Take a fresh look at your lifestyle.

రాజీనామాల రాజకీయం..!

“మూడు రాజధానుల పై ప్రజాభిప్రాయం డిమాండ్‌ చేస్తున్న చంద్రబాబు అమరావతి పై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? 2014 ఎన్నికలకు ముందు తాము గెలిస్తే  అమరావతిని రాజధాని చేస్తాం అని చెప్పి టీడీపీ ఎన్నికల్లోకి వెళ్లలేదు. మ్యానిఫెస్టోలో అమరావతి రాజధాని అంశం పెట్టలేదు. దీనితో సంబంధం లేకుండానే టీడీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత అయినా ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల ఆమోదం లభించిందా అంటే 2019లో ఘోరంగా ఓడిపోయింది. అసలు రాజధాని ప్రాంతంలోకి వచ్చే మంగళగిరి, తాడికోండ నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలవలేకపోయింది.”

rehana pendriveఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇప్పుడు రాజీనామాల చుట్టూ తిరుగుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు కాస్తా చట్టం రూపం దాల్చటంతో టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, కృష్ట, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే కొత్త డిమాండ్‌ను జనసేన తెర మీదకు తీసుకువచ్చింది. రెండు జిల్లాలో, మూడు జిల్లాలో కాదు అసలు మొత్తం శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పోవాల్సిందే అని 48 గంటల డెడ్‌లైన్‌ పెట్టారు చంద్రబాబు. మీ ఎమోషన్‌ మీ ఇష్టం, నిరూపించుకోగలం అనే ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయండి అని ప్రతి సవాలు విసిరింది అధికార వైసీపీ. మరి ఎవరి సవాలును ఎవరు స్వీకరిస్తారు? ఇవన్నీ తాటాకు చప్పుళ్లేనా ? చర్చ మాత్రం ఆసక్తికరంగా మారింది.

అధికార వికేంద్రీకరణ బిల్లులు, వాటి ప్రస్థానం:
వైఎస్‌ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర రాజధానిని అమరావతికే పరిమితం చేయకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు రాజధాని శాఖలు విస్తరించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి అనుగుణంగా సీఆర్డీయేను రద్దు చేస్తూ ఒక బిల్లు, అభివృద్ధి వికేంద్రకరణకు మార్గం సుగమం చేస్తూ మరో బిల్లును శాసనసభలో పెట్టారు. సభ ఆమోదం తర్వాత శాసన మండలిలోనూ బిల్లును ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. మండలిలో టీడీపీకి మెజార్టీ సభ్యులు ఉన్నారు. దీనితో బిల్లులను సెలక్ట్‌ కమిటికి పంపించాలని టీడీపీ ఎమ్మెల్సీ యనమల పట్టుబట్టారు. పట్టుబట్టడం తప్పుకాదు, ఏదేని ఒక బిల్లును అధికార, విపక్ష సభ్యుల మధ్య బేధాభ్రిపాయాలు వచ్చినప్పుడు మధ్యే మార్గంగా సెలక్ట్‌ కమిటి పంపించటం జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రత్యేకించి ఆ రోజు మండలిలో జరిగిన గందరగోళం కారణంగా సెలక్ట్‌ కమిటి పంపించే ప్రక్రియ ముందుకు వెళ్ళలేదు. మండలిలో మొదటి సారి బిల్లు పెట్టిన తర్వాత మూడు నెలల వరకు మండలి నుంచి ఆమోదించటం లేదా తిరస్కరించటం వంటిది జరగపోతే , అదే బిల్లును శాసనసభలో రెండో సారి ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. ఇది కూడా జరిగింది. తర్వాత మళ్లీ రెండోసారి మండలికి బిల్లు వెళ్లింది. బిల్లు ప్రవేశపెట్టి తర్వాత ఈసారి మండలికి నెల రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత డీమ్‌ టు బి యాక్సెప్టెడ్‌గా పరిగణిస్తారు రాజ్యాంగం ప్రకారం. అంటే రెండు సభలు బిల్లును ఆమోదించినట్లుగా పరిగణించి గవర్నర్‌ ఆమోద ముద్ర కోసం ప్రభుత్వం పంపిస్తుంది. గవర్నర్‌ ఆమోదిస్తే బిల్లులు చట్టం రూపం దాలుస్తాయి. ఇప్పుడు రాజధాని బిల్లులు ఈ శాసన ప్రక్రియ అంతా పూర్తి చేసుకోవటంతో అమరావతిలో శాసన, విశాఖలో పాలన, కర్నూలు న్యాయ రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.

