Take a fresh look at your lifestyle.

పర్యావరణ వ్యవస్థ పునరుద్దరణే ఏకైక మార్గం..!

“నేల నాణ్యత క్షీణతతో ఆహార ఉత్పత్తులు ప్రభావితం కావడం, ఆహార కొరత ఏర్పడడం, పేదరికం పెరగడం జరుగుతున్నాయి. అడవుల నరికి వేతతో మనిషికి మరియు వన్య ప్రాణులకు మధ్య సంఘర్షణ జరిగి, జీవ వైవిధ్యం విచ్ఛిన్నం అవుతూ పులులు, ఏనుగులు, ఎలుగుబంటులు లాంటి వన్యప్రాణులు కూడా ఆవాస ప్రాంతాలకు చేరి ప్రాణ భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ దినం-2021 నినాదంగా ‘సముద్రాలు మరియు ఖండాల్లో పర్యావరణ వ్యవస్థ విచ్ఛిన్నాన్ని నిరోధించడం మరియు నియంత్రించడం, జీవావరణ వ్యవస్థను పునరుద్దరించడం’ అనబడే అంశాన్ని తీసుకొన ప్రచారం చేయడం జరుగుతున్నది. పర్యావరణ విచ్ఛిన్నానికి మరియు పేదరికానికి, అనారోగ్యానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుందని గమనించాలి.”

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

భూగోళంపై విస్తరించబడిన పర్యావరణ వ్యవస్థ సకల జీవకోటికి రక్షక కవచంగా ఉంటూ ఆరోగ్య ప్రదాతగా నిలబడి ప్రకృతి సహజత్వాన్ని కాపాడుతూ ఉంటుంది. సహజ ప్రకృతికి అంతరాయం కలిగిస్తే, జీవ వైవిధ్యానికి విఘాతం ఏర్పడి కరోనా లాంటి హమ్మారి భూతాలు పుట్టుకొస్తాయి. విచ్ఛిన్నతకు లోనైన పర్యావరణాన్ని నేటి నుంచి 2050 వరకు పునరుద్ధరించడానికి 8.1 ట్రిలియన్‌ ‌డాలర్లు అవసరమని, ఏడాదికి కనీసం 536 బిలియన్‌ ‌డాలర్లు కేటాయించాల్సి ఉంటుందని ఐరాస అంచనా వేసింది. పర్యావరణ ప్రకోపాన్ని మరియు జీవవైవిధ్య విచ్ఛిన్న దుష్ఫలితాలను నేటి విశ్వమానవాళి ప్రకృతి వైపరీత్యాలు మరియు మహమ్మారి విపత్తుల రూపంలో అనుభవిస్తున్నది. పర్యావరణంలోని శిలావరణం, జీవావరణం, జలావరణం మరియు వాతావరణాలను మనిషి దుర్వినియోగం చేయడం, విచక్షణారహితంగా విధ్వంసం చేయడంతో గాలి, నేల, నీరు కలుషితమై సకల ప్రాణకోటి మనుగడను ప్రమాదంలోకి నెట్టుతున్నది. తక్షణమే తన తప్పును తెలుసుకొని పర్యావరణ విధ్వంసానికి చరమగీతం పాడుతూ, కోల్పోయిన ప్రకృతి సహజత్వానికి జీవం పోయని యెడల రాబోయే రోజుల్లో మానవాళి జీవనయానం అసాధ్యమనుతుందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ యజ్ఞాన్ని చేపట్టి, గత ప్రకృతి సహజ వైభవాన్ని పునరుద్దరించాలనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఇవ్వడానికి ఒక మంచి వేదికగా 1974 నుంచి ప్రతి ఏటా 05 జూన్‌ ‌రోజున ‘ప్రపంచ పర్యావరణ దినం’ పాటించాలని ఐరాస తీర్మాణించింది. నేల నాణ్యత క్షీణతతో ఆహార ఉత్పత్తులు ప్రభావితం కావడం, ఆహార కొరత ఏర్పడడం, పేదరికం పెరగడం జరుగుతున్నాయి. అడవుల నరికి వేతతో మనిషికి మరియు వన్య ప్రాణులకు మధ్య సంఘర్షణ జరిగి, జీవ వైవిధ్యం విచ్ఛిన్నం అవుతూ పులులు, ఏనుగులు, ఎలుగుబంటులు లాంటి వన్యప్రాణులు కూడా ఆవాస ప్రాంతాలకు చేరి ప్రాణ భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ దినం-2021 నినాదంగా ‘సముద్రాలు మరియు ఖండాల్లో పర్యావరణ వ్యవస్థ విచ్ఛిన్నాన్ని నిరోధించడం మరియు నియంత్రించడం, జీవావరణ వ్యవస్థను పునరుద్దరించడం’ అనబడే అంశాన్ని తీసుకొన ప్రచారం చేయడం జరుగుతున్నది. పర్యావరణ విచ్ఛిన్నానికి మరియు పేదరికానికి, అనారోగ్యానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుందని గమనించాలి.

ఐరాస పర్యావరణ కార్యక్రమంలో భాగంగా పర్యావరణానికి జరిగిన విధ్వంసాన్ని గమనించి, తగు కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశంతో రాబోయే 10-సంవత్సరాలను ‘పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దం (ఎకోసిస్టమ్‌ ‌రీస్టొరేషన్‌)’‌గా తీసుకొని పర్యావరణ పూర్వ వైభవాన్ని, స్వచ్ఛతను, ఆరోగ్యాన్ని, పరిశుద్దతను తిరిగి స్థాపించేలా చర్యలు చేపట్టుటకు నిర్ణయించడం ముదావహం. కరోనా మహమ్మారి విజృంభనతో ప్రపంచ మానవాళి నిస్సహాయ స్థితిలో భయకంపితం కావడం జరుగుతున్నది. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, ప్రకృతి సహజ స్థితిని విచ్ఛిన్నం చేసిన మానవుడు తగు భారీ మూల్యాలను చెల్లించవలసి వస్తున్నది. జీవావరణంతో తలపడితే మనిషి బతుకు నరకప్రాయం అవుతుందని అవగతమైంది. ఈ ప్రమాదకర దుస్థితిని గమనించిన ఐరాస ‘రీక్రియేట్‌ (‌పునర్‌ ‌సృష్టి), రీఇమేజింగ్‌ (‌తిరిగి పరిస్థితి అంచనా), రీస్టోర్‌ (‌పునరుద్దరించడం)’ అనే నినాదంతో 2021-2030 కాల వ్యవధిని ‘పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దం’గా పాటించుటకు 05 జూన్‌ 2021 ‌ముహూర్తాన్ని నిర్ణయించారు. కోల్పోయిన పునాదులను తిరిగి ప్రతిష్టించుకోవాడానికి సత్వరమే ప్రపంచ దేశాలన్నీ కంకనబద్దులు కావాలసిందే. వాతావరణానికి, జీవ వైవిధ్యతకు మరియు నేల క్షీణతకు విడదీయరాని సంబంధం ఉంటుంది. జీవ వైవిధ్య విచ్ఛిన్నంతో ప్రతి ఏటా 10 శాతం ఆర్థిక నష్టం జరుగుతోంది. సత్వరమే మేల్కొని పునరుద్ధరణకు పూనికలను యెడల విద్య, వైద్య మరియు ఉద్యోగ రంగాలు తిరోగమన దిశగా కదలడం ఖాయంగా రుజువైంది. ప్రపంచం సుస్థిరాభివృద్ధి దిశలో పయనించడానికి పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. అడవులను పోషించడం, నరికివేతను నిషేధించడం, వన్యప్రాణుల రక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో హరిత వనాలను పెంచడం, గాలి కాలుష్యాన్ని నిరోధించడం, ప్లాస్టిక్‌ ‌కాలుష్యాన్ని కట్టడి చేయడం లాంటి పలు చర్యలను తీసుకుంటూ పర్యావరణ పునరుద్దరణకు పూనుకోవాలి.

అకాలవర్ష వడగళ్ళు, తుఫానులు, సునామీలు, ప్రకృతి ప్రళయాలు, భూతాపం, మహానగరాల్లో గాలి కాలుష్యం, అంటువ్యాధుల వ్యాప్తి లాంటి ప్రకృతి హెచ్చరికలను మానవుడు అలక్ష్యం చేస్తే, ఎవరు త్రవ్విన గోతిలో వారే పడక తప్పదని నవ్య నరుడు కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. త్రాగడానికి పరిశుభ్రమైన నీరు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి, నడవడానికి ఆరోగ్యకరమైన మట్టి లేనప్పుడు మనిషి సాధించిన అభివృద్ధి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. భూ ఉపరితలంపై ఉన్న నీటిలో 2 శాతం మాత్రమే త్రాగడానికి యోగ్యతను కలిగి ఉందని, సహజ నీటి వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని సమాజం గుర్తించాలి. ప్రపంచ పర్యావరణ దినం-2021 కార్యక్రమ నిర్వహణ ఐరాస (పర్యావరణ కార్యక్రమం) మరియు పాకిస్థాన్‌ ‌సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆరోగ్యకర పర్యావరణ వ్యవస్థతో మాత్రమే జీవనోపాధులు పెరుగుతూ, సానుకూల వాతావరణ మార్పులు మరియు జీవ వైవిధ్య పరిరక్షణలు జరుగుతాయని గుణపాఠం చేర్చుకోవాలి. ‘పీపుల్స్ ‌డే’గా పిలువబడే ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ అవసరం, పునరుద్ధరణ అవశ్యకత, నేల-నీరు-గాలి కాలుష్య అదుపు జరిగితేనే ప్రాణికోటి (వృక్షజంతుజాలం) ఆరోగ్యంగా మనగలుగుతుందనే సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. పర్యావ’రణం’తో తలపడితే మనిషి మనుగడ కరువవుతుంది. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకొని, పరిస్థితులు విషమించక పూర్వమే పరిణతిని ప్రదర్షించి పర్యావరణానికి పట్టాభిషేకం చేద్దాం, సకల జీవకోటికి జీవం పోద్దాం.

burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply