కొరోనాతో అతలాకుతలమైన బ్రిటన్ను ఇప్పుడు కొత్తరకం వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ అతివేగంగా వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. కొరోనా వైరస్‌తో బ్రిటన్‌లో చాలా మంది మరణించారు. ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సహా అనేక మంది ఐసొలేషన్‌లోకి వెళ్ళారు. కొరోనా వ్యాప్తి తగ్గిందన్న ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరి అయింది. ఇప్పుడు కొత్త వైరస్ కారణంగా జనం ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. బ్రిటన్‌కి యూరప్ దేశాల నుంచి విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. మన దేశం కూడా డిసెంబర్ 31వ తేదీ వరకూ విమాన సర్వీసులను బంద్ చేసింది. ఈ కొత్త వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. తమకు సమగ్ర సమాచారం అందలేదనీ, క్షణాల్లో వ్యాపించే ఏ వ్యాధికైనా స్వీయ నియంత్రణ ప్రథమ ఔషధమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉంటూనే, అపోహలు, వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఇదే మాదిరి హెచ్చరిక చేశారు. కొరోనా విషయంలో కూడా వైరస్ వ్యాప్తి కన్నా కూడా అనుమానాలు, వదంతుల వ్యాప్తి ఎక్కువగా జరిగింది. చాలా మంది కొరోనా భయంతో మరణించారు. సహజంగా రోగగ్రస్తులైన వారు కొరోనాకి సంబంధించిన వార్తలు వినగానే గుండె ఆగి మరణించిన వారు అనేక మంది ఉన్నారు. మన దేశంలో కొరోనా చికిత్సలు మూడు కోట్లు చేరుకున్నాయి. మరణాలు 44వేలు పైమాటే. క్రిస్మస్ సంబరాలకు జనం సమాయత్తమవుతున్న వేళ ఈ కొత్త వైరస్ ప్రజల ఆశలపై నీళ్ళు పోసింది.
స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. మన దేశంలో సెన్స్‌క్స్ 16 వందల పాయంట్లు పడిపోయింది. ఈ కొత్త వైరస్ బారిన పడినవారికి కొరోనా మాదిరిగానే జ్వరం, తలనొప్పి , వళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని బ్రిటన్ వైద్యులు తెలిపారు. కొన్ని వారాల క్రితం పది నుంచి 15 శాతం కొత్త వైరస్ కేసులు ఉండగా, ఇప్పుడు 60 శాతం పెరిగాయనీ, ఈ వైరస్ సోకిన వారిని కూడా క్వారంటైన్లలో ఉంచుతున్నట్టు వైద్యులు తెలిపారు. జాగ్రత్తలు పాటించడం అవసరమే కానీ, అనవసరమైన భయాలు పెట్టుకోవొద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. యూరప్ దేశాల్లో ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సంరంభం కనిపిస్తోంది. సెలవుల కారణంగా పర్యాటకుల సంఖ్య పెరిగింది. కలుసుకోవడాలు, సామూహిక సమావేశాల కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని వైద్యులు అనుమానిస్తున్నారు. అందుకే, చాలా చోట్ల సామూహిక ఉత్సవాలను రద్దు చేశారు. దేశంలో పలు చోట్ల ఇప్పటికే ఆంక్షలు అమలు జేస్తున్నారు. రెస్టారెంట్లు, క్లబ్బులు, ఇతర విహార కేంద్రాల్లో ఆంక్షలు విధించారు. కొత్త వైరస్ వల్ల మరణాల గురించి వార్తలు అందలేదు. అయితే, రోగగ్రస్తులైన వారి సంఖ్య వందల్లో ఉంటోంది.
వైరస్ పునరుత్పత్తిలో జన్యుకణాల్లో మార్పుల కారణంగా ఈ వైరస్ పుట్టి ఉండవొచ్చని అనుమానిస్తున్నారు. కొరోనా వైరస్ సోకిన వారు జాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శించడం వల్ల ఇలాంటి తిరగబెట్టే ధోరణులు వ్యాపించి ఉండవొచ్చని మరి కొందరు అంటున్నారు. మన దేశంలో కూడా కొరోనా వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోనందుకు తాజా సుప్రీమ్ కోర్టు హెచ్చరించింది. టీకాలు వొచ్చేస్తున్నాయన్న ధైర్యం జనంలో నిర్లిప్తతను పెంచుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు కూడా మార్గదర్శకాలను సక్రమంగా అమలు జరపడం లేదని పేర్కొంది. లండన్‌లో మన కన్నా స్వేచ్ఛ, సామూహిక సమావేశాలు ఎక్కువ. వాటి వల్లే కొత్త వైరస్ వ్యాపించి ఉండవొచ్చని భావిస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్‌కి మాత్రమే కాకుండా ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం వంటి యూరప్ దేశాలకు మన దేశం నుంచి విమాన సర్వీసులను నిలిపి వేసినట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకటించారు. ఈ దేశాల నుంచి ఇప్పటికే వొచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపి చికిత్సలు అందిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
కొత్త వైరస్ వ్యాప్తికి కొరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణం కాగా, అనుమానాలు, అపోహలు మరో కారణం. ఈ వైరస్ వల్ల ప్రజల్లో అధై•ర్యం ఇప్పటికే ఏర్పడింది. కొత్త వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తమ స్టాక్స్‌ను విక్రయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒత్తిడులకు లోనయ్యాయి. బ్రిటన్ స్టాక్ ఎక్స్చేంజిలో కూడా షేర్ల బాగా పతనమయ్యాయనీ, దాని ప్రబావం మన దేశంలోని స్టాక్ మార్కెట్లపై ఉందని స్టాక్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. విచ్చలవిడితనం, అపరిమితమైన స్వేచ్ఛ కారణంగా వైరస్ విస్తరణ శరవేగంగా జరుగుతోంది. దీనిపై అవగాహన పెంచే కార్యక్రమాలు ఎన్ని జరిగినా, మన దేశంలోనే కాదు. ఇతర దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, స్వీయ నియంత్రణ పాటించకపోవడం ముఖ్యకారణం. కొరోనా నియంత్రణకు మాస్క్‌లు ధరించాలనీ, భౌతిక దూరాన్ని పాటించాలన్న మార్గదర్శకాలను ఇప్పటికే చాలా మంది గాలికి వదిలేశారు. వైరస్ ఇంకా పలు ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉండటానికి ఇదే కారణం. బ్రిటన్‌లో ప్రారంభమైన కొత్త వైరస్ మన దేశంలో వ్యాపించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. వాటితో ఆ వైరస్ మన దేశంలో ప్రవేశించదనే ఆశిద్దాం.