Take a fresh look at your lifestyle.

నా కాన్వాయ్‌పై దాడికి ప్రధానిదే బాధ్యత

  • దాడుల సంస్కృతి పోవాలి
  • రైతు సంఘం నాయకుడు టికాయత్‌

‌తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి ప్రధానమంత్రి నరేంద్రమోదీదే బాధ్యత అని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నాయకులు రాకేశ్‌ ‌టికాయత్‌ అన్నారు. రాజస్తాన్‌లో తన కాన్వాయ్‌పై కొంత మంది జరిపిన దాడిని ఆయన తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, దాడుల సంస్కృతి దేశంలో ఆగిపోవాలని శనివారం మిడియాతో మాట్లాడుతూ టికాయత్‌ అన్నారు. ‘నా కాన్వాయ్‌పై జరిగిన దాడకి కేంద్రమే బాధ్యత వహిస్తుంది. ఇది మరింకెవరి దాడో అని చెప్పలేము. ఎందుకంటే దాడికి పాల్పడ్డది భారతీయ జనతా పార్టీ యువజన విభాగానికి చెందిన వ్యక్తులే. ‘రాకేశ్‌ ‌టికాయత్‌ ‌గో బ్యాక్‌’ అని వారు నినాదాలు ఇచ్చారు.

 

వాళ్లు నా కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. లాఠీలతో దాడి చేశారు. మాతో వారెందుకు పోట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మేము రైతులము, రాజకీయ నేతలం కాదు’ అని టికాయత్‌ అన్నారు. శుక్రవారం రాజస్తాన్‌ ‌పర్యటనలో ఉన్న రాకేష్‌ ‌టికాయత్‌ ‌కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్‌లోని ఒక కారు ధ్వంసమైంది. పోలీసులు ఓ విద్యార్థి నేతను అరెస్ట్ ‌చేశారు. అయితే దాడికి పాల్పడ్డ వారు బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ కార్యకర్తలేనని బీకేయూ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు రాకేశ్‌ ‌టికాయత్‌ ‌వెళ్లనున్నారు.

 

పశ్చిమ గుజరాత్‌లో రైతులతో నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో టికాయత్‌ ‌పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ విషయమై టికాయత్‌ ‌స్పందిస్తూ ‘గుజరాత్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నాం. మేం వెళ్లబోయే ప్రాంతం సున్నితమైనది తెలుసు. అందుకే మేం ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వెళ్తున్నాం. బయటి వ్యక్తులను అక్కడికి రానివ్వడం లేదు. కానీ మేము రైతులను కలవడానికి వెళ్తున్నాం’ అని టికాయత్‌ అన్నారు.

Leave a Reply