Take a fresh look at your lifestyle.

రైతు నడ్డి విరిచే కొత్త వ్యవసాయ చట్టం

“దేశంలో ఉన్నది 80 శాతానికి పైగా చిన్న రైతులేననీ, అలాంటి రైతులు వ్యయ ప్రయాసల కోర్చి పక్క రాష్ట్రాలకు వెళ్లి తమ ఉత్పత్తులను విక్రయించడం ఎంత వరకు సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అనే మాటే లేదనీ, అంటే రైతు పండించిన పంటను  విక్రయించే బాధ్యత పూర్తిగా రైతుదేననీ, దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదనే విషయం స్పష్టమవుతున్నది.”

కేంద్రం మాటలకు వాస్తవాలకు ఆమడ దూరం
పెట్టుబడిదారీ, దలారి వ్యవస్థకు మరింత ఊతం
పోటీ తత్వం పోయి కార్పొరేట్‌లకు అనుకూలం
తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కేసీఆర్‌

దేశంలోని రైతులకు లాభం చేకూరుస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టం వారి నడ్డి విరిచే విధంగా ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త చట్టంతో కేవలం బడా వ్యాపారులు, దలారికి మాత్రమే లాభం కలుగుతుందనీ, సామాన్య రైతులు నష్టపోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. గత నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టానికి ఆమోద ముద్ర పడింది. ఈ చట్టం ద్వారా రైతు తాను పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలు కలుగుతుందనీ, తద్వారా మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు,   రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు అక్కడికే వచ్చి కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని సైతం ప్రకటించింది. అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని వ్యవసాయదారులు, నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఉన్నది 80 శాతానికి పైగా చిన్న రైతులేననీ, అలాంటి రైతులు వ్యయ ప్రయాసల కోర్చి పక్క రాష్ట్రాలకు వెళ్లి తమ ఉత్పత్తులను విక్రయించడం ఎంత వరకు సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అనే మాటే లేదనీ, అంటే రైతు పండించిన పంటను  విక్రయించే బాధ్యత పూర్తిగా రైతుదేననీ, దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదనే విషయం స్పష్టమవుతున్నది.

పంట దిగుబడి అనే అంశం రైతు చేతిలో ఉండదనీ, అది రైతు వేసిన పంట దాని భూసారం, సాగునీటి వనరులు, వాతావరణం వంటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందనీ, ప్రస్తుతం ఉన్న మాదిరిగా  పంట నాణ్యతను బట్టి కాకుండా వ్యాపారులు, పెట్టుబడి దారులు అడిగిన ధరకే రైతులు తప్పని పరిస్థితుల్లో విక్రయించాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అలాంటప్పుడు  దలారులు, పెట్టుబడి దారులు ఏక మొత్తంగా రైతు ఉత్పత్తులను కొనడానికి ముందుకు వస్తారనీ, తాము అడిగినంత ధరకు సమ్మతిస్తేనే మొత్తం కొంటామని షరతు విధిస్తారనీ దీంతో రైతు తప్పని పరిస్థితిలో అదే ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఓవైపు, కొత్త వ్యవసాయ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిందో లేదో మరోవైపు, చిన్నచిన్న పట్టణాలలో సైతం  దలారులు, పెద్ద వ్యాపారులు పదుల సంఖ్యలో బహిరంగంగానే సొంతంగా కొనుగోలు కేంద్రాలు తెరచి రైతులు ఉత్పత్తులను తమకే విక్రయించాలని ప్రలోభ పెడుతున్నారు. కొత్త వ్యవసాయ చట్టం అమలులోకి వచ్చిన వెంటనే రిలయన్స్, అమెజాన్‌ ‌వంటి కార్పొరేట్‌ ‌మార్కెటింగ్‌ ‌సంస్థలు రంగంలోకి దిగుతాయనీ, దీని ద్వారా వ్యవసాయ మార్కెట్‌లో పలువురు పోటీదారుల మధ్య పాట పాడి ఎవరు ఎక్కువ ధరకు కొంటే వారికే పంట విక్రయం అనే ప్రస్తుత విధానానికి స్వస్తి పలికి పెట్టుబదిదారుడు అడిగిన ధరకే రైతులు విక్రయించే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న సామాన్య రైతు పరిస్థితి కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంతో మరింత దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు పొగాకు దిగ్గజం   వీఎస్‌టి (వజీర్‌ ‌సుల్తాన్‌ ‌టొబాకో )ని ఉదాహరణగా చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం వీఎస్టీ పరిశ్రమకు చెందిన వ్యాపారులు పొగాకు రైతుల వద్దకే నేరుగా వచ్చి ఏకమొత్తంగా వారి పంటను కొనుగోలు చేస్తామనీ, తమకు విక్రయించమని రైతులను ప్రలోభపెట్టే వారనీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంతో తిరిగి పాత పరిస్థితులే పునరావృతం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించింది. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా ఆమోదించింది. ఈ చట్టాన్ని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో టీఆర్‌ఎస్‌ ‌సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.. సీఎం కేసీఆర్‌ ‌సైతం కొత్త వ్యవసాయ చట్టం కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే విధంగా ఉందంటూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.

రైతుకు నష్టమే : గీతా ప్రసాద్‌, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత
కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న కొత్త వ్యవసాయ చట్టంతో రైతుకు నష్టం దలారి కి లాభం కలుగుతుందని ఉత్తమ రైతు అవార్డు గ్రహీత గీతాప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. గతంలో ప్రసిద్ధ వజీర్‌ ‌సుల్తాన్‌ ‌టొబాకో (వీఎస్‌టి) కంపెనీ పొగాకు పండించే కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడి రైతులతో పొగాకును గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా తమకే విక్రయించే విధంగా ముందుగానే ఒప్పందం చేసుకునేదని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం రైతులు పొగాకు పంటను ఆ సంస్థకే టోకున వారు చెప్పిన ధరకే విక్రయించే వారనీ ఆ తరువాత కంపెనీ యాజమాన్యం హైదరాబాద్‌కు వెళ్లి ఆ పొగాకును తమకు అనువుగా మలచుకుని సిగరెట్ల తయారీకి వినియోగించుకునే వారని చెప్పారు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందనీ, రైతుల పంటను కొనాలనుకునే రిలయన్స్, అమెజాన్‌, ‌మోర్‌ ‌వంటి బడా కంపెనీలు నేరుగా కొనుగోళ్లకు రాకుండా దలారీని పంపిస్తాయనీ, దలారీ యాజమాన్యాలు నిర్ణయించిన రేట్లకు కాకుండా తనకు ఇష్టం వచ్చిన రేటుకు పంటలను కొని రైతులకు నష్టం చేకూర్చి తాను మాత్రం లాభపడతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా దేశంలో 80 శాతంగా ఉన్న చిన్న రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి ఉండదనీ, దీంతో కనీస మద్దతు ధర కూడా లేకుండా రైతు నష్టపోతాడని గీతా ప్రసాద్‌ ‌వివరించారు.

బడా వ్యాపారులకే మేలు : కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు

కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఒట్టి బూటకమని  రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు కన్నెగంటి రవి స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టం పేరుతో కేంద్రం 1955 నాటి నిత్యావసర చట్టంలో సవరణలు తీసుకొచ్చిందనీ, దీని ప్రకారం…ఇకపై ఆహార ఉత్పత్తులు, విత్తనాలు ఇందులోనుంచి తొలగిపోతాయన్నారు. దీంతో వ్యాపారులు విచ్చలవిడిగా ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసి బ్లాక్‌ ‌మార్కెటింగ్‌ ‌ద్వారా ఎక్కువ ధరలకు విక్రయించే ప్రమాదం ఉందనీ, దీంతో పాటు గతంలో వ్యాపారులు వ్యవసాయ మార్కెట్లలో కొంత పరిధి మేరకు కొనుగోళ్లు చేసి ఆ లెక్కలను ప్రభుత్వానికి చెప్పాల్సి ఉండేదనీ, పరిధికి మించి ఎక్కువ కొనుగోలు గొడౌన్లలో నిల్వ చేస్తే ప్రభుత్వం దాడులు చేసి వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉండేదని చెప్పారు.

ఇప్పుడు పాన్‌ ‌కార్డు ఉన్న వారెవరైనా భారీ మొత్తంలో కొనే వీలు ఉండటంతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి లెక్క చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అలాగే, కొత్త చట్టం ప్రకారం గతంలో ప్రభుత్వాలు ఆహార ఉత్పత్తులపై ఆంక్షలు విధించే అధికారం ఉండేదనీ, దీంతో రైతులు స్థానికంగా పండించిన పంటలను అక్కడే విక్రమించే వారనీ, ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునే అవకాశం కల్పించడం వల్ల ఆహార ఉత్పత్తులన్నీ బడా వ్యాపారులు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని  పక్క రాష్ట్రాలకు తరలించంతో ఆయా రాష్ట్రాలలో ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. మరోవైపు, ఒప్పంద వ్యవసాయ చట్టం ప్రకారం….రైతులు తమకు ఇష్టమైన పంటలను పండిచడం కాకుండా వ్యాపారుల ఆదేశాల మేరకు పంటలను పండించాల్సి వస్తుందనీ, ఆ ప్రకారం ఒకవేళ రైతు పంటను పండించిన తరువాత వ్యాపారి కొనుగోలు చేయకపోయినా, లేదా అనుకున్న మేర పంట రాకపోయినా ఆ నష్టాన్ని రైతే భరించాల్సి వస్తుందనీ, దీనికి మధ్యవర్తిగా ప్రభుత్వం ఉండాలన్నది తమ డిమాండ్‌ అని కన్నెగంటి రవి స్పష్టం చేశారు.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అంటే …?         
 ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి , న్యూ దిల్లీ : మొట్టమొదటగా మన దేశంలో 1960 లో కనీస మద్దతు ధర విధానం ప్రకటించారు.. ఆ రోజుల్లోస దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉండేది.. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం పారిశ్రామిక రూపం దాలుస్తున్న తరుణంలో  విత్తనాలు ఎరువుల తయారీ  కంపెనీలు లాభార్జన కోసం హరిత విప్లవం (గ్రీన్ రెవల్యూషన్) నినాదం ప్రారంభించి, దీనివలన  వలన ప్రజలకి మేలు జరుగు తుందని నమ్మించిన సమయం. అప్పటి వరకు రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఆ సమయంలో హైబ్రిడ్ విత్తనాలు రసాయన ఎరువులు అంటే రైతులు అంగీకరించరని,  హరిత విప్లవ ప్రోత్సాహానికి రైతును కనీస మద్దత్తు ధర అంటూ  మభ్యపెట్టాలని నాటి వ్యవసాయ వ్యాపార వేత్తలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఫలితమే కనీస మద్దత్తు ధర పుట్టుక.
అసలు విషయానికి వస్తే మిరకిల్ బియ్యం .. మిరకిల్ గోధుమలు అంటూ హైబ్రిడ్ విత్తనాలు రైతులకిచ్చి విత్తనం తయారు చేసుకునే రైతు నైపుణ్యాన్ని హస్తగతం చేసుకునే ఏకైక కుతంత్రంలో భాగమే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అనే ప్రభుత్వం పారితోషికం. ఒక నిర్దిష్ట పంటను సేకరించినప్పుడల్లా ప్రభుత్వ సంస్థలు చెల్లించే ధరే రైతుకి అందేది..అదే రైతులకి అందే పారితోషికం.  23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇస్తామని ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించింది.
వీటిలో వరి, గోధుమ, మొక్కజొన్న, బజ్రా, జోవర్, రాగి మరియు బార్లీ అనే ఏడు రకాల తృణధాన్యాలు కాగా, (చనా) చనగలు, (అర్హర్ / తుర్) కంది, (ఉరాద్) మినపప్పు, (మూంగ్) పెసరపప్పు (మసూర్) మోసరి పప్పు/ఎర్ర కంది పప్పు అనే 5 రకాల పప్పు ధాన్యాలు కాగా; రాప్సీడ్-ఆవాలు , వేరుశనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ, నైజర్ సీడ్ అనే 7 రకాల నూనె గింజలున్నాయి.  వాణిజ్య పంటలలో పత్తి, చెరకు, కొప్రా, ముడి జనపనార 4 రకాలున్నాయి. ప్రభుత్వం ప్రతి ఏడు ఖరీఫ్.. రబీ.. సీజన్ లో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైస్  సిఫారసు మేరకు క.మ.ధ.  నిర్ణయిస్తుంది.
కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైస్, 3 అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది.  మొదటి అంశం.. రైతు తన పంట పండించే అందుకు పెట్టిన ఖర్చులను లెక్క కట్టటం, విత్తనాలు, ఎరువులు, క్రిమినాశక మందులు, పెట్రోల్ లేదా డీజిల్, కూలీలకు ఇచ్చిన జీతాలు, నీటి కోసం చేసిన ఖర్చు;   రెండవ అంశం కింద వాస్తవ ధర అలాగే లెక్కించిన విలువ, రైతు శరీర కష్టం, రైతు కుటుంబ కష్టం లెక్క కడతారు. ఇక చివరగా ఎంఫ్ ఎల్ తో పాటుగా రైతు చెల్లించే సొంత భూమి శిస్తులు కౌలు భూమి ఐతే అద్దె,  స్థిర ఆస్తుల లెక్క, వడ్డీ లెక్కలు పరిగణలోకి వస్తాయి.
ప్రభుత్వం ఈ ఏడు గోధుమల కనీస మద్దతు ధర క్వింటాల్ కి రు. 1975గా నిర్ణయించింది. అంటే క్వింటాల్ గోధుమ పండించటానికి రెండో మార్గ దర్శకత్వంలో ఖర్చు 960 రూపాయలు. రైతు ఖర్చు పోను రైతుకి 1015 రూపాయలు ఆదాయం సమకూరుస్తున్నామని ప్రభుత్వం భావిస్తున్నది.   దేశంలో రైతులు 118.43 మిలియన్ టన్నుల వరి పండిస్తే ప్రభుత్వం కొన్నది కేవలం 43 శాతం మాత్రమే. గోధుమలు తీసుకుంటే 107.39 మిలియన్ టన్నులు పండగా ప్రభుత్వం కొన్నది కేవలం 36.24. పత్తి విషయానికొస్తే  354.50 లక్షల బేళ్ళు పంట రైతులు పండిస్తే ప్రభుత్వం కొన్నది కేవలం 29.51 శాతం మాత్రమే.
23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దత్తు ధర ఇస్తామని ప్రకటించినప్పటికీ  కేంద్రం కొంటున్న పంటలు కనీసం ఐదు పంటలకు మించటం లేదు. వ్యవసాయం పరిశ్రమగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం జీన్ రెవల్యూషన్ అనే కొత్త దోపిడీ అమలులోకి రానున్న సమయంలో ప్రభుత్వం కాంట్రాక్టు ఫార్మింగ్ అనే అస్త్రం వదిలింది. ఇప్పుడు కనీస మద్దత్తు ధర అనే మరో అస్త్రం. అంతే!

Leave a Reply