శాంతి భద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించే విధంగా ప్రత్యేక శిక్షణ పొందిన 37 పోలీస్ జాగిలాల ( వీటిని పోలీస్ భాషలో కెనెన్ అని పిలుస్తారు) పాసింగ్ అవుట్ పరేడ్ రేపు శుక్రవారం జరుగనుంది. మొయినాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీ లో జరిగే పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ కు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ముఖ్య అతిధిలుగా హాజరవుతారు. మొయినాబాద్ శిక్షణా కేంద్రం లో ఈ 37 జాగిలాలకు ఎనిమిది నెలల పాటు 53 మంది హాండ్లర్స్ (శిక్షకులు) ప్రత్యేక శిక్షణ ను ఇచ్చారు. ఈ 37 జాగిలాలలో ప్రధానంగా లెబ్రడాల్, జర్మన్ షెప్పర్డ్, బెల్జియం మాలినోస్, కోకోర్ స్పైనల్, గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందినవి వున్నాయి.
జాగిలాల శిక్షణలో జాతీయ స్థాయిలో పేరుగాంచిన మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో బీహార్ రాష్ట్రానికి చెందిన 20 జాగిలాలకు అక్రమ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ అందచేశారు. బీహార్లో అధికంగా వున్నా అక్రమ మద్యం తయారీ, వాటి నిల్వలను గుర్తించే విధంగా అక్కడి 20 కుక్కలకు మనదగ్గర ప్రత్యేక శిక్షణ నిచ్చారు. ఈ శిక్షణ పొందిన బీహార్ శునకాలు అక్రమంగా నిల్వ చేసిన మద్యం గుర్తింపు, అక్రమద్యం తయారీ కేంద్రాలను విజయవంతంగా గుర్తిస్తున్నాయని బీహార్ పోలీస్ శాఖ తెలిపింది.