Take a fresh look at your lifestyle.

ఒక్క వైరస్‌..ఎన్నో ప్రశ్నలు మరెన్నో భయాలు

“క్యూబా అధ్యక్షుడు ఇటీవల ఏదో ఒక సందర్బంలో మాట్లాడుతూ ‘మేము యుద్ధ విమానాలను కొనుగోలు చేయలేదు. అణు అస్త్రాలను కొనుగోలు చేయలేదు. ఇంకో దేశం మీదికి దాడికి దిగడానికి కావలసిన వాటిని మేము కొనలేదు. ప్రజలకు అవసరమైన వైద్యం మీద దృష్టి పెట్టాం. పరిశోధనల మీద దృష్టి పెట్టాం. సమాజానికి, జీవనానికి ఉపయోగపడే రంగాల మీద దృష్టి కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం’ అని ఘంటాపథంగా చెప్పడం ఇప్పుడు పాలకుల దృష్టి ఏ రంగం మీద ఉండాలో మరోసారి  గుర్తుచేస్తోంది.”

ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా వణికిస్తున్నటువంటి వైరస్‌ ‌కొరోనా వైరస్‌. ఈ ‌వైరస్‌ ‌పుట్టుక దగ్గరుండి వ్యాప్తి వరకు కొంతమంది కొన్ని అనుమానాలు వెలువరిస్తున్నప్పటికీ కుట్ర సిద్ధాంతాలు, జీవరసాయన యుద్ధంలో భాగంగా ముందుకు వచ్చిందా లేక ప్రకృతిలోంచి మానవ ఆహారం అలవాటు నుంచి జన్మించిందా అనే చర్చలు అటుంచి కొరోనా వైరస్‌ ‌ప్రపంచంలో నేడు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నది. ఎన్నో భయాలను తెరమీదికి తెచ్చింది. ఈ వైరస్‌ ‌శరవేగంగా వ్యాపించడం మూలంగా లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉన్నది. ఇది వ్యాపించకుండా మనుషులు నియంత్రణ పాటించాలి అనే ప్రాథమికమైనటువంటి సూచన ఈరోజు ప్రపంచం మొత్తం పాటిస్తుంది. ఈ విషయమై ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. ఈ పెను ప్రమాదం ఎప్పుడు తప్పుతుంది, వ్యాక్సిన్‌ ‌కనిపెట్టడానికి ఎంత కాలం పడుతుంది. ఈ పాండిక్‌ ‌వైరస్‌ ‌ప్రభావం ఎంతటి మానవ సంక్షోభానికి దారితీస్తుంది..మనిషి బ్రతికి బట్టగట్టకలుగుతాడా? ఎంతటి ఆర్ధిక సంక్షోభానికి దారితీస్తుంది? అనే చర్చ సాగుతున్న సందర్భమిది. జీవన, మరణ సున్నిత సందర్భమిది. ఈ పరిస్థితికి పూర్వరంగాన్ని అర్థం చేసుకోకుండా భవిష్యత్‌ను అంచనా వేయలేము. ప్రపంచం మీద ఆధిపత్యాన్ని సాధించాలనే అమెరికా నుండి అతి చిన్న దేశం వరకు కూడా సోషల్‌ ‌డిస్టెన్స్‌ని(భౌతిక దూరం) ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సరిగ్గా ఇప్పుడే వివిధ భావ సంఘర్షణలు జరుగుతున్నాయి.

దేవుడు, దైవము ఇప్పుడు ఎక్కడ పోయారని, ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలు, పుణ్యక్షేత్రాలకు తాళాలు వేస్తున్నారని, సైన్స్ ‌మాత్రమే ప్రపంచానికి దిక్సూచి అని, లేదు సైన్స్‌తో పాటు యజ్ఞయాగాదులు, ప్రార్థనలతో ఈ మహమ్మారిని నియంత్రించవచ్చు అంటూ భావవాదులు, భౌతిక వాదులు పెద్ద ఎత్తున సోషల్‌ ‌మీడియాలో భావ సంఘర్షణకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏది గొప్ప అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం నేను చేయడం లేదు కానీ మనుషులుగా సంవత్సరాలు, సంవత్సరాలుగా అనుసరించిన విధానాలు, వైఫల్యాలు నేడు చర్చనీయాంశంగా కూడా ప్రధానంగా ముందుకు వస్తున్నాయి. అణు ఆయుధాలతో యుద్ధ నైపుణ్య, ఆయుధాల ఉత్పత్తుల తోటి ప్రపంచం మీద ఆధిపత్యానికి కాలుదువ్వుతున్న అమెరికా లాంటి పెద్ద దేశాల అనుభవాలు ఒకవైపు, చిన్న దేశమైనా వైద్యం, పరిశోధన ల మీద దృష్టి పెట్టిన క్యూబా అనుభవం మరొకవైపు కళ్లముందు కనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మారిన ధృక్కోణాలతో ప్రపంచీకరణ ముందుకు వచ్చిన తర్వాత ఒక్కొక్క దేశాన్ని ఆర్థికంగా చిద్రం చేస్తూ సాగిన సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల స్థానిక వనరులను సంస్కృతీ సంప్రదాయాలను వివిధ రూపాలలో విధ్వంసం చేస్తున్నదనేది వాస్తవం.

