Take a fresh look at your lifestyle.

ఎదురు తిరిగిన గతం – వర్తమానం ఒక విలయం

సిరిసంపదలు కొలువైనా, సకల దరిద్రాలు దరిచేరినా,మేడల్లో దాగున్నా, పూరిగుడిసెల్లో నివసించినా మృత్యువు దరిచేరదా?వెంటాడి కబళించదా?అమావాస్య చీకటిని అరచేతితో ఆపగలమా?మృత్యువిహంగాన్ని ముంజేతితో నిలువరించగలమా?కనుసైగలతో శాసించగలమా? కంటికి కనురెప్పలు కాపలా,మనిషికి మనిషి ఆసరా.ఐదు వ్రేళ్ళు కలిస్తేనే పిడికిలి.అదే సమిష్ఠితత్వానికి స్ఫూర్తి.రెండు చేతులు కలిస్తేనే శబ్ధం.ఒంటి చేత్తో సాధించేది శూన్యం.మానవతత్వంలో సమిష్ఠితత్వం నశించింది. మానవత్వం కృశించింది.అన్నింటికీ తిలోదకాలిచ్చేశాం… స్వార్ధానికి విలువిచ్చాం…కాసులకు దాసోహమై మానవత్వాన్నే మసి చేసాం…మనిషి ని మనిషే నంజుకు తినే అమానవీయం విలయతాండవ మాడింది.ఎవరికి వారే యమునా తీరే….లోకం తీరే వేరే దారై,కలకాలం బ్రతకని లోకంలో మానవ తీరు విచిత్ర విన్యాసమై వికటించింది.

మనుషులంతా వేరయ్యారు. మనసులన్నీ కలుషితమైనాయి. నీరు లేని నారు పెరుగునా?వేరు లేని మొక్క జీవించునా?ప్రకృతి లేని ప్రాణం నిలబడునా? ప్రకృతిని చెరబడితే ప్రళయమే…మానవ విలయమే.చర్యకు ప్రతిచర్య ప్రారంభమైనది. ప్రకృతి పగబట్టింది.సూక్ష్మ జీవులన్నీ స్వైర విహారం చేస్తున్నాయి.చిరుచీమలు కలిసి విషసర్పాన్ని హతమర్చవా?మత్తగజాన్ని గడ్డి పోచలు ఒక్కటై బంధించవా!! మడుగులోనే మొసలికి బలం నీటిలోనే మత్స్యానికి జీవం.

ప్రకృతిలో మమేకమైతేనే జీవితం.ఎదురీదితే మరణం! హద్దులు దాటి,సరిహద్దులు చెరిపి చెలరేగితే సర్వం వినాశనం!!బలవంతులమని విర్రవీగిన మానవజాతి కంటికి కనిపించని క్రిమికి ఆహారమౌతుంటే,మత్తగజం లాంటి నరజాతిని గడ్డి పోచలు బంధిస్తే,దోమ గొంతులో దూరి మత్తగజము మృత్యు తీరానికి పయనిస్తే అదో వింత…కవుల కమనానిని కథావస్తువు.కల్పన నిజమై,కవుల వర్ణన నడుస్తున్న చరిత్రకు అద్దం పడితే ఏడ్వలేక,నవ్వలేక నిస్తేజమైన జగతి వర్తమానాన్ని చూసి, వగచి వగచి ఏడుస్తుంటే… మానవ తప్పిదాలు మహమ్మారులై మరుభూమికి దారులు చూపిస్తే, బలవంతులమని విర్రవీగిన మానవులంతా, ప్రకృతిని వంచించి,ఇతర జీవాలను హింసిస్తే,పాపం పండి, మృత్యుకూపంలోకి నెట్టబడుతున్న కాలం దాపురించింది.కాలానికి ఎదురీది,కరోనా కాలాగ్నిలో శలభమై,కాటికి పయనిస్తున్న మానవుల దుస్థితి స్వయం కృతాపరాధం…మానవ ఘోరాలకు చెల్లిస్తున్న మూల్యం.

పశువుల మూతులకు ముట్లు కట్టాం…మాస్కుల రూపంలో మన మూతులు బిగించాం.బందెల దొడ్లో మూగ జీవాలను బంధించాం…ఇప్పుడు మనమే బందీలమై బ్రతుకుతున్నాం.మూగజీవాలను హింసించాం.ఫలితాన్ని మోస్తున్నాం.కాళ్ళకు తాళ్ళు కట్టి రోడ్ల వెంట మూగ జీవులను లాక్కుపోయాం.అవతలికి విసిరేసాం.గతం తిరగబడింది. వర్తమానం వెక్కిరిస్తున్నది. శ్మశానాలు కరువై, మానవ మృతదేహాలు విసిరి అవతల పారేస్తున్న నేటి వినాశనం మానవ పాపాలకు మహాశాపాలు.
– సుంకవల్లి సత్తిరాజు. (సామాజిక విశ్లేషకులు)
9704903463.

Leave a Reply