6 ఎకరాల ఖాళీ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలి
- ఉస్మానియా కోసం ఏడు రూపాయలు కూడా ఖర్చు చేశారా?
- బిల్డింగ్‌ను హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలి
- హాస్పిటల్ని సందర్శించిన కాంగ్రెస్ బృందం
ఉస్మానియా హాస్పిటల్ పాత భవనం హరిటేజ్ బిల్డింగ్ అని ఆ భవనాన్ని కాపాడి బాగుచేసి పరిరక్షణ చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ని సందర్శించింది కాంగ్రెస్ బృందం. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ… హాస్పిటల్ ఆవరణలో 6 ఎకరాల ఖాళీ స్థలం ఉందని ఆ స్థలంలో కొత్త హాస్పిటల్ భవనాన్ని అన్ని రకాల హంగులతో సాంకేతిక సౌకర్యాలతో నిర్మించాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ చాలా పురాతన చరిత్ర కలిగిన దవాఖాన అని, ఎంతో ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ అని ఏటా లక్షలాది మంది ఔట్ పేషంట్లు, దాదాపు రోజు 2 వేల మంది ఇన్ పేషంట్లకు ఇక్కడ చికిత్స జరుగుతుందన్నారు. ఏటా 60 వేల ఆపరేషన్లు జరుగుతాయని అన్నారు. ఈ హాస్పిటల్ కొత్త నిర్మాణం వెంటనే ప్రారంభించి పేద రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. సీఎం కేసీఆర్ వచ్చాక ఉస్మానియా హాస్పిటల్ నిర్లక్షానికి గురైందని దుయ్యబట్టారు. ఏడేళ్లలో కేసీఆర్ ఉస్మానియా రిపేర్ కోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని ఆరోపించారు.
ఉస్మానియా బిల్డింగ్‌ను పరిరక్షించాలని, ఉస్మానియా బిల్డింగ్ బేసిక్ స్టక్చ్ర బాగానే ఉందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేయాలని సూచించారు. సచివాలయాన్ని కడుతున్నారని, కానీ హాస్పిటల్ కట్టే సోయి లేదని ఉత్తమ్ తప్పుబట్టారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో కొరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరడం కేసీఆర్ అసమర్థతేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని, రాష్ట్రంలో కొరోనా కేసులు, మరణాలు పెరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో కొరోనా కమ్యూనిటీ స్ప్రె అవుతుందని తెలిసి కూడా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. మంత్రులు అబద్దాలు మాట్లాడుతున్నారని ఉత్తమ్‌కుమార్ మండిపడ్డారు. సామాన్యులకు అవసరమైన ఒక్క పని జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.