గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. చైనాతో జరుగుతున్న సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పడం లేదని రాహుల్ తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు అని, అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. చైనా సైనికులు మనవాళ్లను చంపే సాహసం ఎలా చేశారని, గాల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణల్లో భారత సైనికుల మృతి పట్ల ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని దశాబ్దాల తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లో ఇంత దారుణ సంఘటన చోటుచేసుకున్నా ప్రధాని మౌనం దాల్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఆయన ఎందుకు దాక్కుంటున్నారు? అయ్యిందేదో అయ్యింది. అయితే అక్కడ ఏం జరిగిందో మాకు తెలియాలి.
మన సైనికులను చంపడానికి చైనాకి ఎంత ధైర్యం? మన భూమిపై అడుగుపెట్టడానికి వాల్ళెందుకు బరితెగించారటూ రాహుల్ ట్విటర్లో ప్రశ్నించారు. తూర్పు లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో ఓ కల్నల్ సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ప్రతిష్టంభన నెలకొన్న ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.