Take a fresh look at your lifestyle.

మాతృభాషను పరిరక్షించుకోవాలి

మన భావాలను ఇతరులకు వ్యక్తం చేయడానికి ఉపకరించే సాధనమే భాష. భాష మానవునికి మాత్రమే స్వంతం. భాషకు, సమాజానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రజా జీవనంలో భాష విడదీయరాని భాగం. దానిలో కలుగ చేసుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా వివాదాలకు దారి తీయవచ్చు. మతం తరువాత జనం జోక్యాన్ని ససేమిరా అంగీకరించని అంశం ఏదైనా ఉందంటే అది భాషే. భాష మనుషుల్ని కలుపుతుంది. విడగొడుతుంది. ఏ భాష మాట్లాడేవారికైనా తమ భాష మీద విపరీతమైన అభిమానం ఉంటుంది. బహుభాషలకు నిలయమైన మన భారతదేశంలో చిన్నా చితకా అన్నీ కలిపి 1652 భాషలు మాట్లాడేవారుండగా అంచులు 40 భాషలకు మాత్రమే లిపి ఉంది. వీటిలో ప్రధాన భారత జాతీయ భాషలుగా 18 ప్రాంతీయ భాషలను గుర్తించారు. దేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం తెలుగువారిదే. 1966లో తెలుగును అధికార భాషగా గుర్తిస్తు చట్టం రూపొందించింది. ప్రభుత్వ శాఖలు సమస్త ఉత్తర ప్రత్యుత్తరాలు నియమాలు, నిబంధనలు తెలుగులోనే జరగాలని ఉత్తర్వు జారీ అయ్యింది.

అధికార భాషగా తెలుగును అమలు పర్యవేక్షించడానికి 1974 మార్చి 19న అధికార భాషాసంఘం ఏర్పాటు అయ్యింది. గతమెంతో ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష దశాబ్ధాల నిర్లక్ష్యంతో సొంత గడ్డపైనే తెలుగుకు పరాయితనం, పరాభావాలు ఎదురువుతున్నాయి. అన్ని స్థాయిల్లో అధికార భాషగా తెలుగుకు శాసనం చేసిన తరువాత కూడా బోధనలో, ఏలుబడిలో నిత్య వ్యవహారాల్లో ఇంగ్లీష్‌ ‌వాడకం నిరాఘాటంగా కొనసాగుతోంది. మాతృభాష కన్నా పరాయి భాష ఎక్కువై ఈ నేలపై పుట్టి బిడ్డలెందరో తెలుగు రాయలేక పోయున్నారు. తెలుగురాక పోవడం, చదవలేక పోవడం ఇంగ్లీష్‌లో మాట్లాడటమే గొప్ప అనే భావన తల్లిదండ్రుల్లో గూడుకట్టుకుని పోయింది. ఇంగ్లీష్‌లో చదివితేనే తమ పిల్లలు గొప్ప స్థాయికి చేరుకుంటారనే భావనతో తెలుగు వాళ్ళకు మాతృభాష మీద అయిష్టత పుట్టుకొచ్చింది. తెలుగులో చదువుకుంటే తమ పిల్లలకు భవిష్యత్‌ ఉం‌డదన్న దురభిప్రాయానికి వచ్చేశారు.

తెల్లదొరల పాలనలోనూ తెలుగు ఇంత నిర్లక్ష్యానికి గురి కాలేదు. మనవాళ్ళు తెలుగు మాధ్యమంలో చదివి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐ.ఏ.ఎస్‌, ఐ.‌పి.ఎస్‌.‌లు కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేశ విదేశాల్లో తమ ప్రతిభతో మాతృభూమికి పేరు తెస్తున్న తెలుగు బిడ్డల్లో చాలా మంది మాతృభాషా మాధ్యమంలోనే చదువుకుని ఉన్నత స్థానాలకు వచ్చినవారేనన్న విషయాన్ని విస్మరిస్తున్నాము. ఒకవైపు మన పొరుగు రాష్ట్రాల్లో మాతృభాష బ్రహ్మాండంగా వర్దిల్లుతుంది. తమిళనాడు రాష్ట్రంలో తిరుక్కురళ్‌ ‌సూక్తుల్తోనే శాసన సభ కార్యక్రమాలు ప్రారంభమౌతాయి. తమిళం చదివిన వారికే అక్కడ సర్కారి కొలువులు కట్టబెడుతున్నారు. సినిమా పేర్లు, డైలాగులు తమిళంలోనే ఉండాలనే అంశానికి చలనచిత్ర పరిశ్రమ ప్రాధాన్యత ఇస్తుంది. సువర్ణ కర్నాటక’’ పేరిట ప్రతి సంవత్సరం కర్నాటకలో బ్రహ్మాండంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించే సంస్కృతి కర్నాటకలో క్రమంగా పెరుగుతున్నది. మాతృభాను ఆదరించాలనే పట్టుదల ప్రజానీకంలో ఉండటం. ప్రభుత్వాల ప్రోత్సాహం ఇందుకు కారణం.

ప్రపంచంలోని అన్ని భాషలకు మాండలిక భేదాలు ఉంటాయి. అదే విధంగా తెలుగు భాషలో కూడా ఉన్నాయి. స్థల మాండలికాలు, వర్గ మాండలికాలను గుర్తించి విస్తృత పరిశోధనలు జరగాలి. తెలుగు రక్షించుకోవడం, తెలుగు భాషకు పునర్‌వైభవం తీసుకు రావడమంటే ఇంగ్లీషును పూర్తిగా నిర్లక్ష్యం చేయడమని కాదు. మాతృభాషలో విద్యాబోధన, పిల్లల్లో నైపుణ్యాలు పెరుగుతాయన్న వాస్తవాన్ని అంగీకరిస్తూ ఆంగ్లాన్ని ఒక సబ్జెక్టుగా బోధించాలి. అంతే తప్ప పూర్తిగా చదువులన్నీ ఆంగ్లమయం చేయడం కాదు. విద్యార్థులకు ఆసక్తిని కలిగేలా పాఠ్యాంశాలను రూపొందించాలి. తెలుగు అంటే అర్ధం కాని పద్యాలు భారమైన చందస్సులు కాకుండా సులభతరమైన సాహిత్యాన్ని విద్యార్థులకు చేరువ చేయాలి.

తెలుగు మాధ్యమంలో బోధన ను తప్పనిసరి చేస్తూ తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు పక్కాగా అమలు అయ్యేలా చూడాలి. తెలుగు భాషాభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. ఇది ప్రాధాన్యత గల మంత్రిత్వ శాఖగా దీనిని గుర్తించాలి. తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యతనివ్వాలి. ఇంటర్‌ ‌మీడియట్‌ ‌వరకు ఎక్కువ మార్కుల కోసం సంస్కృతం ఇతర భాషలు ఎంచుకునే విధానానికి అడ్డుకట్టవేయాలి. తెలుగులోని అన్ని మాండలికాలపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాలి. మన సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదిస్తున్న రచయితలను, వివిధ శాస్త్రాలు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్న వారిని సముచితంగా గౌరవించాలి. కార్యాచరణ జరగాలి. కార్యరూపం దాల్చాలి.

suresh kaleru
సురేష్‌ ‌కాలేరు –
రాష్ట్రసహాద్యక్షులు
తెలంగాణా ఉద్యోగుల సంఘం
9866174474

Leave a Reply