Take a fresh look at your lifestyle.

పుష్టి భక్తిమార్గం

bhakthi

భారతదేశంలో శ్రీమద్‌ ‌రామాను జాచార్యులవారు, శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులవారు, శ్రీమద్‌ ‌మద్వాచార్యులవారు, శ్రీ మద్వల్లభాచార్యులవారు తమ తమ సిద్ధాంతాలతో సనాతన వైదిక ధర్మాన్ని ఉద్ధరించారు. వీరందరూ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను వారి సిద్ధాంతాలకు ప్రమాణాలుగా స్వీకరించారు. అయితే వల్లభాచార్యులవారు ప్రస్థాన త్రయంతోపాటు భాగవతాన్ని భక్తి శాస్త్రమని నిరూపిస్తూ ప్రమాన గ్రంధంగా స్వీకరించారు. తత్త్వజ్ఞానాన్ని తెల్సుకునే సాధనలో ఉపనిషత్తులలో తెలియబడని కొన్ని సందేహాలకు సమాధానం భగవద్గీతలోనూ, భగవద్గీతలో తెలియబడని అంశాలకు బ్రహ్మసూత్రాలలోనూ, బ్రహ్మసూత్రాలలో కూడా తేటతెల్లం కాని మరికొన్ని సందేహాలకు భాగవతంలో వివరింప బడుతుం దన్నారు. వీటన్నింటిలోనూ చెప్పబడిన భగవానుడు, పురాణాల్లో చెప్పబడిన భగవానుడు ఒక్కడే అని, ఆయనే శ్రీ కృష్ణుడని చెప్పారు.సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మం వ్యాపకుడు, అధికారి, సర్వశక్తిమంతుడు, స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, గుణరహిత సజాతీయ విజాతీయ స్వగతభేద విముక్తుడు. ఉత్పత్తి జరిగినపుడు సత్యాది స్వాభావిక సహస్ర గుణాలు కలవాడు. సృష్టికి పూర్వం, ప్రళయం తర్వాత బ్రహ్మం నిర్గుణ, నిరాకార లక్షణాలు కలవాడు. సృష్టికాలంలో నిర్గుణ నిరాకార లక్షణాలతోనే గాక జగత్తు రూపం కలిగిన సగుణ సాకారునిగా ప్రకటనమై భాసిస్తాడు.

భగవానుని సంకల్పం మేరకు, భగవానుని మహత్మ్య జ్ఞానం, భగవద్భక్తి జీవులలో ప్రవర్తింపజేయడానికి భగవానుని ఆజ్ఞ శిరసావహించి, అగ్నిదేవుని అంశావతారంగా శ్రీ వల్లభాచార్యుల వారు అవతరించారు. శ్రీ మద్వల్లభాచార్య మహాప్రభువులు కృష్ణయజుర్వేద తెత్తిలీయ శాఖా సంప్రదాయులైన ఒక తెలుగు వెలనాటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. వీరి తండ్రి లక్ష్మణభట్టు, తల్లి ఐలమ్మ. వారి స్వగ్రామం కృష్ణానదీ తీరంలో వున్న కాకరపాడు.లక్ష్మణభట్టు కాశీకి వెళ్ళి అక్కడే నివసించారు. ఒకసారి పరాయిరాజుల దాడుల భయంతో వారు సకుటుంబంగా కాశీ విడిచిపెట్టి తమ స్వస్థలానికి తిరిగి వెళ్తూవుండగా, దారిలో చంపారణ్యమనే అడవిలో ఐలమ్మ ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టుకతోనే చలనం లేకుండా పుట్టాడు.ప్రాణాలు లేని శిశువు అనుకుని, అతనిని ఒక గుడ్డలో చుట్టి, ఒక జమ్మిచెట్టు తొర్రలో పెట్టి తమ ప్రయాణాన్ని ముందుకు సాగించారు. ఆ రాత్రి భగవాన్‌, ఐలమ్మ కలలో కనిపించి, శిశువు బ్రతికి వున్నాడనీ చెప్పగా వెంటనేవారు తిరిగి వెళ్ళి చూశారు. అక్కడ మంటలు రేగుతున్నాయి. ఆ మంటల మధ్య ఆ శిశువు జీవించే వున్నాడు. ఆయనే వల్లభాచార్యులవారు. ఆయన అగ్నిదేవుని ఆశావతారం అవడం చేత, వారికి అగ్నిచే ఆ రక్షణ కలిగిందని నమ్ముతారు. ముసల్మానులు కాశీపై దండయాత్ర చేయకుండా తిరిగి వెనుకకు పోయారని తెలియగానే లక్ష్మణభట్టు కాశీకి తిరిగి వెళ్ళాడు. అక్కడే నివసించారు. చిన్న తనం నుండీ వల్లభాచార్యులవారు విద్యాభ్యాసంనందే నిమగ్నులై వుండేవారు.

