Take a fresh look at your lifestyle.

అమలుకు ఆమడ దూరంలో కొత్త విద్యావిధానం

కేంద్రం ఆమోదించిన జాతీయ విద్యావిధానంలో దేశంలో పేద కుటుంబాల పిల్లల విద్యాబుద్ధులకు తోడ్పడే విధంగా లేదు. దేశంలో ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్‌ ‌స్కూల్స్ ‌హవా అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఎల్‌కేజీ నుంచి వేల కొద్దీ ఫీజులు చెల్లించనిదే సీటు దొరికే అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ బడులను, సెకండరీ విద్యా విధానాన్ని పటిష్టం చేయడానికి బదులు ప్రైవేటు వర్గాలకు తోడ్పడే రీతిలో కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విద్యారంగానికి బడ్జెట్‌లో కేటాయింపుల ఊసే లేదు. విద్య ఉమ్మడి రంగంలో ఉండటం వల్ల రాష్ట్రాలు నిధుల సంగతి చూసుకుంటాయనే ధీమాతో కేంద్రం వ్యవహరించినట్టు కనిపిస్తోంది. 2030 నాటికి అందరికీ విద్య నినాదంతో కొత్త విధానాన్ని రూపొందించారు. పైగా, మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మార్చడం వల్ల విద్యారంగాన్ని కొన్ని అంశాలకే పరిమితం చేసినట్టు కనిపిస్తోంది. పీవీ నరసింహారావు 34 సంవత్సరాల క్రితం కేంద్ర విద్యా మంత్రిగా ఉన్నప్పుడు విద్యా శాఖ పేరును మానవ వనరుల శాఖగా మార్చారు. ఇలా మార్చడం వల్ల విద్యా రంగానికి చెందిన అన్ని అంశాలకూ ఈ శాఖ ద్వారా ప్రోత్సాహం లభించేది. అంతేకాకుండా నవోదయ పాఠశాలలు, గురుకుల పాఠాశాలలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల వ్యవస్థను తీసుకుని వచ్చింది కూడా పీవియే. ఆయన శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌ ‌లోని సెంట్రల్‌ ‌యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టాలని కేసీఆర్‌ ‌నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

విద్యారంగంలో పరిస్థితులు దేశవ్యాప్తంగా చాలా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలంటే కేవలం కొంత మందికి ఉపాధి కల్పించడం కోసమేనన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. మూడో ఏట నుంచి 18వ ఏట వరకూ నిర్బంధ విద్యావిధానం అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడం హర్షణీయమే కానీ, ప్రైవేటు, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల పోటీలో ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందో చెప్పలేం. ప్లస్‌ ‌టూ విద్యావిధానాన్ని రద్దు చేసి 5-3-3-4 వ్యవస్థను తీసుకుని వచ్చింది. అన్ని తరగతుల్లో ఒకే రకమైన విధానం ఉంది. జాతీయ విద్యా విధానం ఉన్నత విద్యలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐదో తరగతి వరకూ మాతృ భాషలో బోధించడం, ఒకే విద్యా సంవత్సరంలో రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వంటి మార్పులు సూచించారు. అయితే, ఆంధప్రదేశ వంటి రాష్ట్రాల్లో ప్రాథమిక విద్య దశ నుంచి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కొత్త జాతీయ విధానం వల్ల అలాంటి రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. తెరాస కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య వంటి వాగ్దానాలు చేసింది కానీ, ప్రస్తుతం ఉన్న విధానంలో అది అమలు జరిగే అవకాశాలు లేవు. విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి, యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీ వంటి అంశాల గురించి కొత్త విధానంలో ప్రస్తావన లేదు. విద్యా రంగాన్ని 34 సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోలేదనీ, ఆ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకే డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ ‌కమిటీ సిఫార్సుల మేరకు తాము చేపట్టామని కేంద్రం గొప్పగా చెప్పుకుంది. అయితే, పాఠాంశాల్లో మతపరమైన అంశాలను జొప్పించడానికి వాజ్‌పేయి హయాంలో ఆనాటి హెచ్‌ఆర్‌ ‌డి మంత్రి మురళీ మనోహర్‌ ‌జోషి ప్రయత్నించినట్టు వామపక్షాలు ఆరోపించడమే కాకుండా ఉద్యమాలను నిర్వహించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది. అలాగే, కొఠారీ కమిషన్‌ ఏనాడో సూచించిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.

ముఖ్యంగా, ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని ప్రైవేటు విద్యా సంస్థలు పాటించడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థలపై ప్రభుత్వాలకు అజమాయిషీ లేదు. ఫీజుల సంగంతి సరేసరి. ఆ సంస్థలు ఆకాశమే హద్దుగా ఫీజులు గుంజుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టడం లేదు. అలాగే, ప్రైవేటు విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఇతర పనులకు వినియోగించుకుంటున్నారు. వారికి నిర్ణీత పని వేళలు లేవు, నాల్గో వంతు జీతాలు చెల్లించి వారి చేత పనులు చేయించుకుంటున్నారు. సాంకేతిక విద్యా రంగంలో పేద వర్గాల్లో సాదా సీదా పరిజ్ఞానం గలవారికి ప్రవేశం లభించదు. కేవలం మెరిట్‌ ‌స్టూడెంట్స్ ‌మాత్రమే ఈ కళశాలల్లో ప్రవేశాన్ని పొందగలుగుతున్నారు. ఫీజులు ఆకాశాన్ని అంటడమే ఇందుకు కారణం. సంపన్న వర్గాల పిల్లలకు మెరిట్‌తో సంబంధం లేకుండా ఫీజు వీలైనంత ఎక్కువ గుంజి ప్రవేశం కల్పిస్తున్నారు. చాలా ప్రైవేటు స్కూల్స్‌లో క్రీడా మైదానాలూ, లాబ్‌లు లేవు, డ్రిల్లు మాస్టర్ల నియామకం అనేది ఇప్పుడు ఎక్కడా జరగడం లేదు. పిల్లల్లో సృజనాత్మకత పెంచే కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదు. అయితే, కొత్త విధానంలో సృజనాత్మకత పెంచే కార్యక్రమాలను చేపడతామంటున్నారు. అదెంతవరకూ సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి. వృత్తి విద్యా కోర్సులకు ప్రవేశం కల్పిస్తామనీ, చిన్న తరగతుల నుంచి వాటిని ప్రోత్సహిస్తామంటున్నారు. అది మంచిదే. కానీ, అందుకు శిక్షణ ఇచ్చే అధ్యాపక, ఉపాధ్యాయ వర్గాలు లేకుండా దానిని అమలులో పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి. దేశంలో 19.1 శాతం జనాభా 19-25 సంవత్సరాల మధ్య ఉన్నారు. వీరిలో చాలా మంది పాఠశాల విద్య కాగానే వివిధ కారణాల వల్ల యూనివర్శిటీ విద్యకు వెళ్ళడం లేదు. దీని వల్ల నిరుద్యోగం పెరిగి పోతోంది. యూనివర్శిటీ విద్యలోకి ప్రవేశాలను 50 శాతం పెంచాలని జాతీయ విద్యావిధానంలో పొందు పర్చారు. ఇది అమలులోకి రావాలంటే 3.5 కోట్ల సీట్లు పెంచాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలెన్నో ఉన్నాయి. అందువల్ల కొత్త విద్యావిధానం ఆశాజనక చిత్రంగానే ఉంది కానీ, అమలుకు ఆమడ దూరంలో ఉంది.

Leave a Reply