Take a fresh look at your lifestyle.

రైతుల జీవితాలు అదానీ, అంబానీల చేతుల్లో..

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించే సత్తా కాంగ్రెస్‌ ‌కే
  • కేసీఆర్‌ ‌పాలనలో తెలంగాణ ప్రజలు నష్టపోయారు
  • ‌మోడీ, కేసీఆర్‌ ‌రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు : టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

దేశ రైతుల జీవితాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అదానీ, అంబానీల చేతుల్లో పెట్టారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాగూర్‌ ‌మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర ఇంఛార్జి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సంగారెడ్డిలో పర్యటించారు. శుక్రవారం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంజ్‌ ‌మైదానంలో దీక్షా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగింది. అంతకుముందు గణేష్‌ ‌గడ్డ నుండి సంగారెడ్డి వరకూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాణికం ఠాగూర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. గంజ్‌ ‌మైదానంలో ఏర్పాటు చేసిన దీక్షలో మాణికం ఠాగూర్‌ ‌మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రైతులకు అన్యాయం చేసే విధంగా ఉందని అన్నారు.

పండిన పంటల ధరలను ఇంట్లో కూర్చొని అదానీ, అంబానీ నిర్ణయిస్తారని తెలిపారు. రైతు వ్యతిరేక బిల్లును తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చిందని అన్నారు. ఏ లక్ష్యంతో కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇచ్చిందో…అది నెరవేరడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని అన్నారు. ఇంకో ఐదేళ్లు కేసీఆర్‌ అధికారంలో ఉంటే కేసీఆర్‌ అనిల్‌ అం‌బానీని మించిపోతాడని ఎద్దేవాచేశారు. అంబానీలు బిజినెస్‌ ‌చేసి సంపాదిస్తే…కేసీఆర్‌ ‌కమీషన్లతో వెనకొసుకున్నాడని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్‌ ‌వంచించాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం కమీషన్లతో వోట్లను కొంటున్నారని అన్నారు. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఐకమత్యంతో పని చేస్తే రాష్ట్రంలో అధికారం సాధిస్తామని అన్నారు. 2023లో తెలంగాణలో 79సీట్లు సాధించి, కాంగ్రెస్‌ ‌సీఎం సీటు కైవసం చేసుకుంటుందని అన్నారు. బిజెపి బీ…టీమ్‌ ‌టిఆర్‌ఎస్‌ అని విమర్శించారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిందని అన్నారు. బిజెపిని గద్దె దించే సత్తా కాంగ్రెస్‌ ‌పార్టీకే ఉందని స్పష్టం చేశారు. 1979 మెదక్‌ ఎం‌పీ స్థానానికి ఇందిరాగాంధీ నామినేషన్‌ ‌వేసేందుకు వచ్చిన స్థలానికి తాను పార్టీ రాష్ట్ర వ్యవహారాలబాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సంగారెడ్డికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా, ఐక్య మత్యంతో పనిచేయాలని కోరారు.

మోడీ, కేసీఆర్‌ ‌రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు : టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
మోడీ, కేసీఆర్‌ ‌రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభలో ఆయన మాట్లాడుతూ మాయ మాటలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి పంటలను రైతులే స్టాక్‌ ‌పెట్టుకొనేవారని అన్నారు. మోడీ తీసుకొచ్చిన కొత్త చట్టంతో వ్యాపారులకు అవకాశం కల్పించారని అన్నారు. అదానీ, అంబానీ, అమెజాన్‌కు లాభం చేకూరే విధంగా మోడీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కొత్త చట్టంతో రైతులకు నష్టం కలుగుతుందని తెలిపారు. మద్దతు ధర లేకుండా ఎవరైనా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. రైతుల జీవితాలు నాశనం చేసే విధంగా కొత్త చట్టం ఉందని అన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణ మాఫీ చేయలేదని అన్నారు. పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని, కేసీఆర్‌ ‌తెలంగాణ రైతు ద్రోహి, పచ్చి అబద్ధాలతో మోసం చేస్తుండని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను అమలు చేయబోమని శాసన సభలో తీర్మానం చేయాలని అన్నారు. కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌, ‌జెట్టి కుసుమ్‌ ‌కుమార్‌, ‌రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభన్‌ ‌మాట్లాడారు. రైతు వ్యతిరేక బిల్లు ను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రైతులను పాలేర్లుగా మార్చడమే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. బడా వ్యాపారులకు దేశాన్ని కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లొనే కేసీఆర్‌ ‌తీసుకొస్తారని అన్నారు. 29 రాష్ట్రాల్లో ప్రజాధనం అధికంగా దోచుకున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ ‌మొదటి స్థానంలో ఉంటారని అన్నారు. మాజీ మంత్రి జే గీతారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌లో నియంత లాగా ఏకపక్షంగా వ్యవసాయ బిల్లును పాస్‌ ‌చేయించారని అన్నారు.ఈ బిల్లు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ హరీష్‌ ‌రావు చెంప చెల్లుమనిపించే విధంగా 10 స్థానాలు దక్కించుకుంటామని అన్నారు. కేసీఆర్‌కు దిమ్మదిరిగే విధంగా చేస్తామని అన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు సురేష్‌ ‌షెట్కార్‌, ‌డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌ ‌రాజ్‌, ‌రాష్ట్ర కార్యదర్శితో పాజి అనంత కిషన్‌, ‌పట్టణ అధ్యక్షుడు జార్జ్, ‌కౌన్సిలర్‌ ‌నాగరాజు, పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply