- లోక్‌సభలో లేవనెత్తుతానన్న రేవంత్
- రాష్ట్రాన్ని దివాలా టిఆర్ఎస్ తీయించిందని విమర్శ
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తనకెలాంటి సమాచారం లేదని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం, సమాచారం లేకపోవడం శోచనీయమన్నారు. ఇది ప్రధాని వ్యక్తిగత పర్యటన కాదని..బీజేపీ సొంత కార్యక్రమం అంతకంటే కాదని… అలాంటప్పుడు స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వక పోవడమేంటని ప్రశ్నించారు. ఇలా చేయడం ఒక ప్రజాప్రతినిధిని అవమానించడమేనని మండిపడ్డారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని.. లోక్‌సభ సమావేశాల్లోనూ లేవనెత్తుతానని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రాన్ని దివాలా టిఆర్ఎస్ ప్రభుత్వం తీయించింది:
రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ దివాలా తీయించిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ఇరవై ఏళ్ల పాటు శ్రమించి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందన్నారు. ‘అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, మెట్రో రైలు, పీవీ నరసింహా రావు బ్రిడ్జిని కట్టించింది కాంగ్రెస్సే. కృష్ణా-గోదావరి నదీ జలాలను హైదరాబాద్‌కు కాంగ్రెస్ పార్టీనే తరలించింది. ఐటీ, ఫార్మా కంపెనీలను కాంగ్రెస్సే రప్పించింది. ఉప్పల్ స్టేడియాన్ని కట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇలాంటి అభివృద్ధి చెందిన ధనిక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ దివాలా తీయించింది. మత విద్వేషాలతో రెచ్చగొడుతున్న టీఆర్ఎస్, బీజేపీలను ప్రజలు ఓడించాలి’ అని రేవంత్ పేర్కొన్నారు. హిందూ-ముస్లింల మధ్య బీజేపీ తగాదాలు పెడుతోందని ఆయన ధ్వజమెత్తారు.