఎవరూ చెడ్డవారు కాదు. తల్లిదండ్రుల పెంపకలోపం వలనో, దుర్జన సాంగత్యం వలనో,చదువులు ప్రసాదిస్తున్న కుసంస్కారం వలనో దుర్గుణాలు ప్రాప్తిస్తాయి. కొలువుల కోసం కొందరు చదువుతుంటే… ఇంట దొరకని స్వేచ్ఛ విద్యాలయాల్లో దొరుకుతుందని ఆశిస్తూ చదువుకోసం కాకుండా విలాసాల కోసం ఒక మార్గంలా విద్యను ఎన్నుకోవడం చూస్తున్నాం.”

గంధపు చెట్టును విషసర్పాలు అంటిపెట్టుకున్నా, అవి తమ సహజ నైజాన్ని విడనాడలేవు. మంచివారి మాటలు కూడా సమాజంలోని దూర్జనత్వాన్ని దూరం చేయలేవు.మంచి,చెడుల కలయికతో వర్తమాన సమాజం నడుస్తున్నది. దుర్జనత్వం ప్రబలడం వలన కొద్దిపాటి సజ్జనత్వం కూడా వెలవెల బోతున్నది. ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు వర్షించదు.శరీరావయాల్లో ,ఏ ఒక్కటి ఛిద్రమైనా, గాయపడినా ముందుగా చెమర్చేవి కనులే. ఆనందానికైనా, ఆవేదనకైనా, కనులు పలికే భావాలు కవిహృదయమున్న అందరికీ అవగతమవుతాయి. హృదయంలో పెల్లుబికిన హర్షాతిరేకాలకు, ఆవేదనా స్వరాలకు ముఖ కవళికలు నిజమైన సంకేతాలు మోములో ప్రకటితమైన భావాలే (ఫేస్‌ ఈజ్‌ ఇం‌డక్స్ ఆఫ్‌ ‌ది మైండ్‌) ‌వ్యక్తి ని అంచనా వేసే సంకేతాలని చెబుతారు.నటించే మనుషుల్లో నిజమైన భావాలు మోము పై కానరావు. నటన కపటత్వాన్ని మొహంపై కానరానీయకుండా కప్పేసే తెర లాంటిది. కాని నయనాలకు నటనరాదు. కోపమైనా, సంతోషమైనా బహిర్గతం చేయడం లో కళ్ళే ముందుంటాయి. కనుల వెంట వర్షించే జలధారలే ఆనందానికి, విషాదానికి సూచనగా భావించవచ్చు.

కవి భావానికి కవిత అక్షర రూపం. మనసులోని గాయాలకు కన్నీటి ధారలే సాక్షీభూతం. వికసిత హృదయాల చిరుమోములో ప్రస్ఫుటమయ్యే మందస్మిత మకరంద దరహాస విన్యాసమే వారిలోని కల్లాకపటం లేని వ్యక్తిత్వానికి సాక్ష్యం. సహజత్వంతో రంగరించిన వ్యక్తిత్వమే నిజమైన సౌందర్యం. హృదయంలో లేని విశిష్ఠగుణాలను పైకి ప్రదర్శించినా ఫలితముండదు. లేని గుణాలను కృత్రిమ ప్రదర్శన ద్వారా మోము పై రంగరించడం అపహాస్యమే. ఈ భావాలను కనులు ఏమార్చలేవు.చెమర్చిన కళ్ళల్లో బాధను చూసి చలించే మనస్తత్వాన్ని మానవత్వం అంటారు. ఇతరుల కంట కన్నీరు ని తమ ఆనందానికి పన్నీరు లా మార్చుకునే మనస్తత్వాలను పైశాచికత్వం అంటారు.పూలు పరిమళాన్ని వెదజల్లితే, మొగలి పూలు కూడా సుగంధాన్ని వెదజల్లుతాయి. పూలు దైవారాధనకు అవసరాలైతే మొగలి పూలు పాములకు ఆవాసాలు. పూలలో పలు రకాలున్నా వాటి స్వభావాలు వేరుగా ఉన్నట్టు మనుషుల్లో కూడా మంచి చెడుల వ్యత్యాసం ఉంటుంది. మంచి గంధపు చెట్టు మాటున దాగున్న సర్పాల పడగనీడలో విశ్రమించే వారికి సుగంధపు వాసనే తెలుస్తుంది గాని భుజంగాలకోరలకు బలైపోతున్నామని తెలియదు. మంచితనం ముసుగులో దాగున్న దానవత్వం,కృతకమైన భాషణం వ్యక్తమవుతున్నా గుడ్డిగా నమ్మే వారంతా జీవిత మజిలిలో వంచనకు బలైపోతూనే ఉంటారు. దుర్జనులని తెలిసి దగ్గరవడం మనల్ని మనం వంచించుకోవడమే. నడక మారి, నడత చెడి, సజ్జనకోటికి దూరమైతే దుర్జనకోటి దగ్గరకావడమంటే పతనపు అంచులపై నిలబడి పాతాళబిల ద్వారంలోకి జారడం లాంటి మూర్ఖత్వమే.