ఎక్కడికక్కడ అయా దేశాధినేతలు ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్పొరేటికరణ అంటూ తమ బాధ్యతల నుంచి తప్పుకుంటూ వ్యవస్థలు అన్నింటిని ఒక్కొక్కటిగా పెట్టుబడిదారులకు అప్పగిస్తూ వచ్చారు. ప్రైవేటీకరణ మోజులో ప్రభుత్వ రంగాన్ని కుదేలు చేస్తూ వచ్చారు. పెట్టుబడి రూపం మార్చుకుంటూ సంపదను పోగేసుకొనే ప్రయత్నం చేస్తూ పోయిందే తప్ప ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజా భద్రత అనే అంశాన్ని గాలికి వదిలేశారు. ఇప్పటి కొరోనా వైరస్‌ ‌సందర్భంలో మళ్లీ ప్రధానంగా ప్రభుత్వ వ్యవస్థలను బలపరచడం యొక్క ఆవశ్యకత చర్చించబడుతుంది. వివిధ దేశాలలో ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌ను, వివిధ ప్రైవేటు సంస్థలను నేడు జాతీయకరణ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇన్ని రోజులు విద్య, వైద్య రంగాలను ప్రైవేటుకు వదిలేయడం మూలంగా జాతీయ అవసరాలకనుగుణంగా వైద్య రంగాన్ని అభివృద్ధి చేయలేక పోవడం మూలంగా అన్ని దేశాలు పెద్ద ఎత్తున నష్టాన్ని చవి చూస్తున్నాయి. భారత ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌గారు దేశంలో కొరోనా బారి నుండి బయటపడడానికి కావలసిన వైద్యం, డాక్టర్లు ఇతరత్రా ఏదైనా మనకు సరిపడా లేవు అని బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. అమెరికా ఇటలీ, బ్రిటన్‌, ‌చైనా లాంటి దేశాలు కూడా బయటి దేశాల మీద వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.

సామ్రాజ్యవాద, విస్తరణవాద దేశాలు అంటరాని దేశంగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన చిన్న దేశం క్యూబా. అలాంటి క్యూబా ఈరోజు ప్రపంచానికి మేము అండగా ఉన్నామంటూ భరోసా ఇస్తూ ధైర్యం ఇస్తూ వేలాది మంది డాక్టర్లను పంపిస్తుంది. క్యూబా అధ్యక్షుడు ఇటీవల ఏదో ఒక సందర్బంలో మాట్లాడుతూ ‘మేము యుద్ధ విమానాలను కొనుగోలు చేయలేదు. అణు అస్త్రాలను కొనుగోలు చేయలేదు. ఇంకో దేశం మీదికి దాడికి దిగడానికి కావలసిన వాటిని మేము కొనలేదు. ప్రజలకు అవసరమైన వైద్యం మీద దృష్టి పెట్టాం. పరిశోధనల మీద దృష్టి పెట్టాం. సమాజానికి, జీవనానికి ఉపయోగపడే రంగాల మీద దృష్టి కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం’ అని ఘంటాపథంగా చెప్పడం ఇప్పుడు పాలకుల దృష్టి ఏ రంగం మీద ఉండాలో మరోసారి గుర్తుచేస్తోంది. అనవసరపు ఆర్భాటాలకు, భేషజాలకు, ఆధిపత్య ధోరణికి పోయి పర్యావరణంలో వస్తున్న మార్పులు బయో, జియోగ్రాఫికల్‌ ‌సర్దుబాటులను అర్థం చేసుకోకుండా ఇతర గ్రహాల మీద అధిపత్యం కొరకు అన్ని దేశాలు పోటీలుపడి తమ తమ బడ్జెట్లో వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తూ వచ్చారు. మరొకవైపు దేశ రక్షణ, భద్రత పేరుతో లక్షల కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున యుద్ధ సన్నద్ధ సామగ్రి ప్రోగు చేసుకునే పనిలో ఉన్నారు. కానీ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన పరిశోధనలపై కేంద్రీకరించలేకపోయారు.

ప్లేగు వ్యాధికి కానీ,1918లో వచ్చిన స్పానిష్‌ ‌ఫ్లూ కానియండి, ఎబోలావంటి ప్రమాదకరమైన అంటువ్యాధుల నుండి కాపాడుకోవడానికి మందులను కనిపెట్టిన ప్రపంచం 2003లో సార్ఫ్‌గా బైటపడిన వైరస్‌ అడుపుచేయడంలో నిర్లక్ష్యం మూలంగానే కొరోన కోవిడ్‌19 ‌చైనాలో అంటుకొని శరవేగంగా ప్రపంచ దేశాలను చుట్టి మానవాళి మనుగడకే ప్రమాదంగా తయారయింది. 2013లోనే కొరోన వైరస్‌ ‌చావులను పత్రికల్లో చూశాము. ఏ దేశమూ ఆ వైరస్‌ను తీవ్రంగా పరిగణించకపోవడం మూలంగా నావల్‌ ‌కొరోన కోవిడ్‌19 ‌విషపు కోరలు సాచింది. ప్రపంచ ఆధిపత్య పోరులో మానవాళిని మంట గలుపుతున్న ప్రపంచీకరణ, రాజకీయాలు ఇగనైనా మానవ కల్యాణానికి నడుం బిగిస్తేనే భవిష్యత్తు మిగులుతుంది. ఇగనుండి కొరోన ముందు కొరోన తర్వాతగా చరిత్ర చెప్పబడుతుండొచ్చు. ఆ తర్వాత ప్రపంచానికి భరోసా కల్పించడానికి సమకాలీన ప్రపంచం ముందుకు సాగాలి. అన్నిదేశాలు కలిసికట్టుగా కొరోన వైరస్‌ను ఎదుర్కొందాం. జీవ విధ్వంసక ఆయుధాలకై పరిశోధనలు కాకుండా జీవ సంరక్షక పరిశోధనలు కావిద్దాం. ఉద్దీపణలతో ఆర్థికాన్ని రంగాన్ని ఉద్ధరించుకోవచ్చు కానీ ముందు సడలుతున్న విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. సెల్యూట్‌ ‌క్యూబా.
– ధర్మార్జున్‌

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy