Take a fresh look at your lifestyle.

ప్రభుత్వాల నిర్లక్ష్యమే కొరోనా మరణ మృదంగానికి కారణం

“అం‌తిమ వీడ్కోలు ..! కొరోనా వైరస్‌ ‌సంక్రమిత కోవిద్‌ 19 ‌వ్యాధి తో మరణించిన వారి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించలేని దుస్థితి ..!కొరోనా కాటుకు బలయిన తాతలు, నానమ్మలు , అమ్మొమ్మలకు గౌరవార్థం మనుమలు, మనుమరాళ్లు వీడ్కోలు తెలుపుతున్నట్లు స్పెయిన్‌ ‌చిత్రకారుడు జువాన్‌ ‌లుసేన వేసిన పేయింటింగ్‌ ..!”

మానవ మహమ్మారి కరోనా కేసు జనవరి 3న దేశంలో తొలిసారి నమోదు అయినది. 30 రోజుల అనంతరం తెలంగాణ రాష్ట్రములో మార్చి, 2న తొలి కేసు నమోదు అయినది. అంతటితో ఆగకుండా క్రమ క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలతోపాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోకి కరోనా వ్యాధి ప్రవేశించింది. ఇండియాలో తొలికేసు నమోదు అయిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినదనేది వాస్తవం. అప్పటికే చైనా, ఇటలీ లాంటి దేశాలలో కరోనా విలయతాండవం చేస్తున్నదనేది జగమెరిగిన సత్యం. జనవరి చివరి వారంలో మన దేశంలో తొలి కేసు నమోదు అయిన ప్రభుత్వం మార్చి 22 దాకా అనగా కరోనా తన పంజాను విసిరే దాకా ఎలాంటి వ్యూహాన్ని గాని, జాగ్రత్తలు గాని తీసుకోలేదనేది సత్యం. ప్రపంచ దేశాల దుస్థితి చూసైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొనాల్సి ఉండే. అలా కాకుండా పరిస్థితి చేయి దాటిపోయిన తరువాత మార్చి 22న జనతా కర్య్పూ విధించి లాక్‌డౌన్‌ ‌ప్రకటించింది. ఇదే పని ఫిభ్రవరి మొదటి వారంలో చేసి ఉంటే భారత దేశంలో ఇంత విపత్కరమైన పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని విద్యావంతుల వాదన. లాక్‌డౌన్‌ ‌విధించడంలో ఆలస్యమైనప్పటికి ప్రజలు ప్రభుత్వానికి సహకరించి తమ తోడ్పాటునందించారు. కాని ఈ గడ్డు కాలంలో సామాన్య ప్రజల జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా మారిపోయాయి. ప్రభుత్వాలు చూసి చూడనట్లు ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయి. అయినా ప్రజలు ఉండిలేక వెళ్ళదీసుకుంటూ ఎక్కడా కూడా తిరుగుబాటు చేయకుండా సంయమనం పాటిస్తూ కరోనా మహామ్మారి విషయంలో ప్రభుత్వాలకు సహకరించారు. వలస కూలీల విషయంలో ప్రభుత్వాలు కనీస మానవత్వాన్ని కూడా చాటుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు మైగ్రేట్స్‌ను ఆదుకున్నంతగా ప్రభుత్వాలు ఆదుకోలేదనేది వాస్తవం. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ‘‘బ్రతికుంటే బలుసాకైనా తిందాం, కాని కరోనా బారిన పడొద్దు’’అన్న వారి మాటలను ప్రజలు పాటించి నిరూపించినారు. ఈ సందర్భంలో ప్రాణాలకు తెగించి పారిశుద్య కార్మికులు, వైద్యరంగం, పోలీసులు తెలంగాణ సమాజానికి చేసిన సేవలు అభినందనీయం.

