Take a fresh look at your lifestyle.

నాటి క్వారంటైన్‌ ‌కేంద్రమే నేటి కోరంటి దవాఖానా

“హైదరాబాద్‌లో ప్రత్యేకమైన దిగ్బంధం సౌకర్యాలు ఉండాలనే ఆలోచన అక్కడి నుండే  మొలకెత్తింది. అలా ఈ వ్యాధుల నివారణ, చికిత్స కోసం 1915లో నగరానికి దూరంగా ఈరన్నగుట్ట దగ్గర ఒక చిన్నపాటి దవాఖానాను ఏర్పాటు చేశారు. ఇలా ఆ రోగుల నుంచి ఇతరులకు జబ్బులు సోకకుండా ఆయా రోగులను క్వారంటైన్‌లో ఉంచే పద్దతి ప్రారంభించారు. అందుకే దీనిని అప్పట్లో క్వారంటైన్‌ ‌హాస్పిటల్‌ అని పిలిచేవారు.”

ప్రకృతి వైపరీత్యాలు, అంటురోగాలు ప్రపంచాన్ని, మానవ సమాజాన్ని అప్పుడప్పుడు అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. వాటి దాటికి కొన్నిసార్లు మనిషి దగ్గర సమాధానం ఉండదు. అప్పటి హైదరాబాదు రాష్ట్రం కూడా ఈ విపత్తులకు అతీతమేమి కాదు. కాని వాటిని నివారించడంలోనూ, సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ నిజాం నవాబులు చూపిన నిబద్ధత, ముందుచూపు ప్రశంసనీయం. 1908 సెప్టెంబరు 28న మూసినదికి వచ్చిన వరదలు నగరాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నింటినో అతలాకుతలం చేసాయి. తుగ్యాని సితంబర్‌ అని స్థానికులచే పిలవబడే ఈ వరదలు దాదాపు యాభైవేల మంది ప్రజల ప్రాణాలు బలిగొన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్‌ అం‌టు వ్యాధులకు లోనై సరియైన చికిత్స కరువై దురావస్థలో ఉండేది. కలరా, టైఫాయిడ్‌, ‌మలేరియా వంటి వ్యాధులు పెరిగి భాగ్యనగరం బరబాతయ్యింది. ప్రజల ఆరోగ్య సంరక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికినీ మరణాల రేటు క్రమం తప్పకుండా పెరగడం సర్కారుకు సవాలుగా పరిణమించింది. వరదల వలన సంభవించిన కాలుష్యం కారణంగా హైదరాబాదులో ఎన్నో అంటురోగాలు ప్రబలాయి. కొత్త కొత్త జ్వరాలు, గత్తర(కలరా) హైదరాబాదులో వ్యాపించి మరణాల సంఖ్యను రెట్టింపు చేశాయి.

అప్పటి హైదరాబాదు రెసిడెంట్‌ ‌సర్జన్‌ ‌నాటి నిజాం నవాబైన మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ను కలిసి ప్రజల పరిరక్షణ కోసం ఏదో ఒకటి సత్వరమే చేయవలసి ఉందనే విషయాన్ని తెలియజేసి రోగులను సాధారణ ప్రజలకు దూరంగా ఉంచవలసిందేనని ఒప్పించాడు. హైదరాబాద్‌లో ప్రత్యేకమైన దిగ్బంధం సౌకర్యాలు ఉండాలనే ఆలోచన అక్కడి నుండే మొలకెత్తింది. అలా ఈ వ్యాధుల నివారణ, చికిత్స కోసం 1915లో నగరానికి దూరంగా ఈరన్నగుట్ట దగ్గర ఒక చిన్నపాటి దవాఖానాను ఏర్పాటు చేశారు. ఇలా ఆ రోగుల నుంచి ఇతరులకు జబ్బులు సోకకుండా ఆయా రోగులను క్వారంటైన్‌లో ఉంచే పద్దతి ప్రారంభించారు. అందుకే దీనిని అప్పట్లో క్వారంటైన్‌ ‌హాస్పిటల్‌ అని పిలిచేవారు. అలా నగరంలో మొదటి క్వారంటైన్‌ ‌దవాఖానా ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది కోరంటి హాస్పిటల్‌గా ప్రసిద్ధి చెందింది. మద్రాస్‌, ‌బొంబాయి రెసిడెన్సీలలో రోగుల దిగ్బంధన సౌకర్యాలు ప్రారంభమైనప్పటికీ, ఆయా ప్రాంతాల ప్రజలు కూడా హైదరాబాదులో ఉన్న కోరంటి దవాఖానాకే పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కర్నాటక, మహారాష్ట్ర, ఓడిశాతో సహా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడకే వచ్చేవారంటే ఈ దవాఖానా ఆ కాలంలోనే ఎంత పాపులారిటి సంపాదించిందో అర్థమౌతుంది.

ఈరన్నగుట్టలోని క్వారంటైన్‌ ‌కేంద్రం 1915 మరియు 1923 మధ్య ఎనిమిది సంవత్సరాలు తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులకు సేవలను అందించింది. 1923 నాటికి, దవాఖానా నల్లకుంట వద్ద ఉన్న ప్రస్తుత ప్రదేశానికి మార్చబడింది కాని శాశ్వత నిర్మాణం జరగలేదు. నల్లకుంట వద్ద వైద్య సదుపాయాలు నిర్వహించడానికి గుడారాలలో పడకలు ఏర్పాటు చేసి, నిజాం రెసిడెంట్‌ ‌సర్జన్‌ ఈ ‌దవాఖానాలో నియమించిన వైద్యులు,,నర్సింగ్‌ ‌సిబ్బంది తమ సేవలతో దవాఖాన ప్రతిష్ఠను మరింతగా పెంచారు. 1927-28 మధ్యకాలంలో ఈ దవాఖానాలో మొదటిసారిగా వ్యాధుల నిర్ధారణకు ఒక ప్రయోగశాలను ప్రారంభించారు. హైదరాబాదు ప్రాంతం ఉష్ణమండల ప్రదేశం కావడంతో ఇక్కడ మలేరియా, డెంగ్యూ, చికెన్‌ ‌గునియా, డిఫ్తీరియా, డయేరియా, మిజిల్స్, ‌గవదబిళ్ళలు వంటివి ఎక్కువ వ్యాపించే అవకాశం ఉండేది. అయితే ఏ వ్యాధి వచ్చినా వాటి సాధారణ లక్షణం జ్వరం. ఈ దవాఖానాకు వారు జ్వరంతోనే వస్తారు కాబట్టి ఇది ఫీవర్‌ ‌హాస్పిటల్‌ అని పిలవడం మొదలైంది. దాదాపు పదమూడున్నర ఎకరాలలో నిర్మించబడిన ఈ దవాఖానా వంద సంవత్సరాల నుంచి ఎందరో పేదరోగులకు వైద్య సేవలందిస్తూనే ఉంది.

19వ శతాబ్దం చివరి భాగంలో హైదరాబాద్‌లో వైద్యరంగంలో అనేక పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిజాం నవాబులతో సంబంధం కలిగి ఉండేవి. హైదరాబాద్‌ ‌మెడికల్‌ ‌స్కూల్‌లో క్లోరోఫామ్‌ ‌కమిషన్‌ ‌పరిశోధన ముగిసిన తరువాత ఒక వైద్యుడు హైదరాబాద్‌లో మలేరియా వ్యాధి సంబంధిత పరిశోధనలో గొప్ప పురోగతి సాధించాడు. ఆ వైద్యుడే సర్‌ ‌రొనాల్డ్ ‌రాస్‌. ‌దోమకాటు వలన దోమలోని పరాన్నజీవి మానవునిలో మలేరియా వ్యాధి సంక్రమణకు కారణమవుతుందని ఆయన 1897లో కనుగొన్నాడు. ఈ పరిశోధనకు గాను 1902లో ఆయన వైద్యరంగంలో నోబెల్‌ ‌బహుమతి పొందాడు. 1997లో సర్‌ ‌రొనాల్డ్ ‌రాస్‌ ‌శతజయంతిని పురస్కరించుకొని ఈ దవాఖానాకు సర్‌ ‌రొనాల్డ్ ‌రాస్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌ట్రాపికల్‌ అం‌డ్‌ ‌కమ్యూనికెబుల్‌ ‌డిసీజెస్‌ అని పేరు పెట్టారు. రోనాల్డ్ ‌రాస్‌ ‌తన పరిశోధనలకు గాను నోబెల్‌ ‌బహుమతి అందుకున్నప్పటికీ, ప్రశంస పత్రంలో తాను పరిశోధనలు చేసిన హైదరాబాద్‌ ‌నగరం పేరు ప్రస్తావించకపోవడం శోచనీయం. బేగంపేటలోని సర్‌ ‌రోనాల్డ్ ‌రాస్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌పారాసిటాలజీని ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. రెండు ఎకరాలలో విస్తరించి ఉన్న పారాసిటాలజీ ఇనిస్టిట్యూట్‌ను నిజాం ప్రభుత్వమే నిర్మించి ఇచ్చింది. ఇందులోనే రోనాల్డ్ ‌రాస్‌ ‌హైదరాబాద్‌లో మలేరియా ప్రయోగాలు చేసే కాలం నాటి జ్ఞాపకాలతో కూడిన చిత్రాలతో ఒక మ్యూజియం కూడా ఉంది.

ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా నగర అభివృద్ధిలో భాగంగా నగరం నడిబొడ్డుకు చేరుకుంది. చుట్టుపక్కల నల్లకుంట, విద్యానగర్‌, ‌తిలక్‌ ‌నగర్‌, ‌బర్కత్‌ ‌పుర, అంబర్‌ ‌పేట్‌లు ఏర్పడి ఫీవర్‌ ‌హాస్పిటల్‌కు ప్రత్యేకతను సమకూర్చాయి. ఈ దవాఖానాకు హైదరాబాదులొని స్థానికులే కాకుండా తెలంగాణ, ఆంధప్రదేశ్‌, ‌కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. 2005లో శంకుస్థాపన చేయబడి 2011 నుండి ఇక్కడ పనిచేస్తున్న వైరాలజీ ల్యాబ్‌ అత్యంత అధునాతనమైనది. అనేక రకాల ఇన్ఫెక్షన్‌లకు, జబ్బులను ఇక్కడ పరీక్షిస్తారు. ఈ ల్యాబ్‌ ఏర్పాటుకు ముందు పరీక్షల కోసం. రోగ నిర్ధారణల కోసం పూణేకు నమూనాలను పంపేవారు. వీటి రిపోర్టులు రావడానికి నెలకు పైగా సమయం పట్టేది. ఇది కాలయాపనతో కూడుకున్నదే కాకుండా కొన్నిసార్లు రోగుల ప్రాణలకు ముప్పు వాటిల్లేది. మొదట్లో ఏడు వార్డులతో ప్రారంభమైన ఈ దవాఖానాలో ప్రస్తుతం తొమ్మిది వార్డులతో దాదాపు 330 పడకలు ఉన్నాయి. ప్రతి జబ్బుకు విడివిడిగా వార్డులుండడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతిరోజూ దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల బయటి రోగులు(ఔట్‌ ‌పేషంట్స్) ఇక్కడికి వస్తారు. అంటే ఏడాదికి దాదాపు రెండున్నర లక్షలు. అంతేకాకుండా పదిహేను వేల మంది లోపలి రోగులకు(ఇన్‌ ‌పేషంట్స్) ‌సేవలందిస్తుంది. రోగుల సేవకోసం ఇక్కడ 30 నుంచి 35 మంది డాక్టర్లు, 270కి పైగా ఇతర సిబ్బంది ఉన్నారు. వైద్యం కార్పొరేట్‌ ‌మయమైన నేటికాలంలో పేదలకు వైద్య సేవలందిస్తున్న ఈ దవాఖానా హైదరాబాదులో ప్రముఖమైంది.ప్రస్తుతం కరోనా వైరస్‌ ‌ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో క్వారంటైన్‌ అనే పేరు చాల పాపులర్‌ అయ్యింది. వంద సంవత్సరాల క్రితమే హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన మొదటి క్వారంటైన్‌ ఆసుపత్రి అయిన మన ఫీవర్‌ ‌హాస్పిటల్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఆ దవాఖానా స్థాపకులకూ, అందులో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మనమిచ్చే కనీస గౌరవం.

Leave a Reply