Take a fresh look at your lifestyle.

ఆంగ్లానికి అడ్డొస్తున్న మాతృభాషాభిమానం

ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్లమాధ్యమాన్ని 2020-21 విద్యా సంవత్సరం లో ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి న్యాయపరమైన చిక్కులు వైదొలగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన చేయాలనే దానిపై కొత్త విద్యావిధానంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ మాతృభాషాభిమానులమని చెప్పుకునే కొందరు తెలుగులోనే విద్యా బోధన జరగాలని పట్టుబడుతున్నారు. ఈ విధంగా పట్టుబడుతున్న వారి కుటుంబాల్లో పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం , కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే, వాదనతో తమ నోళ్ళు మూయించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందంటూ ఎదురు దాడి చేస్తుననారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఏ మాధ్యమంలో బోధన జరగాలే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే జరిపించగా, 80 శాతం మంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఆంగ్లంలోనే బోధన జరగాలని తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ లో తెలిపింది. కాగా ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో తెలుగు భాషపై మమకారం ఏపాటిదో పరిశీలిస్తే రాజకీయ , వ్యాపార కోణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వొస్తే, ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలోనే బోధన జరిపిస్తామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దాన పత్రంలో హామీ ఇచ్చింది. ప్రతి పేదవాని కుటుంబంలో పిల్లలకు ఆంగ్ల భాష అందుబాటులోకి తేవడమే కాకుండా, ఉన్నత విద్యావంతులు కావడానికి తమ ప్రభుత్వం చేయూతనిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు జేయడమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బాధ్యత .అయితే, ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలికి వదిలి వేయడం పరిపాటి అయింది . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పూర్వపు నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్ర ప్రదేశ్ చేస్తానంటూ ఐదేళ్ళూ గడిపేసింది. అంతేకాక, కార్పొరేట్ స్కూల్సు నడిపే ప్రముఖునికి ఉభయ శాసనసభల్లో సభ్యత్వం లేకపోయినా, కేబినెట్ ర్యాంక్ మంత్రిగా నియమించి, విద్యా రంగంలో పెను సంస్కరణలను తెస్తున్నామంటూ బుకాయించింది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారడానికి కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలే కారణమన్న సంగతి అందరికీ తెలుసు. డబ్బున్నవాడికే చదువు చందంగా రాష్ట్రంలో పిల్లల్ని చదవించడం భారంగా మారడంతో జగన్ సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా చాలా మంది తల్లితండ్రులు మొరపెట్టుకున్న మీదట ప్రతి పేదకుటుంబానికి చెందిన పిల్ల, పిల్లవానికి ఆంగ్ల భాషా బోధన అందుబాటులోకి తెస్తానని ఆయన వాగ్దానం చేశారు. అయితే, ఆయన వాగ్దానం అమలు జరిగితే, రాష్ట్రంలో వాణిజ్య ప్రాతిపదికన నిర్వహించబడుతున్న ఆంగ్లమాధ్యమ పాఠశాలలు మూత పడతాయి. వాటి నిర్వాహకులే రాజకీయ ఒత్తిడుల ద్వారా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయన్నది రాష్ట్రంలో సామాన్యులకు కలిగిన నిశ్చితాభిప్రాయం. ఆంగ్ల భాష మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా, తెలుగు భాష బోధన కొనసాగిస్తామని జగన్ ప్రభుత్వం పదే పదే వాగ్దానం చేస్తున్నా, తెలుగు భాషాభిమానులమని చెప్పుకునే రాజకీయ ప్రత్యర్ధులు తమ అనుకూల ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించడమే కాకుండా, హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.

ఆధునిక విద్యావిధానంలో కంప్యూటర్ల ప్రాధాన్యం పెరిగింది. కంప్యూటర్లపై శిక్షణ పొందేందుకు ఆంగ్ల మాధ్యమాన్ని నేర్చుకోవడం తప్పని సరి. పోటీ ప్రపంచంలో ఏ ప్రవేశపరీక్షకు వెళ్ళాలన్నా విద్యార్ధినీ విద్యార్ధులకు ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి. తెలుగును అసలు నేర్పబోమనీ, చదువుకోవద్దనీ జగన్ ప్రభుత్వం అనడం లేదు. దురుద్దేశ్య పూర్వకంగా కొందరు పనికట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారు. మండలానికో తెలుగు మీడియం స్కూలుని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసింది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారనడానికి మైక్రో సాప్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచాయ్ వంటి వారెందరో నిదర్శనంగా నిలుస్తున్నారు. విద్యా హక్కుతో పాటే, ఆంగ్లవిద్యను అభ్యసించడం కూడా ఒక హక్కు అనే నినాదం అన్ని రాష్ట్రాల్లో వినిపిస్తోంది.అదేదో జగన్ మాత్రమే కుట్ర పూరితంగా అమలు జేస్తున్నారని చేస్తున్నదంతా దుష్ప్రచారం. నిజానికి తెలుగుదేశం నాయకుల పిల్లలూ, మనవలూ, మునిమనవలూ అంతా ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. ఒక్కసారి హైదరాబాద్ మాదాపూర్ వెళ్ళి చూస్తే అక్కడి గ్లోబల్ స్కూల్స్ ను ఎవరు నిర్వహిస్తున్నారో,వాటిల్లో చదువుతున్నవారెవరో తెలుస్తుంది. జగన్ ప్రవేశపెట్టిన ప్రతి ప్రజోపయోగ పథకాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం అన్ని స్థాయిల్లో తమకు ఉన్న పలుకుబడినీ, పరిచయాలను ఉపయోగించుకుంటోంది. ఎస్సీ,ఎస్టీ , మైనారిటీ,. అట్టడుగు వర్గాల వారి పిల్లలకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంచేట్టు చేయడానికే జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ వర్గాల వారు వేలకు వేలు డొనేషన్లు కట్టి తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళలో చదివించలేరు. వారి కోసమే ఈ పథకాన్ని తెచ్చింది.అయితే, ఈ పథకం అమలు జరిగితే తమ వ్యాపార సంస్థలు బంద్ అవుతాయన్న భయంతోనే తెలుగు భాషపైన ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతున్నారు. వారు చూపుతున్న మాతృభాషాభిమానం కృత్రిమంగా కనిపిస్తుంది. జగన్ పథకాలను వ్యతిరేకించేవారి ఉద్యమాలన్నీ ఈ రీతిలోనే సాగుతున్నాయి.

Leave a Reply