మార్చి మాసంలో తెలంగాణలో తొలి కేసు నమోదు అయినప్పుడు తరువాత మరికొన్ని కేసులలో కరోనా బారినపడ్డ వ్యక్తులకు చికిత్సనందించడంలో వారితో కలిసి తిరిగిన వారిని, వారి కుటుంబ సభ్యులను గుర్తించ డంలోను, క్వారంటైన్‌కు తరలించ డంలోను, ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటిం చడంలోను, తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు ప్రదర్శించిన తీరు కొంత ఉపయోగకరమే. దేశంలోను, రాష్ట్రంలోను రెడ్‌, ‌గ్రీన్‌, ఆరెంజ్‌ ‌జోన్లు ప్రకటించినంత కాలం కరోనా వ్యాధినేది కొంత మేరకు నియంత్రణలో ఉన్నది. కాని తదనంతర కాలంలో కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటికి ప్రభుత్వాలు అంచెలంచెలుగా రెడ్‌ ‌జోన్లను ఎత్తివేసి ఇక ఏ జోన్లు లేవు అంటూ తెలంగాణ కరోనా అరికట్టడంలో దేశానికే ఆదర్శమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించుకుంది. కాని కేంద్రం ప్రకటించిన అత్యధిక కరోనా కేసులున్న జిల్లాల్లో హైద్రాబాద్‌ ‌జిల్లా దేశంలో 25వ స్థానాన్ని పదిలపర్చుకుంది. అతి కొద్ది కాలంలోనే ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచన చేయకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మే 18వ తారీఖున లాక్‌డౌన్‌ ‌నుంచి కొన్ని సడలింపులిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. దీంతో కరోనా వ్యాధి మరింత విస్తరించింది. మే 18 వరకు తెలంగాణాలో 1550 కేసులు నమోదు కాగా, క్రమ క్రమంగా లాక్‌డౌన్‌ ‌సడలింపులతో జూన్‌, 8 ‌నాటికి (20 రోజుల కాలంలో) అదనంగా మరొక 2100 కేసులు నమోదు అయినాయి. అయినా ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం విషయములో అంటిముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నా కొన్ని ప్రాంతాలలో అధికంగా కేసులు నమోదు అవుతున్నా ఆ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించకుండా, చేపట్టాల్సిన నియంత్రణ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాలు స్థబ్దంగా ఉన్నాయి.

బ్రతికుంటే బలుసాకైనా తినవచ్చన్న వారు కరోనాతో కలిసి సహజీవనం చేయాలనడంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌-19 ‌విషయములో చేతులెత్తేసి ప్రజలను గాలికొదిలేసినట్లు స్పష్టంగా కనపడుతున్నది. ప్రైవేట్‌ ‌కార్పోరేట్‌ ఆసుపత్రులకు కరోనా చికిత్సలనుంచి మినహాయింపు ఇవ్వడంతోనే కరోనా బాధితులకు అందించాల్సిన వైద్యం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెల్లమెల్లగా వైదొలుగుతున్నట్లు సమాజానికి సంకేతాలిస్తున్నాయి. ఇది ప్రభుత్వాల యొక్క లోపభూయిష్టమైన విధానమనేది స్పష్టం. కరోనా నియంత్రణకు మొదట్లో వ్యవహరించినంత దూకుడుగా ఇప్పుడు నడుచుకుంటలేవనేది నిజం. ప్రస్తుతం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా సోకితే అతనితో కలిసి సహజీవనం చేసిన కుటుంబ సభ్యులకు టెస్టులు చేయకపోగా కనీసం వారిని క్వారంటైన్‌కు కూడా తరలించడం లేదు, ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా కూడా ప్రకటించడం లేదు. అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కరోనా విషయంలో రోజురోజుకు పెరుగుతుందనేది మన కళ్ళ ముందు నిరూపించబడింది. కరోనా టెస్టుల విషయానికొస్తే దేశంలో ఇప్పటి వరకు 46,66,000 టెస్టులు, ప్రక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో 44,54,000 టెస్టులు చేయగా, తెలంగాణలో చేసిన టెస్టులు మాత్రం 35, 000లు పైబడి మాత్రమే. ఇటు టెస్టుల విషయంలోను, అటు కరోనా నియంత్రణ విషయంలోను ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడుతుంది. ఇటీవల కాలంలో భారత వైద్య పరిశోధనా సంస్థ కూడా తెలంగాణ కేసులను ట్రేసింగ్‌ ‌చేయడంలో వెనుకబడే ఉందని ప్రకటిం చింది. అయినా ప్రభుత్వం తన పని తీరును సరిదిద్దుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ, నివారణ నుండి తప్పు కోవాలని చూస్తే కరోనా మరణమృదంగం మ్రోగుడేగాని, ఆగుడు ఉండదనేది ప్రభుత్వ విధి విధానలతో అర్థమౌతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలను గుర్తెరిగి క్యూబా లాగా బడ్జెట్‌లో వైద్యానికి అధిక శాతం నిధులను కేటాయించాలి. అలా కాకుండా ఇదే విధమైన ధోరణితో వ్యవహరిస్తే దేశంలోను, రాష్ట్రంలోను సామాన్య ప్రజల మరణాల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు కరోనాను వ్యక్తిగత రక్షణకు మాత్రమే వదిలేయ్యకుండా సామాజిక బాధ్యతతో తమ విధానాలను సమీక్షించుకొని ట్రేస్‌, ‌టెస్ట్, ‌ట్రీట్‌ ‌విధానాల ద్వారా ప్రభుత్వం ముందుకు పోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక కోరుతున్నది. అదే విధంగా ప్రజలల్లో రోగనిరోధక శక్తిని పెంచే విధంగా పోషక పదార్థాలను అందించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక అభిప్రాయ పడుతున్నది.
-పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, 9441661192

Leave a Reply