Take a fresh look at your lifestyle.

కొరోనా కేసులు పెరిగితే పార్టీలదే బాధ్యత

దేశంలో మళ్ళీ కొరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్రలలో కొరోనా కేసులు బాగా పెరుగుతుండటంతో అధికారులు రాత్రివేళ కర్ఫ్యూ విధించే యోచనలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇప్పటికే రాత్రివేళ కర్ఫ్యూ అమలులో ఉంది. పూణేలో సోమవారం ఒక్కరోజే 1,176 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కేరళ, కర్నాటక సరిహద్దులపై నిఘా పెంచింది. ఆంధప్రదేశ్‌లో కొత్తగా 160 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్త వేరియంట్‌ ‌వైరస్‌ ‌వ్యాపించినట్టు సమాచారం అందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవాలతో పాటు ఎన్నికల హడావుడి పెరగడం వల్ల కొరోనా విజంభణ ప్రారంభమైందని చెబుతున్నారు. మాస్క్ ‌ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను తీసుకోవడం మానేశారు.

ఇప్పుడు గతంలో మాదిరిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కొరోనా తిరిగి వ్యాపించడానికి ఇవే కారణాలని అధికారులు తెలుపుతున్నారు. కొత్త వేరియంట్‌ ‌వైరస్‌లు కనిపించకుండా వ్యాపిస్తాయనీ, వాటి గురించి జనానికి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోముంబాయి సహా ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. అయితే, దేశ వాణిజ్య రాజధాని కావడం వల్ల జాగ్రత్తలు ఎవరూ పాటించడం లేదు. అలాగే, హైదరాబాద్‌లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ ‌సందడి కారణంగా సామూహికంగా కలిసి తిరగడం, ఊరేగింపుగా కదలి వెళ్లడం వల్ల కూడా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతోందని తెలుస్తుంది.

ఆంధప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలు కలివిడిగా తిరిగారు. ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో రోడ్ల మీదకు వొచ్చి కేరింతలు కొట్టారు. సంబురాలు జరుపుకున్నారు. వీటన్నింటి కారణంగా జనం జాగ్రత్తలు మరిచారు. తమిళనాడు, కేరళ, కర్నాటకలలో కూడా ఇదే మాదిరిగా సామాజిక దూరం పాటించడం సక్రమంగా సాగడం లేదు. అంతేకాకుండా మాస్క్‌ల ధారణను తేలిగ్గా తీసుకోవడం వల్ల కూడా జనంలో ఈ వైరస్‌ ‌వ్యాపిస్తోందని చెబుతున్నారు. మరో వంక వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో పురోగతి ఉన్నా, రెండో సారి వ్యాక్సినేషన్‌ ‌చేయించుకునేందుకు జనం ఆసక్తి చూపక పోవడం ఈ కార్యక్రమానికి అవరోధంగా ఉందని చెబుతున్నారు. ప్రజల్లో చైతన్యం వొచ్చినప్పటికీ దైనందిన కార్యకలాపాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

బెంగాల్లో ర్యాలీలు జోరుగా సాగుతున్నాయి. అక్కడ అధికార పార్టీ బీజేపీయే ఎక్కువగా ర్యాలీలను నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. కొరోనా గురించి జాగ్రత్తలు చెబుతూనే ఆయన సమూహాలను చేరదీసే కార్యక్రమాల్లో పాల్గొనడం విచిత్రం. అంతేకాకుండా అన్ని చోట్లా అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తల పాటించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దాంతో ప్రజలు కూడా దీని పట్ల ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. మరో వంక ధరల పెరుగుదల వల్ల,ఉపాధి అవకాశాలు లభించక ప్రజలు పొట్టగడవడం కష్టం కావడం వల్ల తప్పని సరిపరిస్థితుల్లో పనుల్లోకి వెళ్తున్నారు. మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం ఒక వంక జాగ్రత్తలు సూచిస్తూనే, సామాన్యుల దైనందిన జీవితాన్ని దుర్భరం చేయడం వల్ల ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొరోనా వల్ల అమెరికాలో మళ్ళీ మరణాల సంఖ్య బాగా పెరుగుతున్నట్టు సమాచారం. ఇతర దేశాల సంగతి అలా ఉంచి మన దేశంలో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం అందరికీ అమలు జరగడం లేదన్న ఫిర్యాదులు వొస్తున్నాయి.

వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లో లభ్యమయ్యేట్టు చేయాలన్న ప్రతిపాదనలు కూడా వొచ్చాయి. అయితే వ్యాక్సిన్‌ ‌ధర ఎంత అనేది తేలలేదు. రాష్ట్రాల వారీగా కొరోనా వ్యాక్సిన్‌ ‌కార్యక్రమానికి టైమ్‌ ‌టేబిల్‌ ‌నిర్ధారించినప్పటికీ అది సక్రమంగా అమలు జరగడం లేదు. మొత్తం మీద కొరోనా వ్యాక్సిన్‌ ‌పంపిణీ, వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాల మధ్య సమన్వయం లేదని మరోసారి రుజువు అవుతోంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా సాగిస్తున్నదేమోనన్న అనుమానాలు బయలుదేరాయి. రాజకీయ లబ్ధి కోసం జనాన్ని వాడుకోవాలన్న కాంక్ష అన్ని పార్టీల్లో పెరిగింది. దాంతో సమూహాలు పెరుగుతున్నా ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. కొరోనా మరో సారి విజృంభిస్తే అందుకు రాజకీయ పార్టీలదే బాధ్యత అవుతుంది.

Leave a Reply