Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు..

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులన్న విషయం మరోసారి రుజువైంది. పాలకులు ఎంతటి బలోపేతులైనా ప్రజా ఉద్యమాల ముందు దిగదుడుపే అన్నది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అది కేంద్రం అయినా, రాష్ట్రం అయినా రాజ్యాంగ బద్దమైన తమ హక్కులను కాలరాసే ప్రయత్నం చేసే వారు ఎవరైనా సరే, వారు ఎంతటి ఉద్దండులైన ప్రజాగ్రహం ముందు తలవంచక తప్పదన్నది స్పష్టమవుతున్నది. ఇది కేవలం పాలక పక్షాలకే కాదు, ప్రతి పక్షాలకు కూడా గుణపాఠం అవుతుంది. చట్ట సభల్లో బలమున్నంత మాత్రాన తమ ఇష్టం వచ్చిన విధాన నిర్ణయాలను తీసుకోలేమన్నది దీనివల్ల పాలకులు బోధపడుతుంది. కొద్ది రోజుల వ్యవధిలోనే దేశంలో జరిగిన రెండు పరిణామాలు దేశంలో ప్రజాస్వామ్య మనుగడను చాటేవిగా ఉన్నాయి.

సోమవారం ఏపి శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహనరెడ్డి చేసిన ప్రకటన గత రెండేళ్ళుగా ఆ రాష్ట్రంలోని రైతాంగ చేస్తున్న ఉద్యమ విజయమనే చెప్పాలె. ఏపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి అక్కడ రాష్ట్ర రాజధాని ఏర్పాటు వివాధగ్రస్తంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఏర్పాటుకు సుమారు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించినప్పుడు భూ యజమానులకు ఇచ్చిన హామీలను కాదని, వైఎస్‌ ‌జగన్‌ ‌ముఖ్యమంత్రి హోదాలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన, తర్వాత చట్టసభలో ఆమోదింప చేసుకోవడంతో ప్రారంభమైన ఆందోళనకు ఆ ప్రకటన విరమించుకుంటున్నట్లు సోమవరాం సిఎం జగన్‌ ‌శాసనసభలో ప్రకటించడంతో తెరపడింది. ఈ మధ్యకాలంలో అమరావతి రైతులు అలుపెరుగని పోరాటాలు చేశారు. అనేక మంది అనేక వత్తిడులకు లోనైనారు. అవమానాలపాలైనారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా మొండి పట్టుదలతో నిలవడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. న్యాయస్థానాలు కూడా ప్రజాపోరాటంవైపే ఉండడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పనిసరి అయింది. అయితే శాసనసభలో ప్రభుత్వం చేసిన ప్రకటన ఉద్యమకారులకు సంతృప్తినిచ్చేదిగా లేదు. అనేక ఒత్తిడులు, అనేక ఆటంకాలను దృష్టిలో పెట్టుకుని ఏపి ప్రభుత్వం తాత్కాలికంగానే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లుగా ఉంది. మూడు రాజధానుల నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నది ఆ ప్రకటనలో స్పష్టంగా ధ్వనిస్తోంది. మరింత విస్తారంగా దానిపై చర్చలు జరిపి, ప్రజలకు అనుకూలైన చేర్పులు మార్పులు చేసి, తిరిగి చట్ట సభలో ప్రవేశ పెడుతామని చెప్పిందేగాని, అమరావతే రాజధాని అని స్పష్టంగా ప్రకటించకపోవడం చూస్తుంటే అమరావతి రైతాంగం, అక్కడి ప్రజానీకం మరికొంతకాలం ఉద్యమించక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది.

నరేంద్ర మోదీ ప్రకటనపై కూడా రైతాంగానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కేంద్రం ప్రవేశపెట్టిన వివాద స్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పద్నాలుగు నెలలకు పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు చేసిన ఉద్యమం దేశ చరిత్రలోనే ఒక మహా ఘట్టంగా నిలుస్తుంది. ఎండ, వాన, చలి అనకుండా కుటుంబాలను, తమ వ్యవసాయ క్షేత్రాలను వదిలి దేశ రాజధాని చుట్టూ టెంట్లు వేసుకుని ఉద్యమించిన రైతు పోరాటాలకు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అమరావతి రైతుల కన్నా కాస్త ముందుగా అక్కడి రైతులకు ఉపశమనం లభించింది. ఈ ఉద్యమంలో సుమారు ఏడు వందల యాభై మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత గాని కేంద్రం స్పందించలేదు. అది కూడా వచ్చే శీతాకాల పార్లమెంట్‌ ‌సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియను చేపడుతామని పేర్కొన్న తీరుపైన కూడా ఉద్యమకారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాము చేసిన ఈ మూడు చట్టాలు వాస్తవంగా దేశ వ్యవసాయ రంగాన్ని పురోగమనం వైపుగా తీసుకు వెళ్తాయని, రైతే రాజన్న విషయాన్ని మరోసారి నిరూపించేవిగా ఉన్న ఈ చట్టాల పట్ల ఒక వర్గానికి అవగాహన కల్పించలేక పోయామని, విడమర్చి చెప్పడంలో విఫలమయ్యామేగాని, రైతులు వ్యతిరేకిస్తున్నట్లు వ్యవసాయ రంగానికి వ్యతికే విధానం కాదని చెబుతుండడాన్ని బట్టి మరో రూపంలో ఈ చట్టాలను మరోసారి ప్రవేశపెట్టే ఆలోచన మోదీకి ఉండి ఉండవచ్చన్న అనుమానాలు రైతు ఉద్యమ కారులకు లేకపోలేదు. ఇప్పుడు అమరావతి విషయంలో జగన్‌ ‌చేసిన ప్రకటనకూడా దాదాపుగా అదే విధంగా ఉంది. వికేంద్రీకరణ అన్నది అభివృద్ధికి అత్యంత ఆవశ్యకతమైనదని, విభజన సమయంలో ఆనాటి కమిటీలు కూడా అదే విషయాన్ని చెప్పాయంటూనే, మూడు రాజధానుల విషయంలో ఒకటి, రెండు శాతం వారికి పూర్తిగా వివరించలేకపోయామని, మరోసారి అందరికి దీని ప్రాధాన్యతగురించి చెప్పి, ఒప్పించి మరోసారి చట్టసభలో ప్రవేశపెడతామని పేర్కొనడం చూస్తుంటే ఉద్యమ ఉధృతిని తగ్గించేందుకే అటు కేంద్రం, ఇటు ఏపీ రాష్ట్ర పాలకులు ఒక అడుగు వెనక్కు తగ్గారేగాని తమ మైండ్‌ ‌సెట్‌ ‌మార్చుకోలేదన్నది స్పష్టమవుతున్నది.

Manduva-Ravinder-Rao
– మండువ రవీందర్‌రావు

 

Leave a Reply