Take a fresh look at your lifestyle.

బ్రిటిష్‌ ‌వారి కన్నా మొండిగా మోడీ ప్రభుత్వం.. ఇది ప్రజాప్రతినిధుల మాట

రైతులతో   చర్చల పేరిట ప్రభుత్వం తొమ్మిది దఫాలు జరిపిన  సమావేశాల్లో  రైతు ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.   రైతులు  ఆందోళన జరుపుతున్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో  పాక్‌ ‌సరిహద్దుల్లో కూడా లేనంతగా భద్రతా దళాలను మోహరించారని వారు ఆరోపిస్తున్నారు.  జనవరి  26వ తేదీ ర్యాలీనాడు తప్ప మిగిలిన   ఆరవై ఆరు రోజుల నుంచి తాము శాంతియుతంగానే ఆందోళన సాగిస్తున్నామనీ, తమ మీద ఎందుకింత కక్ష అని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌బ్రిటిష్‌ ‌వారు కూడా తాము తెచ్చిన చట్టాలను ప్రజాభిప్రాయాన్ని మన్నించి వెనక్కి తీసుకున్నారనీ, స్వతంత్ర భారత దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం సాగు చట్టాలపై ఎందుకింత పట్టుపడుతోందో తెలియడం లేదని రాజ్యసభలో కాంగ్రెస్‌ ‌నాయకుడు గులామ్‌ ‌నబీ ఆజాద్‌ అన్నారు. సాగు చట్టాలపై రైతులు సాగిస్తున్న ఆందోళనను అణచివేయడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తుంటే,అంతగా ఈ ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. తాజాగా పర్యావరణ వేత్త గ్రెటా ధన్‌ ‌బర్గ్ , ‌హాలీవుడ్‌ ‌పాప్‌ ‌స్టార్‌ ‌రెహనా మద్దతు ప్రకటించారు. వెంటనే కంగనా రౌనత్‌ ‌స్పందిస్తూ రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని దేశ విభజన ఉద్యమంగా అభివర్ణించారు. భారత్‌ ‌ను మరోసారి చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, మోడీని వ్యతిరేకించేవారంతా దేశ విభజనను కోరుతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్య ఎక్కడా లేదు. కంగనా రనౌత్‌ ‌వ్యాఖ్య చూస్తుంటే, లోక్‌ ‌సభ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి, బీహార్‌ ‌కి చెందిన బీజేపీ నాయకుడు గిరిరాజ్‌ ‌సింగ్‌ ‌వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. మోడీని వ్యతిరేకించేవారికి భారత్‌ ‌లో స్థానం లేదు, వారంతా పాక్‌ ‌కి వెళ్ళిపోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పటికీ అగ్నిని రాజేస్తుంటుంది. భారతీయ జనతాపార్టీ వ్యక్తి ఆరాధనకు వ్యతిరేకమని ఆ పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. మోడీని ఆరాధించేవారు దేశంలో చాలా మందే ఉన్నారు. గతంలో నెహ్రూ,ఇందిరలను ఆరాధనా భావంతో చూసిన వారిని భారతీయ జనసంఘ్‌, ‌బీజేపీ నాయకులు వ్యక్తి ఆరాధన ప్రజాస్వామ్యంలో పనికి రాదని హెచ్చరించేవారు. అలాగే, కుటుంబ వారసత్వం కూడా. ఇప్పుడు అలాంటి అవలక్షణాలన్నీ బీజేపీలోనే వచ్చి కూర్చుంటున్నాయి. ఇంతకీ కంగనా రనౌత్‌ ఈ ‌మద్య ఇలాంటి వివాదాస్పద ప్రకటనలే చేస్తున్నారు.

రైతుల ఉద్యమాన్ని పంజాబ్‌, ‌హర్యానా రైతులే ప్రారంభించి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులంతా దానికి మద్దతు ఇస్తున్నారు. రైతులతో చర్చల పేరిట ప్రభుత్వం తొమ్మిది దఫాలు జరిపిన సమావేశాల్లో రైతు ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రైతులు ఆందోళన జరుపుతున్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో పాక్‌ ‌సరిహద్దుల్లో కూడా లేనంతగా భద్రతా దళాలను మోహరించారని వారు ఆరోపిస్తున్నారు. జనవరి 26వ తేదీ ర్యాలీనాడు తప్ప మిగిలిన ఆరవై ఆరు రోజుల నుంచి తాము శాంతియుతంగానే ఆందోళన సాగిస్తున్నామనీ, తమ మీద ఎందుకింత కక్ష అని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

హర్యానా రైతులను చీల్చేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే, రైతులంతా ఒకే తాటిపై నిలిచి ప్రభుత్వంతో పోరాటాన్ని సాగిస్తామని చెబుతున్నారు. కులపరమైన సమీకరణలు చేయడానికి కూడా ప్రభుత్వ అనుకూల వర్గాలు వెనకాడటం లేదు. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌రాజస్థాన్‌ ‌లకు చెందిన జాట్‌ ‌కులస్తులు ఎక్కువ మంది ఈ ఉద్యమంలో పాల్గొంటున్నప్పటికీ, ఇతర వెనక బడిన కులాల వారు కూడా పాల్గొంటున్నారని కిసాన్‌ ‌మోర్చా రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించినట్టు 18 మాసాల వరకూ కాకుండా మొత్తంగా సాగుచట్టాలను ఎత్తివేయాలనీ, వొచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారో చూద్దామని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు ఈ చట్టాలపై సమగ్రమైన అవగాహన లేదని కొందరంటున్నప్పటికీ అది నిజం కాదు.ఉద్దేశ్య పూర్వకంగానే ఈ చట్టాలను తెచ్చారు. వ్యవసాయరంగాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి కార్పొరేట్‌ ‌వర్గాలకు అందించాలన్నదే మోడీ ప్రభుత్వ లక్ష్యమని ఈ చట్టాలను లోతుగా పరిశీలించిన వారు అంటున్నారు. ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు రైతులు జనవరి 26వ తేదీ నుంచి కనిపించడం లేదనీ, వారి బాగోగులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని గులామ్‌ ‌నబీ ఆజాద్‌ ‌స్పష్టం చేశారు. మరో వంక జనవరి 26వ తేదీ ఘటనలపై పిటిషన్‌ ‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తున్నందున జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, జనవరి 26వ తేదీ ఘటనకు బాధ్యునిగా ఆరోపణలకు గురైన దీప్‌ ‌సిద్ధూ అనే యువనాయకుడి జాడ తెలిపిన వారికి లక్ష రూపాయిలు, మరి కొందరి నాయకుల జాడ తెలిపిన వారికి ఏభై , పాతికవేల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. దీప్‌ ‌సిద్ధూ ప్రధానమంత్రి మోడీతో ఫోటోలు దిగిన సంగతి ఆనాడే వెల్లడి కావడమే కాకుండా,ఆ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అలాంటప్పుడు ఆ యువకుని జాడ తెలిపిన వారికి నజరానా ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వాన్ని ఇంటలిజెన్స్ ‌వర్గాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని పిస్తోంది. ప్రభుత్వానికి సరైన సమాచారాన్ని అందించకుండా దాచి పెడుతున్నారేమోనన్న అనుమానం.

Leave a Reply