Take a fresh look at your lifestyle.

పెన్ను ఒక గన్ను…అక్షరాలు బుల్లెట్లు ఆయనే షోయబ్‌ ఉల్లాఖాన్‌

(‌నేడు శత జయంతి)

ప్రజలకోసంకలం పట్టి ప్రాణాలను తృణప్రాయంగా వదలిన ధీరుడు. తన రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండ వణకించిన అక్షర యోధుడు. తెలంగాణ పాత్రికేయ చరిత్రలో ఆయనది సుస్థిర స్థానం. ప్రతి ‘కలం’కారునికీ ఆయన ప్రయాణం ఆదర్శప్రాయం. క్షణ క్షణం, అనుక్షణం సృజనాత్మకతతో,నిర్భీతితో జీవనం సాగించిన వీరుడాయన. ‘‘మరణం అనివార్యం. చావు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మరణం ఒక లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు మీరు సంతోషించాలి’’ షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‌చివరి మాటలు. లౌకిక విలువలకు కట్టుబడి మతసామరస్యాన్ని ప్రబోధిస్తూ పాత్రికేయ వృత్తిని ఎంచుకున్న ఘనుడాయన. మత దురహంకారానికి వ్యతిరేకి.

ఓ దీర్ఘకాలిక యుద్ధం. ధిక్కారస్వరం, ‘ఇమ్రోజ్‌ ‌నిప్పు కణిక. నిజామ్‌కు వ్యతిరేకంగా నిరసన, ప్రతిఘటన.. భార్య, తల్లి నగలను అమ్మి ‘‘ఇమ్రోజ్‌’’ ‌పత్రికను నెల్కొల్పారు. 1947 నవంబర్‌ 17‌న మొదటి సంచిక వెలువడింది. నిప్పు కణికల్లాంటి అక్షరాలతో నిజాం వెన్నులో వణకు పుట్టించారు ఆ కలం వీరుడు. ఆయనే షోయబ్‌ ఉల్లాఖాన్‌. ఆయన పెన్ను గన్నయింది. అక్షరాలుబుల్లెట్లుగా మారి నాటి నిరంకుశ ప్రభుత్వం గుండెల్లోకి దూసుకెళ్లాయి. అధికారం అక్షరంపైకక్షకట్టింది. చెరిపివేసింది.

వీరి కుటుంబం ఉద్యోగార్ధం ఉత్తరప్రదేశ్‌ ‌నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. 1920, అక్టోబరు 17న ఖమ్మంజిల్లా బూర్గుంపాడు ప్రాంతంలో సుబ్లేడు గ్రామంలో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్‌. ‌నిజాం ప్రభుత్వంలో అధికారి. తల్లి లాయకున్నిసా బేగం. వారికి ఆయన ఏకైక సంతానం. షోయబ్‌ ‌భార్య అజ్మలున్నిసాబేగం. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఫరీదాఖాన్‌. ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్‌ ‌చేశారు. ఆ కాలంలో గ్రాడ్యుయేషన్‌ ‌చేస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాళ్ల దగ్గరికి వచ్చేవి. కానీ షోయబ్‌ ఉల్లాఖాన్‌ ఆ ఉద్యోగాల జోలికి పోలేదు. అది తెలంగాణ అగ్నిగోళంగా ఉన్న సమయం.
ఆ సమయంలో షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‌కి అక్షరమే ఆయుధంగా కనిపించింది. అందుకే జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. తేజ్‌ ఉర్దూ వారపత్రికలో ఉద్యోగం. నిత్యం రాజాకార్లూ, భూస్వాముల ఆగడాలపై వ్యాసాలు రాశారు. నిజాం ప్రభుత్వ అరాచకాలపై పెన్ను ఎక్కుపెట్టారు. దీంతో తేజ్‌ను నిషేధించింది నిజాం ప్రభుత్వం. తరువాత రాష్ట్ర మాజీ మంత్రి మందముల నరసింగరావు నడుపుతున్న ‘రయ్యత్‌’ ఉర్దూ పత్రికలో ఉపసంపాదకునిగా బాధ్యతలు నిర్వహించారు.

రయ్యత్‌ ‌పత్రికలో పనిచేస్తానని వచ్చిన రోజే ఆ పత్రికా సంపాదకుడు ముందుముల నర్సింగరావు షోయబ్‌ను నిరుత్సాహపరిచారు. ‘ఇక్కడ మా పత్రికలో ఇచ్చే వేతనం చాలా తక్కువ. మేమిచ్చే 50 రూపాయల వేతనంలో మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి, కనుక ముస్లిం అయిన మీకు ప్రభుత్వంలో మంచి జీతంతో హోదాగల నౌకరీ దొరుకుతుంది ప్రయత్నించండి’అన్నారు. ‘రయ్యత్‌’ ‌భిన్న భావాలు గల పత్రిక. మా పాలసీతో ఏకీభవించి మీరు పనిచేయలేరేమో!’ అన్నారు. ‘రయ్యత్‌’‌లో పనిచేసినంత కాలం పత్రిక భావాలకు భిన్నంగా సొంత భావాలు ప్రకటించనని షోయబ్‌ ‘‌రయ్యత్‌’ ‌లో చేరిపోయారు. అందులో చేరిన అనతి కాలంలోనే అతని ప్రతిభావిశేషాలు వెల్లడయ్యాయి. ఆయన పని పెరిగింది. వేతనమూ పెరిగింది. ఉద్యోగిగా కాకుండా ‘రయ్యత్‌’‌లో కుటుంబ సభ్యుడయ్యారు.

రయ్యత్‌ ‌పత్రిక కూడా నిజాం ఆగ్రహానికి గురై మూతబడింది. అయినా షోయబ్‌ అధైర్యపడలేదు. భార్యను, తల్లిని ఒప్పించి వారి ఆభరణాలు అమ్మేశారు. నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో, ఆ వచ్చిన డబ్బుతో జాతీయ భావాలు ప్రేరేపించగల ‘ఇమ్రోజ్‌’ ఉర్దూ దినపత్రికను 1947, నవంబరు 1న ప్రారంభించారు. ‘‘పెన్నులపై మన్నుగప్పితే గన్నులై మొలకెత్తుతై. ఆ గన్నే ఇమ్రోజ్‌’’. ఎం‌తో శ్రమించి పత్రికను ప్రజల పత్రికగా తీర్చిదిద్దారు. నిజాం నిరంకుశ, దురహంకారం మీద అక్షరాయుధంతో తిరుగులేని సమరం సాగించారు. 1948, జనవరి 29 ఇమ్రోజ్‌ ‌సంచికలో ‘పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం’ అనే వ్యాసం రాశారు. బూర్గుల రామకృష్ణారావు నుంచి కామ్రేడ్స్ అసోసియేషన్‌ ‌నాయకుడు ప్రొఫెసర్‌ ‌ఖుంద్‌మేరి ఆలం వరకూ పలువురితో ఆయనకు సంబంధాలుండేవి. 1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమవుతున్నాయి కానీ సంస్థానాన్ని భారత్‌లో కలపరాదని, స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని 1947, జూన్‌లోనే ఐక్యరాజ్యసమితిలో నిజాం పిటిషన్‌ ‌వేశాడు.

సంస్థానం భారతదేశంలో విలీనం కావాలన్న ప్రజల కోర్కెను కుట్రగా’ ప్రచారం చేశాడు. ఒకవైపు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చారిత్రక తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతున్నది. భూస్వామ్య వ్యవస్థ పునాదులను కుదిపి వేస్తున్న కాలమది. వేరొక వైపు కాంగ్రెస్‌ ‌సోషలిస్టులు, ఆర్యసమాజ్‌ ‌పలురకాల సత్యాగ్రహాలకు పూనుకున్నారు. ఆ సమాచారం మొత్తాన్ని ఇమ్రోజ్‌ ‌పత్రికలో షోయబ్‌ ‌ప్రచురించారు. విద్యావంతులు, మేధావులను ఎంతో ఉత్తేజపరిచింది.1948, ఆగస్టు 19న హైదరాబాదు ‘జమురుద్‌ ‌హాలు’లో రజాకార్ల నాయకుడు ఖాశిం రజ్వీ ప్రసంగిస్తూ ‘ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు ఉండటానికి వీలులేదని ప్రకటించాడు.

1948, ఆగస్టు 21 అర్ధరాత్రి. షోయబ్‌ ‌కాచిగూడా రైల్వేస్టేషన్‌ ‌రోడ్‌లోని ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లో పనులు పూర్తిచేసుకుని లింగంపల్లిలో సమీపాన ఉన్న తన ఇంటికి కాలినడకన వస్తుండగా రజాకార్ల గుంపు ఆయనపై ఆకస్మికంగా దాడి చేసింది. ఆయనపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. తల్వార్లతో ఆయన రెండు చేతులూ నరికేసింది. రక్తం మడుగులో పడికొట్టుకుంటున్న షోయబ్‌ను ఆ ప్రాంత ప్రజలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో 1948, ఆగస్టు 22 తెల్లవారు జామున ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారు. కలం యోధునికి నివాళులర్పించేందుకు ప్రజలను పాలకులు అనుమతించలేదు. కొద్దిమంది స్నేహితులు, బంధువులనే అనుమతించారు. గట్టి పోలీసు పహారా మధ్య గోషామహల్‌ ‌మాలకుంట వద్ద గల శ్మశానవాటికలో షోయబ్‌ ‌మృతదేహాన్ని ఖననం చేశారు. వారి కుటుంబం ఉత్తరప్రదేశ్‌కు తరలివెళ్ళింది.
– నందిరాజు రాధాకృష్ణ,
సీనియర్‌ ‌పాత్రికేయుడు, 98481 28215

Leave a Reply