వారు సంస్క•త భాష నేర్చుకుని వేదాలు, వేదాంశాలూ, ఉపనిషత్తులు, షణ్మత సిద్ధాంతాలు, శ్రీమద్భాగవతాన్ని అభ్యసించి పాండిత్యం సంపాదించారు. ఆచార్యులవారు పదకొండవ ఏట చదువు పూర్తి చేసుకుని, దేశంలోని  దివ్యక్షేత్రాలను సందర్శించారు. యాత్రలలో వివధ మతానుయాయులైన పండితులతో వేదాంత చర్చలు జరిపేవారు. వారు యాత్రలో వుండగానే వారి తండ్రి లక్ష్మణభట్టు పరమపదించారు. అయినా వారు తీర్థయాత్రను కొనసాగించారు. ఒకసారి జగన్నాథపురి(పూరీ) రాజుగారి సభలో జరిగిన పండిత చర్చలలో అద్వైత సిద్ధాంతులు మద్వల్లభాచార్యులవారి సిద్ధాంతాలను అంగీకరించలేదు. అప్పుడు రాజుగారు వేసిన నాలుగు ప్రశ్నలకు ఆచార్యుల వారిచ్చిన జవాబులనూ పండితుల జవాబులనూ ఆనాటి రాత్రి జగన్నాథస్వామి వారి ఎదుట పెట్టారు. మరునాడు ప్రొద్దున్నే ఆలయం తలుపులు తీసి చూడగా వల్లభాచార్యులవారి జవాబులను స్వామి అంగీక రించినట్లుగా తాళపత్రంపై వ్రాయబడివుంది. పండితు లందరూ భగవంతుని ఈ ఆదేశాన్ని శిరసావహి ంచారు.అదే వారి శుద్ధాద్వైత సిద్ధాంతానికి మొదటి విజయం. ఆ తర్వాత ఎన్నో చోట్ల పండితులు వారి సిద్ధాంతాన్ని ఆదరించారు. ఓర్చా రాజుగారు వీరిని గౌరవిస్తూ కనకాభిషేకం చేశారు. విజయనగరంలో వారి సిద్ధాంతాన్ని గౌరవించి రాజుగారు ‘అఖండ భూమండలాచార్య’ అన్న బిరుదునిచ్చారు. యాత్రలు చేస్తూ పండరీపురంలో వుండగా విఠలుడే ఆచార్యులను వివాహం చేసుకోమని, తాను కొడుకునై పుడతానని ఆదేశించారు. తర్వాత వారి బదరీ యాత్రలో వ్యాసమునికి సందర్శించారు.

వ్యాసులవారు వివాహం చేసుకోమని ఆదేశించారు.కాశీ వచ్చాక మహాలక్ష్మిని ఆచార్యులవారు వివాహం చేసుకున్నారు. వారికి గోపీనాథులు, విఠలనాథులు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వీరిద్దరు మహాపండితులు. విఠల్‌నాథుడు శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని, పుష్టిభక్తి మార్గాన్ని గుజరాత్‌, ‌రాజస్థాన్‌ ‌ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అనేక గ్రంథాలు వ్రాసారు. ఈ జగత్తులో జరిగే కార్యాలన్నీ భగవానుని లీలలే.కొన్ని భగవానుని ఆజ్ఞ మేరుకు మాయ చేసే పనులు. ఇవి కూడా భగవల్లీలల రూపంలో ఉంటాయి. మాయబడని కార్యాలు భగవానుడే స్వయంగా చేస్తాడు. ఉదాహరణగా అవతార కార్యాలు అనగా అవతారలీలలు. భగవత్సాన్నిధ్యమునకు భక్తి సులభమార్గం. ఆచార్యులవారు జీవులు మూడు విధాలుగా వుంటారని చెప్పారు.వారు ‘ప్రవాహ’, ‘మర్యాదా’, మరియు ‘పుష్టి’ మార్గాలననుసరించే జీవులని, ఆచార్యులు పేరొన్నారు. ప్రవామమార్గజీవులు సంసార ప్రవాహంలో చిక్కుకొన్నవారు. ఏవైనా కష్టాలువస్తే వారు భగవానుని పూజిస్తారు. తర్వాత సాంసారిక విషయాలలో కాలం గడుపుతారు. ‘మార్యాదా’ మార్గజీవులు, శాస్త్ర విహిత కర్మలు చేయుటలోను, శాస్త్రాలలో చెప్పబడ్డ జ్ఞానం సంపాదించుటలోనూ ప్రవృత్తులై వుంటారు. పుష్టిమార్గ జీవులు మాత్రం భగవద్‌ అనుగ్రహం పొందినవారు. వారు భగవానుని మహాత్మ్య జ్ఞానం కలిగి భక్తియే తమ ముఖ్యమైన మార్గమని భావించి ప్రేమతో కూడిన భగవత్సేవ చేస్తూ వుంటారు. భగవంతుని సన్నిధికి భక్తి ఒక్కటే మార్గమని అందువలన కలిగే ఆనందానికి సులభమార్గం ఆచార్యులవారు చెప్పారు. పుష్టి భక్తి మాత్రమే భగవత్ప్రాప్తికి సాధనరూపం అన్నారు.పుష్టి మార్గాన్ని ఆచరిద్దామనుకునే వారు ముందుగా దీక్ష తీసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడే తనకు సర్వం అని భావించాలి. ఆయననే సేవించాలి.శ్రీ మద్వల్ల భాచార్యులవారు త్రివిధ నామావళి అనే గ్రంధాన్నీ, షోడశగ్రంధాలనూ, పలు స్తోత్రాలనూ రచించారు. మధరాష్టకము, శ్రీ పురుషోత్తమ నామ సహస్రం, త్రివిధ నామావళి, కృష్ణాష్టకం, పరివృధాష్టకము, శ్రీ గోపీజనవల్లభాష్టకం గాక అనేక స్వతంత్ర గ్రంధాలు రచించారు. పలు భాష్యాలు అందించారు. శ్రీ కృష్ణ భక్తులలో ఉత్క•ష్టులై చైతన్య మహా ప్రభవు వీరి స్నేహితులు. వీరికి సమకాలికులు సూరదాసు, పరానాందదాసు, కుంభనదాసు, కృష్ణదాసు.
డా।। పులివర్తి కృష్ణమూర్తి.

Leave a Reply