పార్లమెంట్ సమావేశాలకు దూరంగా రాహుల్
రాహుల్‌తో పాటు దూరం కానున్న జైరామ్, దిగ్విజయ్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో రాహుల్ జోడోయాత్ర కొనసాగుతోంది. యత్ర కొనసాగు తున్నందున, రాహుల్‌గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు గైర్హాజరు కానున్నారు. రాహుల్‌గాంధీ, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్‌లు సమావేశాల్లో పాల్గొనడం లేదని శనివారం సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిరువురు రాహుల్‌గాంధీతో పాటు భారత్ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం జోడో యాత్రలో పాల్గొంటున్నారు. జోడో యాత్రను మధ్యలో నిలిపివేయడం అధిష్టానానికి ఇష్టంలేదని .. అందుకే సీనియర్ నేతలు శీతాకాల సమావేశాలకు గైర్హాజరుకానున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సమావేశాలు ఒక నెలరోజులు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. మరోవైపు రాజ్యసభ ప్రతిపక్ష నేత కొనసాగింపుపై సోనియాగాంధీ అధ్యక్షతన వ్యూహాత్మక కమిటీ సమావేశం జరగనుంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఒక వ్యక్తి, ఒకే పదవి పాలసీని దృష్టిలో ఉంచుకుని గతనెలలో విపక్షనేత పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల వరకు ఆయనను కొనసాగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాహుల్ భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. శనివారం మధ్యప్రదేశ్ లో యాత్ర 11వ రోజుకి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లోని అగర్‌మాల్వా జిల్లాలో రాహుల్ గాంధీకి వినూత్న స్వాగతం లభించింది. పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం తనోడియా పట్టణానికి చేరుకున్న ఆయన టీ కోసం స్వల్ప విరామం తీసుకున్నారు. ఆ సమయంలో రెండు లాబ్రడార్ జాతికి చెందిన కుక్కలు పూల బుట్టను అందించి స్వాగతం పలికాయి. అనంతరం రాహుల్…వాటితో ఫొటోలు దిగారు. లిజో, రెగ్జీ అని పిలుచుకునే అవి ఇండోర్ నివాసి అయిన సర్వమిత్ర నాచన్కి చెందినవి. రాహుల్ పాదయాత్రలో ప్రత్యేకతను చాటుకోవడం కోసం ఆరేళ్ల వయసున్న ఆ కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
రాహుల్ యాత్రలో కంప్యూటర్ బాబా
విమర్శలు గుప్పించిన బిజెపి…తిప్పికొట్టిన కాంగ్రెస్ నేతలు
మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో వివాదాస్పద స్వయం ప్రకటిత దేవుదైన నామ్‌దేవ్ దాస్ త్యాగీ అకా పాల్గొన్నారు. దీంతో బిజెపి విమర్శలు గుప్పించింది. ఆయననే కంప్యూటర్ బాబాగా పిలుస్తుంటారు. శనివారం ఉదయం అగర్-మాల్వా జిల్లాలోని మహుదియా గ్రామంలో త్యాగి రాహుల్ గాంధీతో యాత్రలో నడిచారు. జోడో యాత్రలో పాల్గొన్న ఆయన.. రాహుల్‌తో చాలా విషయాల గురించి మాట్లాడారు. జై శ్రీరామ్ అనకుండా జై సియారామ్ అనేలా బీజేపీ వారిపై ఒత్తిడి తేవాలని తనకు ఈ బాబాయే చెప్పినట్లు రాహుల్ వెల్లడించారు.ఓ ఆక్రమణ కేసులో అరెస్ట్ అయిన ఈ బాబా.. రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొనడంపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇండోర్ సపంలోని తన ఆశ్రమంలో అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తున్న భవనాన్ని కూల్చివేత సందర్భంగా పంచాయతీ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఈయనపై రెండేండ్ల క్రితం కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ జోడో యాత్రలో కంప్యూటర్ బాబా పాల్గొనడంపై ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నరేంద్ర సలూజా తీవ్రంగా విమర్శించారు.
మొన్న కన్హయ్యకుమార్.. నిన్న స్వర భాస్కర్.. ఇవాళ కంప్యూటర్ బాబా.. వీళ్లంతా జోడో యాత్రలో పాల్గొంటున్నారంటే ఇది ఎలాంటి జోడో యాత్రనో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో నిందితుడిగా ఉన్నారని, ఇవే ఆరోపణలపై జైలుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి వ్యక్తి రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో ఎలా నడుస్తాడని ప్రశ్నించాడు. బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ మాజీ మంత్రి రాజ్‌కుమార్ పటేల్ స్పందించారు. భారత్ జోడో యాత్రలో పలువురు సీర్లు, మత పెద్దలు భాగమవుతున్నారని చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యాత్రలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.