“ట్రంప్ తీసుకుని వచ్చిన ‘‘అమెరికా ఫస్ట్’’- అమెరికా జాతీయ వాదం విధానం నుంచి అగ్రరాజ్యం బయటపడుతుందా? శ్వేత సౌధ కొత్త అధిపతి జో బైడెన్ నేతృత్వంలో భారత-ఆమెరికా సంబంధాలు ఎలా ఉండనున్నాయి? భారత దేశాన్ని ‘‘ నేచురల్ పార్టనర్’’- సహజ భాగస్వామిగా ఎన్నికల ప్రచారంలో అభివర్ణించిన బైడెన్ ఆ దిశగానే సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తారా? అమెరికా గడ్డ పై మొదటి మహిళా ఉపాధ్యక్షురాలై చరిత్ర సృష్టించిన భారతీ మూలాలున్న నాయకురాలు కమలా హ్యారీస్ ఈ దిశగా ఎంత తోడ్పాటు అందిస్తారు? అమెరికాలో అధికార మార్పిడి జరుగుతున్న సమయంలో ఈ ప్రశ్నలు, చర్చలు, విశ్లేషణలకు ప్రాధాన్యత ఏర్పడింది.”
అమెరికా పగ్గాలు జో బైడెన్ చేతికి వచ్చాయి. 77 ఏళ్ల వయసులో 46వ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెడుతున్నారు. అమెరికాలో ఓ సెకెండ్ హ్యాండ్ కార్ షో రూమ్ ఓనర్ కొడుకుగా జో జీవితం ప్రారంభం అయ్యింది. చదువులో అంతంత మాత్రమే అయినా నాయకత్వ లక్షణాలు ముందు నుంచే ఆయనలో కనిపిస్తాయి. చిన్నప్పుడు నత్తి సమస్య ఉన్నా…తనకై తాను అభ్యాసం ద్వారా అధిగమించగలగడం జో స్వీయ నియంత్రణ, పట్టుదలను తెలుపుతాయి. అంతేకాదు యూనివర్శిటీలు, కాలేజీల్లో స్పీచ్‌లు ఇచ్చి మోటివేట్ చేసే స్థాయికి ఎదగారు బైడెన్. పుస్తకాలు, ఉపన్యాసాల ద్వారా ఆర్ధిక పరిస్థితి కూడా బాగా మెరుగు పరుచుకోగలిగారు. మధ్య తరగతి స్థాయి నుంచి అమెరికాలోని మిలియనీర్ల జాబితాకు చేరారు. ప్రోమిస్ మి డాడ్-ఏ ఇయర్ ఆఫ్ హోప్ అండ్ పర్సపస్, ప్రోమిసెస్ టు కీప్-ఆన్ లైఫ్ అండ్ పాలిటిక్స్ , ట్యాక్టిక్స్ వంటి పుస్తకాలు రాశారు. కొన్ని పుస్తకాలు సహ రచయితగా కూడా ఉన్నారు జో బైడెన్. రెండు సార్లు అమెరికా ఉపాధ్యక్షుడి పదవిని కైవసం చేసుకున్న రాజకీయ అనుభవం బైడెన్‌ది. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌కు భారతీ మూలాలు ఉండటం ఒక కీలక అంశం.
భారత్‌తో సంబంధాలు:
డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత దేశంతో అమెరికా సంబంధాలు బాగా మెరుగయ్యాయి. ముఖ్యంగా ట్రంప్‌కు, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య కుదిరిన వ్యక్తిగత స్నేహాన్ని కూడా ప్రపంచం చూసింది. హౌదీ మోడీ అనే కార్యక్రమాన్ని హోస్టన్‌లో ఏర్పాటు చేసినా…నమస్తే ట్రంప్ అని గుజరాత్ గడ్డ పై స్వాగతం పలికినా…ఇద్దరి మధ్య బలమైన స్నేహానికి సంకేతంలా నిలబడింది. ఇంకా చెప్పాలంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు బీజేపీ వర్గాలు కూడా కీలకంగా పని చేశాయి. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న నినాదమూ అమెరికాలో వినిపించింది. భారతీయ అమెరికన్ ఓటర్లు కీలకం కనుక సహజంగానే వీరిని ఆకర్షించేందుకు ట్రంప్ కూడా మోడీతో తనకున్న స్నేహాన్ని ప్రచారంలో ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అయితే పాకిస్థాన్, చైనాలతో మన సరిహద్దుల్లో ఉద్రికత్తలు, లఢఖ్ వద్ద చైనా అత్యుత్సాహం, భారీగా బలగాల మోహరింపు వంటి వరుస ఘటనల సమయంలో ట్రంప్ భారత్ కు అండగా నిలిచారు. చైనా దురాక్రమణ కుట్రలను ఖండించారు. అయితే అది భారత దేశం పై ఉన్న ప్రేమతోనా లేక చైనాతో ఉన్న పేచీతోనా అన్నది వేరే విషయం. మరో వైపు ట్రంప్‌లో ఉన్న కరుడుగట్టిన జాత్యహంకార తీరును మన దేశం కూడా చవి చూడాల్సి వచ్చింది. ఇరాన్‌తో అమెరికాకు ఉన్న విబేధాల వల్ల భారత దేశం ఇరాన్‌తో సంబంధాలను తగ్గించుకోవాల్సి వచ్చింది.
