- ప్రజలకు కొరోనాను ఎదుర్కునే ధైర్యసాహసాలు ప్రసాదించాలి
- ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రజలకు ప్రసాదించాలి
- మేడారంలో గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు
మేడారం, (చిట్యాల/ములుగు) ఫిబ్రవరి19,(ప్రజాతంత్ర విలేఖరి): రాష్ట్ర ప్రజలు మేడారం సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని, వన దేవతలు ప్రజలకు అష్టైశ్వర్యాలు కల్పించి సుభిక్షంగా ఉండేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వనదేవతలను కోరారు. శనివారం జాతర చివరి రోజున ఆమె మేడారంను సందర్శించారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులు సమర్పించారు. ముందుగా మేడారం చేరుకున్న గవర్నర్ గిరిజన పూజారులు, ప్రభుత్వ అధికారులతో కలిసి వారి సమక్షంలో గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు గవర్నర్ తులాభారం వేసుకున్నారు. పట్టు వస్త్రాలను బుట్టలో పెట్టుకొని, నెత్తిన ఎత్తుకొని గద్దెల వద్దకు చేరుకున్నారు. సమ్మక్క, సారలమ్మ దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించి భక్తిప్రపత్తులతో ప్రార్థన చేశారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేవాదాయ శాఖ ఇచ్చిన చిత్రపటాన్ని స్వీకరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే గొప్పదైన మేడారం గిరిజన జాతర నిర్విఘ్నంగా జరిపించినందుకు అన్ని శాఖల అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలపై సమ్మక్క సారలమ్మ దేవతల కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారు. గతంలో లేనివిధంగా దేశం యావత్తు కరోన బారినపడి ప్రజలు అల్లకల్లోలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వనదేవతలు కరోనా నుంచి ప్రజలను రక్షించాలని వేడుకున్నారు.
జాతరను విజయవంతం చేసిన వివిధ శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దగ్గరుండి జాతరను అన్నీ తానై నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎమ్మెల్యే సీతక్కతో పాటు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఇలా త్రిపాఠి, ఆర్డీవో రమాదేవి, జాతర పునరుద్ధరణ కమిటి సభ్యుడు సిద్ధబోయిన జగ్గారావు, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.