సజ్జన సాంగత్యంలోనే సకల సుగుణాలు అలవడతాయి. ధరిత్రి పై జనించిన వారంతా జన్మతః ఎవరూ చెడ్డవారు కాదు. తల్లిదండ్రుల పెంపకలోపం వలనో, దుర్జన సాంగత్యం వలనో,చదువులు ప్రసాదిస్తున్న కుసంస్కారం వలనో దుర్గుణాలు ప్రాప్తిస్తాయి. కొలువుల కోసం కొందరు చదువుతుంటే… ఇంట దొరకని స్వేచ్ఛ విద్యాలయాల్లో దొరుకుతుందని ఆశిస్తూ చదువుకోసం కాకుండా విలాసాల కోసం ఒక మార్గంలా విద్యను ఎన్నుకోవడం చూస్తున్నాం. పాఠశాల వరకూ బుద్దిగా ఉన్న పిల్లలు ఉన్నత విద్యకొచ్చేసరికి ఉన్నత భావాలను గాలికొదిలేసి, గాలికి కొట్టుకొచ్చిన విదేశీ సంస్కృతి కి బానిసలై, పనికి మాలిన ఫ్యాషన్లతో, ఎక్స్పెషన్లతో సమాజం దృష్టి లో అవహేళనకు గురౌతున్నారు. విద్యల్లో విలువలుండాలి. వివేకవంతమైన నడత అలవడాలి. విద్యలను సేద్యంచేసి, బాహ్యప్రపంచంలో కి అడుగుపెట్టినా సంస్కారం లేకపోతే ఫలితం పూజ్యం. దుర్జన సాంగత్యం వలన సజ్జనులంతా వివేకం కోల్పోయి సమాజాన్ని అధః పాతాళానికి నెట్టేస్తున్నారు.

కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు, తాను చెడిన కోతి వనమంతా చెరచినట్టు దుర్జన సాన్నిహిత్యం కలుషిత ప్రపంచాన్నే మనముంగిట సాక్ష్యాత్కరింపచేస్తుంది. సత్సంగమా? విష పరిష్వంగమా అనేది మనంతట మనమే నిర్ణయించుకుని, వాస్తవం తెలుసుకుని వివేచనతో మెలగాలి. బ్రతకడానికి చేసే వంచన అనేది నిచ్చెన గా మారిపోయిన ప్రస్తుత వ్యవస్థలో సజ్జనత్వానికి తావు లేదు.మనుగడకోసం పోరాటం నాటి కాలానిదైతే, కాసుల కోసం ఆరాటం నేటి కాలానిది. ఆకలిదప్పికలతో ఇతర జంతువులను వేటాడే నాటి కాలానికి, కడుపునిండినా, ఇతరుల కడుపుగొట్టి,తరతరాలకు తరగని సంపదను కూడబెట్టి పాపపు కూపంలోకి దారులు వెదుక్కుంటూ పతనమౌతున్న నేటి కాలానికి హస్తిమశకాంతమంత వ్యత్యాసముంది. మానవాళి నైతికంగా అధఃపాతాళానికి దిగజారిపోయిన నేపథ్యంలో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ఈ హద్దులు లేని ఆటవిక వేటాడే సంస్కృతి కి చరమగీతం పాడాలి. కృత్రిమతత్వానికి స్వస్తి చెప్పి, సహజత్వంతో జీవించి, కల్లా కపటం లేని నూతన మానవ సమాజ నిర్మాణానికి మనమంతా కృషి చేయాలి. మనిషిలో నిజమైన మనిషిని బతికించాలి.

– సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడెం,ప.గో.జిల్లా,
ఆంధ్రప్రదేశ్‌, ‌మొబైల్‌: 9704903463

Leave a Reply