“దేశ వ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపి తన ప్రాధాన్యతను చాటుకుంది. గుజరాత్లో ఎనిమిది స్థానాలకు ఎనిమిందింటినీ బిజెపి గెలుచుకోగా, ఉత్తర ప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరిగిన ఏడు స్థానాల్లో ఆరు స్థానాలను బిజెపి కైవసం చేసుకోవడం చూస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.”
తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే రానున్న కాలంలో భారతీయ జన తాపార్టీవైపే ప్రజలు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఎన్డిఏ కూటమికి ప్రాతినిధ్యంవహిస్తున్న బిజెపికే మెజార్టీని చేకూర్చినట్లుగానే ఇవ్వాళ బీహార్ ఫలితాలు కూడా అదే అంశాన్ని స్పురణకు తెస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాలను అక్కడ ప్రజలు తిరిగిరాశారు. ఈసారి కూటమిలోని జెడియుకు బదులుగా సరాసరి బిజెపివైపే ప్రజలు నిలబడినట్లు స్పష్టమవుతున్నది. ఇక్కడ కాబోయే సిఎం ఎవరన్న చర్చను పక్కకు పెడితే డెబ్బైకి పైగాస్థానాలను గెలుచుకోవడంద్వారా బిజెపి బీహార్‌లో తన ఆదిపత్యాన్ని చేకూర్చుకుందనే చెప్పవచ్చు. ఆర్జెడి, కాంగ్రెస్ కలిసినా కావల్సిన మ్యాజిక్ సంఖ్యను దాటే పరిస్థితి లేకపోవడం, జెడియు సిఎం అభ్యర్థి నితీష్‌కుమార్ అధిక స్థానాలను సాధించుకోకపోవడం బిజెపికి కలిసివచ్చినట్లైంది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపి తన ప్రాధాన్యతను చాటుకుంది. గుజరాత్లో ఎనిమిది స్థానాలకు ఎనిమిందింటినీ బిజెపి గెలుచుకోగా, ఉత్తర ప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరిగిన ఏడు స్థానాల్లో ఆరు స్థానాలను బిజెపి కైవసం చేసుకోవడం చూస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
పెద్ద నోట్లరద్దు మొదలు, చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితులు, కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎదురైన కష్టనష్టాలకు మోడీ ప్రభుత్వ అసమర్ధపాలనేనంటూ వచ్చిన విమర్శలేవీ బిజెపి విజయాన్ని అడ్డుకోలేకపోయా యన్న విషయాన్ని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సగానికి పైగానే బిజెపి కైవసంచేసుకున్న తీరుకూడా ఇదే అంశాన్ని తెలియజేస్తున్నాయి. మణిపూర్‌లో అయిదింట నాలుగు, కర్ణాటకలో రెండు స్థానాలను గెలుచుకోవడంద్వారా దేశ వ్యాప్తంగా వికాసం జరుగుతుందనడానికి అవకాశమేర్పడుతోంది. ఉప ఎన్నికల ఫలతాలపై ప్రధాని నరేంద్రమోదీ అన్నమాటలు ఇక్కడ గమనార్హం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఆశీర్వదించారని, ఇది చారత్రిక విజయమన్నారు. వివిధ రాష్ట్ర ప్రజలకు బిజెపితో మంచి అనుబంధం ఏర్పడుతున్నదనటంలో భవిష్యత్ అంతా బిజెపిదే అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా, ఇలాంటి ఫలితాలే పదేపదే పునరావృతం అవుతాయని రాష్ట్ర బిజెపి నేతలు కూడా ధీమా వ్యక్తంచేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి విజయాలే సాధిస్తామని ఏపి రాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షుడు కూడా పేర్కొనడం దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి లక్ష్యం వైపుగా అడుగులు వేయడంలో సఫలీకృతం అవుతుందనిపిస్తోంది. తెలంగాణరాష్ట్రంలో త్వరలో జరుగనున్న గ్రెటర్ మున్సిపల్ ఎన్నిక)పై ఇప్పుడు ఆ పార్టీ తమ దృష్టిని, శక్తిని కేంద్రీకరించబోతున్నది.
ఎట్టి పరిస్థితిలో ఈసారి బల్దియా పై కాషాయ జంఢాను ఎగురవేస్తామని బిజెపి నాయకులు నమ్మకంగా చెబుతున్నారు. అదే వరుసలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లోకూడా తమదే విజయమంటున్నారు. ఏమైతేనేమి దుబ్బాక ఉప ఎన్నిక కమల దళంలో నూతనోత్సాహాన్ని నింపింది. ఇంతకాలంగా తెలంగాణలో అధికార తెరాసకు ప్రత్యమ్నాయం తామేనని చెబుతున్న బిజెపి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మూడవస్థానానికి నెట్టడంద్వారా రుజువు ఆ మాటను రుజువు చేసుకోవడమే కాకుండా తెరాసకు చెమటలు పట్టించిందికూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మొదలు కేంద్ర,రాష్ట్ర సంబంధాలపై అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తున్న బజెపి ఇకముందు అదికారపార్టీని శంకరగిరి మాణ్యాలు పట్టించే దిశగా పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. టిఆర్ఎస్ను త్వరలో గద్దె దింపే సమయం ఆసన్నమైందని దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పేర్కొన్నట్లు ఆ పార్టీ ఆ దిశగా అడుగులు వేసేందుకు టిఆర్ఎస్ వ్యతిరేకులందరిని ఏకంచేసే ప్రయత్నంలో ఉంది.

గెస్ట్ ఎడిటర్