Take a fresh look at your lifestyle.

ఆం‌దోళన కలిగిస్తున్న కొత్త వేరియంట్‌ .. అయినా ..!

ప్రపంచ దేశాలు మరోసారి భయాందోళనకు గురవుతున్నాయి. ఒమిక్రాన్‌ ‌పేరున కొత్త వేరియంట్‌ ‌త్వరత్వరగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశాలన్నీ మరోసారి అప్రమత్తమవుతున్నాయి. గత వేరియంట్‌లతో పోలిస్తే ఇది డేంజరెస్‌ అని అంటున్నప్పటికీ దీని విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య అధికారులు చెబుతున్నారు. అంత మాత్రాన నిర్లక్ష్యం చేయడానికి వీలులేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని మాత్రం వారు గుర్తు చేస్తున్నారు. దక్షిణాఫ్రిక పరిసర దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ ‌వెలుగు చూడడంతో ఇప్పటికే దక్షిణాఫ్రికా నుండి 27 దేశాల యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌విమాన ప్రయాణాలను నిలిపివేసింది. దీంతో యుఎస్‌ ‌కెనడా దేశాల నుంచి వొచ్చే ప్రయాణాలను కూడా నిషేధించారు తాజాగా దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వొచ్చిన ప్రయాణికుల్లో దాదాపు ఇరవై మందికి పైగా ఈ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ జరిగింది. దీంతో ఇప్పుడు ఇండియాతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఆందోళనకర వేరియంట్‌గానే చెబుతున్నది. ఇది చాలా ప్రమాదకరమైనదనే చెబుతున్నది. కానీ, గత వైరస్‌లకు దీనికి తేడా ఏమిటి, వాటి కన్నా ఇది నిజంగానే ప్రమాదకరమైనదా? లాంటి విషయాలను ఖచ్చితంగా ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. దీనిపై ఇప్పటికే దక్షిణాఫ్రికా పరిశోధనలను ప్రారంభించింది. అయితే తమ దేశమే ముందుగా ఈ కొత్త వేరియంట్‌ను బయటపెట్టిందని, కాని, వేరే దేశాల్లో ఇది తమకన్నా ముందు వొచ్చిందేమో తెలుసుకోకుండా తమ దేశ విమాన ప్రయాణికుల పట్ల నిషేధం విధించడం పట్ల ఆ దేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ వారం రోజుల్లోనే ఈ దేశంలో కొత్త కేసులు నాలుగు రెట్లు పెరగడంతో ఇతర దేశాలు ఆ దేశ ప్రయాణీకుల పట్ల ఆంక్షలు విధిస్తున్నారు.

ప్రపంచ దేశాలను గత మూడేళ్ళుగా అల్లకల్లోలం చేసి, లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కొరోనా వైరస్‌ ‌ప్రభావం క్రమేణా తగ్గుతున్నదనుకుంటున్న వేళ ఒమిక్రాన్‌ ‌పేరున మరో వేరియంట్‌ ‌విస్తరిస్తున్నది. ఇంత క్రితం డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకారిగా భావించారు. ఇప్పుడు దానికన్న ప్రమాదకారిగా ఒమిక్రాన్‌ ‌విస్తరించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఈ కొత్త వేరియంట్‌పై తక్కువ ప్రభావవంతంగా పనిచేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొరోనాకు సంబంధించిన టీకాను మనదేశంలో పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. గ్రామీణ ప్రాంతంలో ఇంకా చాలామంది టీకా వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రెండు డోసుల టీకా వేసుకున్న వారు బూస్టర్‌ ‌డోస్‌ ‌కూడా వేసుకోవాలని చెబుతున్నారు. అయితే దీని వల్ల ఇప్పుడు కొత్తగా వ్యాప్తి చెందుతున్న టీకాను నిరోధించగలమన్న గ్యారెంటీ ఏమీలేదని సైంటిస్టులు, వైద్య అధికారులు చెబుతున్నారు.

పాఠశాలలు, కార్యాలయాలు తిరిగి ప్రారంభమైనా అక్కడక్కడ తిరిగి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కార్యాలయాలకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. కొన్ని సాఫ్ట్‌వేర్‌ ‌కమిటీలు తమ సిబ్బందిని కార్యాలయాలకు రమ్మని చెబుతున్నా, సిబ్బంది మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. తాము మరికొంతకాలం వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌చేస్తామంటున్నారు. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈ కొత్త వేరియంట్‌ ‌భయపెడతున్న దశలో మళ్ళీ లాక్‌ ‌డౌన్‌లు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. కొరోనా మొదటిసారి వొచ్చినప్పుడు మన దేశంలోని పలు రాష్ట్రాలు చాలా వరకు నిర్లక్ష్యం చేశాయి. చాలా ఆలస్యంగా లాక్‌ ‌డౌన్‌ను ప్రవేశ పెట్టారు. ఆక్రమంలో ఆర్థికంగా ప్రజలు చాలా నష్టపోయారు. ప్రభుత్వాలు కూడా నష్టాలను చవిచూశాయి. రెండవ వేవ్‌లో మాత్రం ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నా తగిన వైద్య చికిత్సలు లభ్యం దొరకకపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ప్రైవేటులో లక్షలాది రూపాయలు చెల్లించినా లాభం లేకుండా పోయింది. ప్రాణాలు పోయి అప్పుల పాలైనారు. ఇప్పుడు ఒక వైపు కొత్త వేరియంట్‌ ‌దాడి, అంతకు ముందునుండే డెంగ్యూ లాంటి వ్యాధులు విస్తరించడం చూస్తుంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని వైద్య పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్య రంగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేస్తే తప్ప వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండవన్న వాదన వినిపిస్తున్నది. ఈ వైరస్‌ ‌మరెంత మందిని బలితీసుకుంటుందో మరి.

Leave a Reply