ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి వార్త తన హృదయాన్ని కలిచి వేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆయన మృతి చెందారని తెలిసి తీవ్ర షాక్కు గురైనట్టు తెలిపారు. గాయకుడిగా, సంగీతకర్తగా, నటుడిగా ఆయన ఎంతో ప్రతిభను కనబర్చారని పేర్కొన్నారు. లక్షలాది మంది సంగీత ప్రియులను ఎస్పీబాలు గానంతో అలరించారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారని తెలిపారు.
దశాబ్దాలుగా సంగీత ప్రపంచానికి ఆయన సేవలు అందించారని అన్నారు. దాదాపు 40వేల పాటలను వివిధ భాషల్లోపాడి ప్రజల్ని అలరించారని తెలిపారు. ప్రజల గుండెల్లో బాలు, ఆయన పాటు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి జాతికి ముఖ్యంగా సంగీత ప్రపంచానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై బాలు కుటుంబానికి, ఆయన అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించారు.