- అప్పుల్లో కూరుకు పోయిన తెలంగాణ రాష్ట్రం
- సిఎం కెసిఆర్ తీరుపై మండిపడ్డ కిషన్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి5: పంచాయతీలకు కేటాయించిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం గంటలోనే పక్కదారి మళ్లించిందని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. పంచాయితీలను బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ నేరుగా నిధులు జమచేస్తే వాటిని తస్కరించిన తీరు దారుణమన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉండదన్నారు. సర్పంచ్ల ఆందోళనలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుని పోయిందని మండిపడ్డారు. గురువారం నాడిక్కడ డియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొండి వైఖరి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. రోడ్ల మరమ్మతులు చేసేందుకు నిధులు లేకపోవడంతో భూములు అమ్మేందుకు సిద్ధమైతున్నారని మండిపడ్డారు.
ఎస్సీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ విషయంపై నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్టాల్ల్రో కంటే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లీటర్ పెట్రోల్ కు అదనంగా రూ.13 రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. పెట్రోల్ ధరలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు. డీజిల్ పై 22 శాతం వ్యాట్ ఉంటే తెలంగాణలో 27కు పెంచారని ఆరోపించారు. ఆయిల్ కంపెనీలు నష్టాలు వచ్చినా ధరలు పెంచలేద న్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెట్రో ఉత్పత్తులు పెరిగినా సామాన్యులపై భారం వేయ కుండా ప్రధాని మోడీ పటిష్ట చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇకపోతే తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టీమ్‌తోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. ఎన్నికలు వస్తే బీజేపీకి ప్రజలే అభ్యర్థులను ఇస్తారని అన్నారు.
తమకు నాయకత్వ సమస్య లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబానికి చెందినవారి పేర్లు బయట పడ్డాయని… దీనితో కేంద్రానికి ఏం సంబంధం?, ప్రధానిపై విమర్శలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయమని తాము ఆహ్వానించలేదని తెలిపారు. కవిత అరెస్ట్‌ను సీబీఐ చూసుకుంటుందని కేంద్రమంత్రి అన్నారు.