మొదలైన రాజీనామా సవాళ్లు
గవర్నర్‌ రాజముద్ర పడగానే విపక్షాల నుంచి రాజీనామాల డిమాండ్లు, తర్వాత సవాళ్లు మొదలయ్యాయి. జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ పత్రికా ప్రకటనలో కృష్ట, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ విశ్లేషకులు పవన్‌ వైఖరి పై సెటైర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రమే ఎందుకు ఎమ్మెల్సీల రాజీనామా కూడా డిమాండ్ చేయొచ్చు కదా అని. (అలా డిమాండ్‌ చేస్తే జనసేన మిత్రపక్షం బీజేపీకి ఇబ్బంది. బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా మండలి సభ్యులే). పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు తోచించి అప్పుడు మాట్లాడతారు .ఒక స్పష్టమైన విధానం ఉన్న రాజకీయ నాయకుడు కాదన్న అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది. పవన్‌ డిమాండ్‌ను అలా ఉంచితే… ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరింత ముందుకు వెళ్లి సవాలు విసిరారు. వైసీపీ ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్‌ పెట్టారు. మొత్తం శాసనసభను రద్దు చేసి…ప్రభుత్వం తీసుకున్న రాజధాని నిర్ణయం పై ప్రజా అభిప్రాయం తీసుకుని గెలిచి చూపించాలన్నది బాబు డిమాండ్‌. ఇక్కడే అసలు పాయింట్‌ను ప్రతిపక్షం మిస్‌ అవుతోంది. మూడు రాజధానుల పై ప్రజాభిప్రాయం డిమాండ్‌ చేస్తున్న చంద్రబాబు అమరావతి పై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? 2014 ఎన్నికలకు ముందు తాము గెలిస్తే అమరావతిని రాజధాని చేస్తాం అని చెప్పి టీడీపీ ఎన్నికల్లోకి వెళ్లలేదు.

మ్యానిఫెస్టోలో అమరావతి రాజధాని అంశం పెట్టలేదు. దీనితో సంబంధం లేకుండానే టీడీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత అయినా ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల ఆమోదం లభించిందా అంటే 2019లో ఘోరంగా ఓడిపోయింది. అసలు రాజధాని ప్రాంతంలోకి వచ్చే మంగళగిరి, తాడికోండ నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలవలేకపోయింది. దీని అర్థం ఏమిటి? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతి అంతర్జాతీయ రాజధాని, తెలుగు ఆత్మగౌరవం వంటి నినాదాలు ఇస్తున్న టీడీపీకి ధైర్యం ఉంటే తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిచి చూపించమంటున్నారు. తెలంగాణా రాష్ట ఏర్పాటు కోసం తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్‌పీలు రాజీనామా చేశారు గాని, ఆంధ్రప్రాంత నేతలు కాదు. కాంగ్రెస్ ఓదార్పు యాత్ర వద్దన్నప్పుడు కూడా జగన్, విజయమ్మ ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి తిరిగి గెలిచి చూపించారు. అధికారపక్షం తీసుకున్న నిర్ణయంతో విబేధిస్తే ప్రతిపక్షాలు రాజీనామా అస్త్రం సంధించి ఎన్నికలకు వెళతాయి కాని ఇలా రివర్స్ లో రాజీనామాలకు డిమాండ్ చేస్తాయా? పైగా జగన్‌ ప్రభుత్వం సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు రాకుండా అమరావతిని శాసనరాజధానిగా కొనసాగిస్తోంది. అంటే అమరావతి నుంచి రాజధాని అనే పదం విడిపోవటం లేదు. రాజీనామాలు వంటి ఉత్తరకుమార సవాళ్లు, రాజకీయ ఎజెండాలతో ప్రజలను మభ్య పెట్టడం కాకుండా రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేయాలని ఆకాంక్షిద్దాం.

Comments are closed.