బైడెన్ ఎటు వైపు?:
బైడెన్ నేతృత్వంలో అమెరికా-ఇండియా సంబంధాలు ఎలా ఉండనున్నాయన్న చర్చ కీలకమైంది. లోతుల్లోకి వెళ్లే ముందు బైడెన్‌కు సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి బైడెన్ కశ్మీరీలకు బహిరంగ మద్దతును ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసినప్పుడు నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు కమలా హ్యారిస్ కూడా ఇదే వైఖరిని తీసుకున్నారు. జో పాకిస్థాన్‌లో అమెరికా దౌత్యవేత్తగా పని చేశారు. దౌత్యవేత్త హోదా పరంగా అప్పుడు అమెరికా-పాక్‌ల మధ్య సంబంధాలు పెరిగేందుకు తన వంతు కృషి చేసిన నేపథ్యం ఉంది. అంతేకాదు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ పాకిస్థాన్, చైనాలతో సానుకూలంగా వ్యవహరించారు అన్నఇమేజ్ కూడా బైడెన్‌కు ఉంది. అయతే వీటిని చూసి బైడెన్ పట్ల వ్యతిరేక అభిప్రాయం ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆ యా పదవుల్లో ఉన్నప్పుడు అప్పటి బాధ్యతలకు, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారు. దేశాధ్యక్షుడు అయిన తర్వాత సహజంగా ఒక వైడ్ వ్యూతోనే, విదేశీ సంబంధాలు, వాణిజ్య బంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో భారత్‌లో కాలుష్యం పై ట్రంప్ చేసిన వ్యా ఖ్యలను కూడా బైడెన్ ఖండించిన విషయం కూడా ఇక్కడ గుర్తు ఉంచుకోదగినదే.భారత్- అమెరికాకు సంబంధించి ప్రధానంగా మూడు అంశాల పట్ల నూతన అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందన్నది కీలకం.
మొదటిది వీసా నిబంధనల సరళీకరణ. ట్రంప్ అధ్యక్షుడిగా వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అమెరికన్ ఫస్ట్ అంటే స్థానిక అమెరికన్లకే ద్యోగాల్లో ప్రాధాన్యత అనే విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది మన ఐటీ రంగం పై ప్రభావం చూపింది. తాను అధ్యక్షుడినైతే వీసా నిబంధనలు సులభతరం చేస్తానని బైడెన్ ఎన్నికల సమయంలో మాట అయితే ఇచ్చారు కాని ఇది అంత తేలిక కాదు. బైడెన్ వీసా నిబంధనలు సరళీకరిస్తే స్థానిక అమెరికన్లు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. రెండోది ఇండో- అమెరికా వాణిజ్య సంబంధాలు. చైనా విషయానికే వస్తే అమెరికాతో పోటీ పడుతున్న చైనాకు కాస్త బ్రేక్ వేయాలంటే భారత దేశ సహకారం అమెరికాకు తప్పనిసరి. ట్రంప్ హయాంలో కుదిరిన భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందాలను బైడెన్ సమీక్షించే అవకాశం లేకపోలేదు. అలా చేస్తే మనకు ఒక రకంగా మేలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ తమ తెంపరితనంతో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించారు. అక్కడితో ఆగకుండాభారత్ పై కూడా ఒత్తిడి తీసుకువచ్చి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించుకునేటట్లు చేశారు. ఫలితంగా మన చమురు దిగుమతులు ఇరాన్ నుంచి తగ్గించుకుని… ఆ మేరకు అమెరికా నుంచి దిగుమతులు పెంచుకున్నాం. దీనితో భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయి. ఆర్ధికంగానూ మనం ఎక్కువ చమురు వదిలించుకోవాల్సి వచ్చింది. ఇరాన్ చమురు దిగుమతుల చెల్లింపులు రూపాయిల్లో నుంచి డాలర్లలోకి మారింది. ఇక మూడోది పాకిస్థాన్‌తో బైడెన్‌కు ఇదివరలో ఉన్న సత్సంబంధాల ప్రభావంఇప్పుడు ఏ రకంగా ఉంటుందనేది. చివరగా ఒకటి మాత్రం చెప్పొచ్చు… భారత దేశానికి అమెరికాతో స్నేహపూరిత సంబంధాలు ఎంత అవసరమో…అగ్రరాజ్యానికి కూడా మనతో చేతులు కలపడం అంతే అవసరం.